త్వరలోనే నెట్‌మెడ్స్‌ స్టోర్లు! | Soon Netmeds Stores! | Sakshi
Sakshi News home page

త్వరలోనే నెట్‌మెడ్స్‌ స్టోర్లు!

Published Sat, Nov 4 2017 12:41 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

Soon Netmeds Stores! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే నెట్‌మెడ్స్‌... ఆఫ్‌లైన్‌లోకీ అడుగుపెట్టనుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తొలుత సంస్థ ప్రధాన కేంద్రమైన చెన్నైలో స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాతే దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు నెట్‌మెడ్స్‌ ఫౌండర్‌ ప్రదీప్‌ ధడా ‘సాక్షి’ స్టార్టప్‌ డైరీ ప్రతినిధితో చెప్పారు. నెట్‌మెడ్స్‌ బ్రాండ్‌ కిందే స్టోర్లను ఏర్పాటు చేస్తామని.. పెట్టుబడుల అంశం ఇంకా కొలిక్కి రాలేదని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..

1914 నుంచి మా కుటుంబానికి చెన్నై కేంద్రంగా ధడా ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఉంది. 1996లో ఇది సన్‌ఫార్మాలో విలీనమైంది. చదువు పూర్తయ్యాక.. సొంతంగా టెక్నాలజీ కంపెనీ ప్రారంభించా. కుటుంబ వ్యాపార ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఫార్మాను టెక్నాలజీతో అనుసంధానిస్తే మరింత వేగంగా కొనుగోలుదారులకు మందులను సరఫరా చేయెచ్చనిపించింది. ఫ్యామిలీతో చర్చించా. పెట్టుబడులకు ఒకే చెప్పడంతో 2015 జూన్‌లో 1.5 మిలియన్‌ డాలర్లతో చెన్నై కేంద్రంగా నెట్‌మెడ్స్‌.కామ్‌ను ప్రారంభించా. దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమయ్యే మందులు... అది కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను లక్ష్యంగా చేసుకొని సేవలందించడమే నెట్‌మెడ్స్‌ ప్రత్యేకత.

7 గిడ్డంగులు; 35 వేల రకాల మందులు..
ప్రస్తుతం మాకు 15 లక్షల మంది రిజిస్టర్‌ యూజర్లున్నారు. నెట్‌మెడ్స్‌లో 35 వేల రకాల మందులున్నాయి. ఎక్కువగా డయాబెటిస్, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు మందులుంటాయి. తయారీ సంస్థలు, డిస్ట్రిబ్యూషన్లతో ఒప్పందంవల్ల ధరలు 20% వరకు తక్కువగా ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నైలో గిడ్డంగులున్నాయి. కనిష్ట ఆర్డర్‌ రూ.1,750 ఉండాలి. మందుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. దేశంలో 19 వేల పిన్‌కోడ్స్‌ ఉండగా.. ఇందులో 12 వేల పిన్‌కోడ్స్‌కు నెట్‌మెడ్స్‌ సేవలందుబాటులో ఉన్నాయి.

రూ.416 కోట్ల సమీకరణ..: ప్రస్తుతం సంస్థలో 350 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.416 కోట్ల నిధులను సమీకరించాం. ఇటీవలే కంబోడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టన్‌కామ్, రష్యా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ సిస్టెమాలు రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టాయి. 3 నెలల్లోనే తొలి రౌండ్‌లో భాగంగా పీఈ సంస్థ ఆర్బిమెడ్, ఎంఏపీఈ అడ్వైజరీ గ్రూప్‌ నుంచి రూ.326 కోట్ల నిధులను సమీకరించాం.  ఇందులో సగానికి పైగా నిధులు రావాల్సి ఉంది.. అని ప్రదీప్‌ వివరించారు.

ఏపీ 2.5%; తెలంగాణ 3.5%
మా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 65 శాతం వరకుంటుంది. ప్రతి ఆర్డర్‌ మీద 5 శాతం కమీషన్‌ తీసుకుంటాం. ప్రతి ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో తెలంగాణ 3.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 2.5 శాతం వాటా ఉంటుంది. వచ్చే 18 నెలల్లో కొత్తగా మరో 4 గిడ్డంగులను ప్రారంభించనున్నాం. త్వరలోనే పుణెలో వేర్‌హౌజ్‌ను ప్రారంభించనున్నాం. మిగిలిన 3 పాత నగరాల్లోనే వస్తాయి. మరో 4 నెలల్లో కొత్తగా 10 వేల మందులను జత చేయనున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement