start up Diary
-
ఈ టూర్లు.. మహిళలకే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటక ప్రాంతాలను సందర్శించడమంటే అందరికీ ఇష్టమే. కానీ, సమస్యల్లా ఏ ప్రాంతానికి ఏ సమయంలో వెళ్లాలి? టికెట్ల బుకింగ్స్.. స్థానిక భోజన వసతుల ఏర్పాట్లెలా? ఇవే. మహిళలకైతే మరీను. వీటి పరిష్కారమే రష్మీ చద్దా చేత వోవోయెజ్ను ఆరంభింపజేసింది. మహిళలకు మాత్రమే సేవలందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు రష్మీ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. పలు బహుళ జాతి కంపెనీల్లో పని చేశా. ఉద్యోగ రీత్యా పలు దేశాలకు తిరిగా. వెళ్లిన ప్రతి చోటా ప్రయాణ ఇబ్బందులెదురయ్యేవి. హోటల్ బుకింగ్‌తో మొదలుపెడితే స్థానిక టూరిజం ప్రదేశాలు, గైడ్, ఆహార ఏర్పాట్లు ప్రతిదీ ఇబ్బందే. ఇదే నాకు వ్యాపార అవకాశాన్ని కల్పించింది. 2016 అక్టోబర్‌లో రూ.6 లక్షల పెట్టుబడితో ఢిల్లీ కేంద్రంగా వోవోయెజ్.కామ్ సంస్థను ప్రారంభించా. ఠీౌఠిౌy్చజ్ఛ.ఛిౌఝలో వో అంటే ఉమెన్ అని, వయాజ్ అంటే యాత్ర అని అర్థం. మొత్తంగా మహిళల జర్నీ అని అర్థం వచ్చేలా దీన్ని ఆరంభించా. విదేశీయులు తొలుత చూసేది తాజ్ మహలే.. అమెరికా, జపాన్, జర్మనీ దేశాల నుంచి విదేశీ పర్యాటకులు ఎక్కువగా మా సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రథమంగా వీళ్లు సందర్శించేది తాజ్ మహల్. ఆ తర్వాత హంపి, వారణాసి ప్రాంతాలు. ఈ మధ్య కోల్‌కతా, హైదరాబాద్ సందర్శకులూ పెరుగుతున్నారు. ప్రస్తుతం నెలకు 60 ట్రిప్పులు జరుగుతున్నాయి. ఏడాదిలోగా నెలకు 250 టిప్పులు నిర్వహించే స్థాయికి చేరాలని లకి‡్ష్యంచాం. ప్రతి బుకింగ్‌పై 20 శాతం కమీషన్ ఉంటుంది. గత నెలలో రూ.6.5 లక్షల లాభాన్ని ఆర్జించాం. ప్రతి నెలా 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. సొంతంగా కార్ల సేవలు.. ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో మరో 12 మందిని నియమించుకోనున్నాం. ఛత్తీస్‌గఢ్ పర్యాటక ప్రచారం నిమిత్తం స్థానిక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన (మార్చి 8) సేవలను ప్రారంభిస్తున్నాం. ‘‘కస్టమర్లను ఇంటి నుంచి విమానాశ్రయానికి, స్థానిక ప్రదేశాల పర్యటనకు తీసుకెళ్లటానికి సొంతంగా కార్లతో పాటు మహిళా డ్రైవర్లను నియమించుకుంటున్నాం. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. పలువు రు విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిధుల సమీకరణకు మరికొంత సమయం పడుతుంది’’ అని రష్మీ వివరించారు. దేశ, విదేశాల్లో వెయ్యి మంది వెండర్లతో ఒప్పందం మన దేశంతో పాటూ జపాన్, భూటాన్, దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, యూరప్, అమెరికా, జర్మనీ వంటి పలు దేశాల పర్యాటక ప్రాంతాలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా స్థానిక ప్రదేశాల్లోని హోటళ్లు, బస్సు, విమాన, గైడ్స్ కోసం సుమారు వెయ్యి మంది వెండర్లతో అగ్రిగేట్ చేసుకున్నాం. విమాన టికెట్ల కోసం స్పైస్ జెట్,విస్తారా, ఇండిగోలతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 252 ట్రిప్పులు నిర్వహించాం. ట్రిప్పుకు గరిష్టంగా 38 మంది సభ్యులుంటారు. మొత్తం కస్టమర్లలో హైదరాబాద్ నుంచి 20 శాతం వాటా ఉంటుంది. పుణె, ముంబై, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లున్నారు. -
