
డీహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ విలీనం
దివాన్ హౌసింగ్ గ్రూపులో భాగమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనానికి నేషనల్ హౌసింగ్ బోర్డు
నేషనల్ హౌసింగ్ బోర్డు అనుమతి
కోల్‌కతా: దివాన్ హౌసింగ్ గ్రూపులో భాగమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనానికి నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల విలీనం ఆగస్ట్ నాటికి పూర్తి కానుంది. ఎన్‌హెచ్‌బీ ఆమోదం లభించిందని, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు చేసుకున్నామని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సీఈవో దియో శంకర్ త్రిపాఠి తెలిపారు. ఆగస్ట్ నాటికి విలీనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 20 శాతం వాటా ఉండగా విలీనం అనంతరం ఏర్పడే సంస్థలో వాటా 10–11 శాతానికి తగ్గుతుంది.
వాటా తగ్గకుండా ఉండేందుకు అదనపు పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఐఎఫ్‌సీతో మాట్లాడుతున్నామని త్రిపాఠి చెప్పారు. రెండు సంస్థల విలీనం వల్ల రుణాల వ్యయాలు తగ్గుతాయని వివరించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యాలో ఆధార్ హౌసింగ్ విలీనం అవుతుందని, తర్వాత ఏర్పడే సంస్థ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో కొనసాగుతుందని చెప్పారు. 270 బ్రాంచ్‌లతో దేశంలో ఒకానొక అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఇరు సంస్థల ఉమ్మడి లోన్‌బుక్ 2017 మార్చి నాటికి రూ.5,100 కోట్లుగా ఉండగా, వచ్చే మార్చి నాటికి ఇది రూ.8,000 కోట్లకు విస్తరిస్తుందన్నారు.