
రాకేశ్.. తన భార్య పుట్టిన రోజుకు పీవీఆర్ థియేటర్‌లో ఓ షో మొత్తం బుక్ చేసి.. సర్‌ప్రైజ్ చేశాడు!
గౌరవ్.. పెళ్లి ప్రపోజల్‌ను డ్రోన్ కెమెరాలో చిత్రించి తన ప్రేయసికి పంపించాడు!
కావ్య.. తన కజిన్ పెళ్లి రోజు బహుమతిగా విమానంలో సొంత డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది!
...సాధారణంగా మనం ఇలాంటి సీన్లను సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య చూస్తుంటాం. కానీ, ఇప్పుడు మీరూ ఇలాంటి సర్‌ప్రైజ్ అనుభవాలను పొందొచ్చు. అదీ హైదరాబాద్‌లోనే!
భాగ్యనగరికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు స్వాతి, ఆంజనేయులు రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థ ‘ఈవైబ్.ఇన్’ సేవలు ఇలాంటివే మరి. కంపెనీ ప్రారంభం, వినూత్న సేవల గురించి సంస్థ కో–ఫౌండర్ స్వాతి భావనక మాటల్లోనే..
మా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది మా ప్రేమ వివాహమే. ఎలాగంటే.. ఆంజనేయులు రెడ్డి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. బెంగళూరులోని గేమింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నోల్‌స్కేప్‌లో చేరాడు. నేనూ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ పూర్తయ్యాక.. అదే నోల్‌స్కేప్‌లో జాయిన్ అయ్యా. అక్కడ పరిచయమైన ఇద్దరి స్నేహం.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నాం. పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో, అదీ తల్లిదండ్రుల సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రయాణ టికెట్లు, షాపింగూ పూర్తి చేసేశాం. పెళ్లి ఏర్పాట్లకు అవసరమైన హాల్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, ఫుడ్ వంటి వాటికోసం ఆన్‌లైన్‌లో వెతికాం.
కానీ, లాభం లేకుండా పోయింది. అరే!! సినిమా టికెట్లు, ఫోన్ల వంటివి ఆన్‌లైన్‌లో కొనుక్కునే వీలున్న ఈ రోజుల్లో వివాహానికి, పార్టీలకు అవసరమైన సేవలను బుకింగ్ చేసుకునే వీలు లేదా? అనిపించింది. అక్కడి నుంచే ఈవైబ్.ఇన్ కంపెనీకి ఆలోచన పడింది. ఇంకేముంది!! కాసింత సర్వే చేసి చేతిలోని రూ.5 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఫిబ్రవరి 2014లో ఈవైబ్.ఇన్‌ను ప్రారంభించాం. ‘వైబ్’ అంటే అనుభవం అని, ‘ఈ’ అంటే ఎలక్ట్రానిక్ అని అర్థం. మొత్తంగా చూస్తే ఎలక్ట్రానిక్ రూపంలో అనుభవాలను పంచుకోవటమే మా కంపెనీ పేరుకు అర్థం.
5 వేలకు పైగా ఆప్షన్లు..
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో సేవలందిస్తున్నాం. వివాహం, పుట్టిన రోజు, పెళ్లి రోజు, గృహ ప్రవేశాలు, వీకెండ్ పార్టీలు, ప్రమోషన్స్ వంటి ప్రత్యేక సందర్భాల్లో పార్టీ ఏర్పాట్లుంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్, డెకరేషన్, ఫుడ్, గిఫ్ట్స్, ఫొటోగ్రఫీ, టెంట్ వంటి 8 విభాగాల్లో 5 వేలకు పైగా ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఆయా విభాగాల్లో 1,000 మంది వెండర్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ధరలు సేవలను బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకున్నాయి. ప్రతి లావాదేవీ మీద వెండర్ పార్టనర్స్ నుంచి 13–15 శాతం కమీషన్ తీసుకుంటాం.
నెలకు 400 ఆర్డర్లు; 25 లక్షల వ్యాపారం..
ప్రతి రోజు వెయ్యి మంది విజిటర్స్ వెబ్‌సైట్‌ను సంప్రతిస్తుంటారు. నెలకు 400 ఈవెంట్స్ ఆర్డర్లొస్తున్నాయి. ఇప్పటివరకు 6 వేల పార్టీలను నిర్వహించాం. ఎక్కువగా డెకరేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల సంబంధించిన సేవలను ఎంచుకుంటున్నారు. నెలకు రూ.25 లక్షల గ్రాస్ మర్చండేజ్ వ్యాల్యూ (జీఎంవీ) చేస్తున్నాం. ఇందులో మా కమీషన్ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. గతేడాది రూ.1.8 కోట్ల వ్యాపారాన్ని చేశాం. ఏడాది కాలంలో వ్యాపారాన్ని, పార్టనర్స్‌ను ఐదింతలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
8 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. మరో 2 నెలల్లో వీరి సంఖ్యను 25కు చేర్చనున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణె నగరాలకు విస్తరిస్తున్నాం. ఆయా నగరాల్లో స్థానిక డెకరేటర్లు, హోటళ్లు, ఫొటోగ్రాఫర్ల వంటి పార్టనర్స్‌తో ఒప్పందం చేసుకుంటున్నాం. ‘‘గతంలో హైదరాబాద్ ఏంజిల్స్, కామన్‌ఫ్లోర్ ఫౌండర్లు మా కంపెనీలో రూ.75 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. మరో 8 నెలల్లో రూ.6 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం. పలువురు వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో (వీసీ) చర్చలు జరుపుతున్నాం’’ అని స్వాతి వివరించారు.
– హైదరాబాద్, బిజినెస్ బ్యూరో