త్వరలోనే నెట్‌మెడ్స్ స్టోర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో మందులు విక్రయించే నెట్‌మెడ్స్... ఆఫ్లైన్లోకీ అడుగుపెట్టనుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా తొలుత సంస్థ ప్రధాన కేంద్రమైన చెన్నైలో స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాతే దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు నెట్‌మెడ్స్ ఫౌండర్ ప్రదీప్ ధడా ‘సాక్షి’ స్టార్టప్ డైరీ ప్రతినిధితో చెప్పారు. నెట్‌మెడ్స్ బ్రాండ్ కిందే స్టోర్లను ఏర్పాటు చేస్తామని.. పెట్టుబడుల అంశం ఇంకా కొలిక్కి రాలేదని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. 1914 నుంచి మా కుటుంబానికి చెన్నై కేంద్రంగా ధడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది. 1996లో ఇది సన్‌ఫార్మాలో విలీనమైంది. చదువు పూర్తయ్యాక.. సొంతంగా టెక్నాలజీ కంపెనీ ప్రారంభించా. కుటుంబ వ్యాపార ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఫార్మాను టెక్నాలజీతో అనుసంధానిస్తే మరింత వేగంగా కొనుగోలుదారులకు మందులను సరఫరా చేయెచ్చనిపించింది. ఫ్యామిలీతో చర్చించా. పెట్టుబడులకు ఒకే చెప్పడంతో 2015 జూన్‌లో 1.5 మిలియన్ డాలర్లతో చెన్నై కేంద్రంగా నెట్‌మెడ్స్.కామ్‌ను ప్రారంభించా. దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమయ్యే మందులు... అది కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను లక్ష్యంగా చేసుకొని సేవలందించడమే నెట్‌మెడ్స్ ప్రత్యేకత. 7 గిడ్డంగులు; 35 వేల రకాల మందులు.. ప్రస్తుతం మాకు 15 లక్షల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. నెట్‌మెడ్స్‌లో 35 వేల రకాల మందులున్నాయి. ఎక్కువగా డయాబెటిస్, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు మందులుంటాయి. తయారీ సంస్థలు, డిస్ట్రిబ్యూషన్లతో ఒప్పందంవల్ల ధరలు 20% వరకు తక్కువగా ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నైలో గిడ్డంగులున్నాయి. కనిష్ట ఆర్డర్ రూ.1,750 ఉండాలి. మందుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. దేశంలో 19 వేల పిన్‌కోడ్స్ ఉండగా.. ఇందులో 12 వేల పిన్‌కోడ్స్‌కు నెట్‌మెడ్స్ సేవలందుబాటులో ఉన్నాయి. రూ.416 కోట్ల సమీకరణ..: ప్రస్తుతం సంస్థలో 350 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.416 కోట్ల నిధులను సమీకరించాం. ఇటీవలే కంబోడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టన్కామ్, రష్యా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ సిస్టెమాలు రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టాయి. 3 నెలల్లోనే తొలి రౌండ్లో భాగంగా పీఈ సంస్థ ఆర్బిమెడ్, ఎంఏపీఈ అడ్వైజరీ గ్రూప్ నుంచి రూ.326 కోట్ల నిధులను సమీకరించాం. ఇందులో సగానికి పైగా నిధులు రావాల్సి ఉంది.. అని ప్రదీప్ వివరించారు. ఏపీ 2.5%; తెలంగాణ 3.5% మా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 65 శాతం వరకుంటుంది. ప్రతి ఆర్డర్ మీద 5 శాతం కమీషన్ తీసుకుంటాం. ప్రతి ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో తెలంగాణ 3.5 శాతం, ఆంధ్రప్రదేశ్ 2.5 శాతం వాటా ఉంటుంది. వచ్చే 18 నెలల్లో కొత్తగా మరో 4 గిడ్డంగులను ప్రారంభించనున్నాం. త్వరలోనే పుణెలో వేర్‌హౌజ్‌ను ప్రారంభించనున్నాం. మిగిలిన 3 పాత నగరాల్లోనే వస్తాయి. మరో 4 నెలల్లో కొత్తగా 10 వేల మందులను జత చేయనున్నాం. -
లగ్జరీ షిప్లో మూడు ముళ్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పెళ్లంటే... ఇంటి ముందు మండపంలోనో లేక ఫంక్షన్ హాల్లోనో కానిచ్చేయడం మనకు తెలుసు. కానీ, ఈ మధ్య కాలంలో క్రూయిజ్ (భారీ సముద్ర నౌక)లో, అది కూడా హంగూ ఆర్భాటాలతో... సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకునే సంప్రదాయం పెరుగుతోందండోయ్!!. మరి, క్రూయిజ్‌లో పెళ్లంటే మాటలు కాదు. నౌకను బుక్ చేసుకోవడం నుంచి మొదలుపెడితే ప్రయాణ గమ్యస్థానం, పెళ్లి ఏర్పాట్లు, భోజన వసతులు.. ఇలా ప్రతిదీ పనే. దీన్నే వ్యాపారంగా మలుచుకుంది ట్రావ్‌కార్ట్.కామ్. దీనికోసం క్రూయిజ్ వెడ్డింగ్‌లో పేరు గాంచిన డ్రీమ్ క్రూయిజ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ట్రావ్‌కార్ట్ కో–ఫౌండర్ మన్హీర్ సింగ్ సేథి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘రెండు దశాబ్దాల కిందటే మా కుటుంబానికి సాహిబ్జీ ట్రావెల్స్ అండ్ టూర్స్ ఏజెన్సీ ఉంది. అందుకేనేమో!! చిన్నతనం నుంచే నాతో పాటు మా తమ్ముడు గుర్సాహిబ్ సింగ్ సేథికీ ట్రావెలింగ్ అంటే ఇష్టముండేది. చదువు పూర్తయ్యాక ఇద్దరం కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాం. తక్కువ కాలంలోనే వ్యాపారాన్ని మంచి స్థాయికి తెచ్చాం. అదే సమయంలో ఆన్లైన్ బూమ్ వచ్చింది. టూర్ మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకునేలా వీలు కల్పిస్తే వేగంగా, సులువుగా కస్టమర్లను చేరుకోవచ్చనే ఆలోచనతో రూ.5 లక్షల పెట్టుబడితో 2016 డిసెంబర్లో ఢిల్లీ కేంద్రంగా ట్రావ్‌కార్ట్.కామ్‌ను ఆరంభించాం. బీ2బీ, బీ2సీ కస్టమర్లకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింట్లోనూ ప్రయాణ సేవలందించడం మా ప్రత్యేకత. 58 దేశాలు, 3,500 ప్యాకేజీలు.. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజ్లాండ్, అమెరికా, యూరప్ వంటి 58 దేశాల్లో ఫ్యామిలీ హాలీడే, హనీమూన్, క్రూయిజ్, థీమ్ హాలిడేస్, డే ట్రిప్స్, వీకెండ్ గేట్‌వే ఇలా సుమారు 3,500 రకాల ప్యాకేజీలున్నాయి. రూ.1,500 నుంచి రూ.10 లక్షల వరకు ధరలున్నాయి. క్రూయిజ్ వెడ్డింగ్ కోసం ఒక రాత్రికి ఒక్కరికి రూ.9 వేలు ఖర్చవుతుంది. గోవా, హువాహిన్, పుకెట్, కౌలాలంపూర్ గమ్యస్థానాల్లో క్రూయిజ్ వెడ్డింగ్ చేసుకునే వీలుంది. కస్టమర్లు అక్కడ సొంతంగా కారులో విహరించేందుకు కారు కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీ ఎవీస్తో ఒప్పందం చేసుకున్నాం. ట్రావెల్ ఏజంట్లకూ ఫ్రాంచైజీ.. బీ2బీలో 8 వేలకు పైగా ట్రావెల్ ఏజెంట్లు, బీ2సీలో 3 వేలకు పైగా కస్టమర్లున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది ట్రావెల్ ఏజెంట్లున్నారు. సుమారు 3 వేల హోటళ్లు, 20కి పైగా విమానయాన సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ట్రావెల్ ఏంజెట్లకు బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారంతో పాటూ కస్టమర్లనూ అందించడం కోసం ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఈ డిసెంబర్ నాటికి 20 ఫ్రాంచైజీలు, 2020 నాటికి 100 ఫ్రాంచైజీలు లకి‡్ష్యంచాం. నెలకు కోటి వ్యాపారం.. ప్రస్తుతం నెలకు 70 వరకు ఆర్డర్లు, కోటి రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఎక్కువగా ఫ్యామిలీ, హనీమూన్ ప్యాకేజ్‌లు బుక్ అవుతున్నాయి. మా మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతం. ప్రస్తుతం 68 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి మరో 100 మందిని తీసుకుంటాం. ‘‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దుబాయ్, సింగపూర్‌లో ట్రావ్‌కార్ట్ సేవలను విస్తరిస్తాం. దానికి నిధులు సమీకరిస్తున్నాం’’ అని ’ మన్హీర్ వివరించారు. -
‘సెండ్ ఫాస్ట్’గా డెలివరీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ కంపెనీల సక్సెస్‌లో ప్రధానమైంది డెలివరీనే. వేగంగా, నాణ్యంగా ఉత్పత్తులు డెలివరీ అయితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ కొంటారు. కానీ ఈ–కామర్స్ సంస్థలన్నీ సొంతగా లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేసుకోలేవు. మెట్రో నగరాల వరకైతే థర్డ్ పార్టీ మీద ఆధారపడి పని లాగించేయొచ్చు. మరి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల పరిస్థితేంటి? ఇదిగో దీన్నే వ్యాపారంగా మలుచుకుంది హైదరాబాద్‌కు చెందిన డికార్ట్ లాజిస్టిక్స్! ‘సెండ్ ఫాస్ట్’ బ్రాండ్ పేరిట తృతీయ శ్రేణి ప్రాంతాల్లో డెలివరీ... అదీ జస్ట్ 24 గంటల్లోనే అందించడం దీని ప్రత్యేకత. అందుకే కాబోలు సంస్థ ప్రారంభించిన 5 నెలల్లోనే ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌నూ కస్టమర్‌గా చేసేసుకుంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మా స్వస్థలం తిరుపతి. అక్కడే చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ చేశా. అక్కడే లాజిస్టిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎంటెక్ కూడా పూర్తి చేశా. ఈ–కామర్స్ సంస్థలిస్తున్న లాస్ట్‌మైల్ డెలివరీ ప్రాముఖ్యం కేవలం మెట్రోలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి ఈ–కామర్స్‌లకు వచ్చే ఆర్డర్లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఆయా ప్రాంతాలకు ఆర్డర్లు వేగంగా చేరితేనే మరింత ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇదే స్టార్టప్ ఆలోచనకు బీజం వేసింది. మొదట్లో సొంతంగా రూ.2 లక్షల పెట్టుబడితో 2015 జూలైలో ప్రారంభించిన డికార్ట్ లాజిస్టిక్స్‌లో తర్వాత కార్తీక్, శశాంక్ రెడ్డి కో–ఫౌండర్లుగా చేరారు. ఫ్లిప్‌కార్ట్, మింత్రతో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో డెలివరీ సేవలందిస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర, బిగ్‌బాస్కెట్, జబాంగ్ వంటి 200కు పైగా ఈ–కామర్స్ కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. ఇందులో ఫ్లిప్‌కార్ట్, మింత్ర కంపెనీలకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్స్‌క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉంది. ప్రస్తుతం మా సంస్థలో 500 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. మార్చి నాటికి మరో 500 మందిని నియమించుకుంటాం. కుటుంబ నేపథ్యం, విద్యార్హత, స్థానిక పోలీస్ వెరిఫికేషన్ వంటివి పూర్తయ్యాకే డెలివరీ బాయ్స్‌ను నియమించుకుంటాం. వీరికి వేతనాలు రూ.13 వేల నుంచి ఉంటాయి. మరో 6 నెలల్లో 100 ఈ–కామర్స్ కంపెనీలను కస్టమర్లుగా చేర్చాలని లకి‡్ష్యంచాం. పేటీఎంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా సేవలను విస్తరిస్తాం. ఈ ఏడాది రూ.10 కోట్ల వ్యాపారం లక్ష్యం ప్రస్తుతం నెలకు 6 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. ఇందులో 2.5–3 లక్షల ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఏపీ, తెలంగాణ నుంచి 40 శాతం వాటా ఉంటుంది. ప్రతి ఆర్డర్ డెలివరీ మీద ఈ–కామర్స్ కంపెనీల నుంచి రూ.35 చార్జీ తీసుకుంటాం. నెలకు రూ.65–70 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాం. ఈ ఏడాది రూ.10 కోట్లు లకి‡్ష్యంచాం. గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువతకు ఉద్యోగ, ఆదాయ మార్గాలను కల్పించేందుకు కొత్తగా నెట్వర్క్ పార్ట్నర్ను ప్రారంభించాం. ఇదేంటంటే.. మా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ–కామర్స్ కంపెనీల ఆర్డర్లను డెలివరీ చేయవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం, భీమవరం, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి 25 మంది నెట్వర్క్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. రెండేళ్లలో దీన్ని వెయ్యి మందికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుత నెట్వర్క్ పార్ట్నర్స్ మా ద్వారా నెలకు రూ.50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రూ.120 కోట్ల నిధుల సమీకరణ.. ఇటీవలే సౌదీలోని రిటైల్ స్టోర్ గ్రూప్ సినర్జీ గ్లోబల్‌తో డెలివరీ ఒప్పందం చేసుకున్నాం. స్థానికంగా కొన్ని అనుమతులు రావాలి. ఆయా సేవలకు గాను ప్రతి డెలివరీపై రూ.40 చార్జీ ఉంటుంది. లైన్ హాల్ పేరిట సిటీ నుంచి సిటీ లాజిస్టిక్స్ సేవలు కూడా అందిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 5 టన్నుల వరకు డెలివరీ చేస్తున్నాం. దీనికి కిలోకు రూ.50 వరకు చార్జీ ఉంటుంది. గతేడాది ప్రారంభంలో హైదరాబాద్ ఏంజిల్స్ నుంచి రూ.1 కోటి సమీకరించాం. తాజాగా రూ.120 కోట్లు సమీకరిస్తున్నాం. అమెరికాకు చెందిన 3 ఇన్వెస్టర్స్ క్లబ్స్‌తో చర్చలు జరుపుతున్నాం. ఒకటి పూర్తయింది. ఈక్విటీ ఆడిట్ జరుగుతోంది. మరో 5 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని కిరణ్ కుమార్ వివరించారు. -
సర్ప్రైజ్ పార్టీల అడ్డా ‘ఈవైబ్’!
రాకేశ్.. తన భార్య పుట్టిన రోజుకు పీవీఆర్ థియేటర్లో ఓ షో మొత్తం బుక్ చేసి.. సర్ప్రైజ్ చేశాడు! గౌరవ్.. పెళ్లి ప్రపోజల్‌ను డ్రోన్ కెమెరాలో చిత్రించి తన ప్రేయసికి పంపించాడు! కావ్య.. తన కజిన్ పెళ్లి రోజు బహుమతిగా విమానంలో సొంత డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది! ...సాధారణంగా మనం ఇలాంటి సీన్లను సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య చూస్తుంటాం. కానీ, ఇప్పుడు మీరూ ఇలాంటి సర్ప్రైజ్ అనుభవాలను పొందొచ్చు. అదీ హైదరాబాద్‌లోనే! భాగ్యనగరికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు స్వాతి, ఆంజనేయులు రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థ ‘ఈవైబ్.ఇన్’ సేవలు ఇలాంటివే మరి. కంపెనీ ప్రారంభం, వినూత్న సేవల గురించి సంస్థ కో–ఫౌండర్ స్వాతి భావనక మాటల్లోనే.. మా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది మా ప్రేమ వివాహమే. ఎలాగంటే.. ఆంజనేయులు రెడ్డి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. బెంగళూరులోని గేమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ నోల్స్కేప్లో చేరాడు. నేనూ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ పూర్తయ్యాక.. అదే నోల్స్కేప్లో జాయిన్ అయ్యా. అక్కడ పరిచయమైన ఇద్దరి స్నేహం.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నాం. పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో, అదీ తల్లిదండ్రుల సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రయాణ టికెట్లు, షాపింగూ పూర్తి చేసేశాం. పెళ్లి ఏర్పాట్లకు అవసరమైన హాల్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, ఫుడ్ వంటి వాటికోసం ఆన్లైన్లో వెతికాం. కానీ, లాభం లేకుండా పోయింది. అరే!! సినిమా టికెట్లు, ఫోన్ల వంటివి ఆన్లైన్లో కొనుక్కునే వీలున్న ఈ రోజుల్లో వివాహానికి, పార్టీలకు అవసరమైన సేవలను బుకింగ్ చేసుకునే వీలు లేదా? అనిపించింది. అక్కడి నుంచే ఈవైబ్.ఇన్ కంపెనీకి ఆలోచన పడింది. ఇంకేముంది!! కాసింత సర్వే చేసి చేతిలోని రూ.5 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఫిబ్రవరి 2014లో ఈవైబ్.ఇన్ను ప్రారంభించాం. ‘వైబ్’ అంటే అనుభవం అని, ‘ఈ’ అంటే ఎలక్ట్రానిక్ అని అర్థం. మొత్తంగా చూస్తే ఎలక్ట్రానిక్ రూపంలో అనుభవాలను పంచుకోవటమే మా కంపెనీ పేరుకు అర్థం. 5 వేలకు పైగా ఆప్షన్లు.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో సేవలందిస్తున్నాం. వివాహం, పుట్టిన రోజు, పెళ్లి రోజు, గృహ ప్రవేశాలు, వీకెండ్ పార్టీలు, ప్రమోషన్స్ వంటి ప్రత్యేక సందర్భాల్లో పార్టీ ఏర్పాట్లుంటాయి. ఎంటర్టైన్మెంట్, డెకరేషన్, ఫుడ్, గిఫ్ట్స్, ఫొటోగ్రఫీ, టెంట్ వంటి 8 విభాగాల్లో 5 వేలకు పైగా ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఆయా విభాగాల్లో 1,000 మంది వెండర్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ధరలు సేవలను బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకున్నాయి. ప్రతి లావాదేవీ మీద వెండర్ పార్టనర్స్ నుంచి 13–15 శాతం కమీషన్ తీసుకుంటాం. నెలకు 400 ఆర్డర్లు; 25 లక్షల వ్యాపారం.. ప్రతి రోజు వెయ్యి మంది విజిటర్స్ వెబ్‌సైట్‌ను సంప్రతిస్తుంటారు. నెలకు 400 ఈవెంట్స్ ఆర్డర్లొస్తున్నాయి. ఇప్పటివరకు 6 వేల పార్టీలను నిర్వహించాం. ఎక్కువగా డెకరేషన్, ఎంటర్టైన్మెంట్ విభాగాల సంబంధించిన సేవలను ఎంచుకుంటున్నారు. నెలకు రూ.25 లక్షల గ్రాస్ మర్చండేజ్ వ్యాల్యూ (జీఎంవీ) చేస్తున్నాం. ఇందులో మా కమీషన్ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. గతేడాది రూ.1.8 కోట్ల వ్యాపారాన్ని చేశాం. ఏడాది కాలంలో వ్యాపారాన్ని, పార్టనర్స్‌ను ఐదింతలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 8 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. మరో 2 నెలల్లో వీరి సంఖ్యను 25కు చేర్చనున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణె నగరాలకు విస్తరిస్తున్నాం. ఆయా నగరాల్లో స్థానిక డెకరేటర్లు, హోటళ్లు, ఫొటోగ్రాఫర్ల వంటి పార్టనర్స్‌తో ఒప్పందం చేసుకుంటున్నాం. ‘‘గతంలో హైదరాబాద్ ఏంజిల్స్, కామన్‌ఫ్లోర్ ఫౌండర్లు మా కంపెనీలో రూ.75 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. మరో 8 నెలల్లో రూ.6 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం. పలువురు వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో (వీసీ) చర్చలు జరుపుతున్నాం’’ అని స్వాతి వివరించారు. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
ఎప్పుడు కావాలంటే అప్పుడు గిఫ్ట్
అర్ధరాత్రి గిఫ్ట్స్ డెలివరీ చేసి సర్ప్రైజ్ చేస్తున్న మిడ్‌నైట్‌కేక్ ♦ కేకులు, ఫ్లవర్స్, చాక్లెట్స్, బొమ్మల వంటివెన్నో.. ♦ నెలకు 500 పైనే ఆర్డర్లు; రూ.50 లక్షల టర్నోవర్ ♦ 3 నెలల్లో రూ.5 కోట్లు సమీకరణ పూర్తి ♦ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ మలాయ్ శిరాసియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆత్మీయుల పుట్టిన రోజునో లేక పెళ్లి రోజునో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి కేకో లేక ఫ్లవర్సో పంపి సర్ప్రైజ్ చేస్తే? ఇలాంటి సీన్లు సినిమాల్లో తప్ప నిజజీవితంలో చాలా అరుదుకదూ. కానీ, వాటిని మేంనిజం చేస్తామంటోంది మిడ్‌నైట్‌కేక్.కామ్! చెప్పిన చోటుకి, చెప్పిన సమయంలో గిఫ్ట్‌లను డెలివరీ చేస్తూ సర్ప్రైజ్ చేస్తోంది. సంస్థ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే వేడుక మీది.. సంతోషం మాది అంటున్నారు సంస్థ ఫౌండర్ మలాయ్ శిరాసియా. మరిన్ని విశేషాలను ‘సార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ఓ సంవత్సరం నా పుట్టిన రోజుకు అర్ధరాత్రి 12 గంటలకు నా ప్రాణ స్నేహితుడు రూమ్‌కి కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఈ టైంకి కేక్ ఎక్కడ దొరికిందిరా అనడిగా? సాయంత్రమే కొని పెట్టానని సమాధానమిచ్చాడు. ప్రత్యేక వేడుకలకు రాత్రి సమయాల్లో కేకులు, చాక్లెట్స్, గిఫ్టŠస్ వంటివి డెలివరీ చేసే సంస్థ ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకున్నాం. ఆ చర్చలోంచే 2012లో అహ్మదాబాద్ కేంద్రంగా మిడ్‌నైట్‌కేక్.కామ్ పుట్టింది. 146 నగరాల్లో 200 మంది వెండర్లు.. బేకరీ, గిఫ్ట్ ఆర్టికల్ వెండర్స్‌తో ఒప్పందం చేసుకొని కస్టమర్లు కోరిన సమయంలో గిఫ్ట్‌లను పంపించడం మా పని. పెళ్లి, పుట్టిన రోజులకే కాదు పండుగలు, ప్రేమికుల రోజు, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ గిఫ్ట్‌లను పంపించొచ్చు. కేక్స్, ఫ్లవర్స్, చాక్లెట్స్, గ్రీటింగ్ కార్డ్స్, టెడ్డీబీర్ వంటివి పంపించి ఆత్మీయులను ఆనందాన్ని పంచొచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి దేశంలోని 146 నగరాల్లో సేవలందిస్తున్నాం. 200 మంది వెండర్లు మాతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి 5 మంది వెండర్స్ ఉన్నారు. కస్టమర్లు మా వెబ్, యాప్‌లో ఆర్డర్ ఇవ్వగానే అందుబాటులో ఉన్న వెండర్‌కు కనెక్ట్ చేస్తాం. ప్రతి ఆర్డర్ మీద వెండర్ నుంచి 10–20% వరకు కమీషన్ తీసుకుంటాం. 11 వేల మందికి సేవలు..: అహ్మదాబాద్, పుణె నగరాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా డెలివరీ బాధ్యత వెండర్‌దే. త్వరలోనే పలు డెలివరీ సంస్థలతో ఒప్పందం చేసుకొని అన్ని నగరాల్లో డెలివరీ బాధ్యతలను తీసుకుంటాం. రాత్రి 11.30–12 గంటల మధ్య డెలివరీ చేయడంతో పాటూ పగలు సమయాల్లోనూ డెలివరీ చేస్తాం. డోర్ డెలివరీలే కాదు పీఎన్ఆర్ నంబర్, పేరులను జత చేస్తే రైల్వే స్టేషన్‌కు వెళ్లి కూడా గిఫ్ట్‌లను అందిస్తాం. ఇప్పటివరకు 11 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి 2 వేల మంది యూజర్లున్నారు. నెలకు 500 ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి నెలా 10% వృద్ధిని నమోదు చేస్తున్నాం. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది ఆర్ధిక సంవత్సరంలో రూ.36 లక్షల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే రూ.50 లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ‘‘ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిసారించాం. 3 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని’’ శిరాసియా వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...