ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 స్థాయికి నిఫ్టీ
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
న్యూఢిల్లీ: మార్కెట్ సెంటిమెంట్ బావుండటం, సంస్కరణలు కొనసాగుతాయన్న అంచనాలు, జీఎస్‌టీ అమలు, రుతుపవనాలు మెరుగ్గావుండటం తదితర సానుకూల అంశాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 10,000 పాయింట్ల స్థాయిని అధిగమిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనావేస్తోంది. 10,300–10,400 పాయింట్ల శ్రేణికి నిఫ్టీ చేరుతుందన్న అంచనాలతో తాము వున్నామని, అయితే ఈ స్థాయికి కరెక్షన్ జరిగిన తర్వాత చేరుతుందా...లేక నేరుగా వెళుతుందా అనేది చూడాల్సివుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి అన్నారు.
మార్కెట్లో కరెక్షన్ వచ్చినా, అది ఆరోగ్యకరంగానే వుంటుందని, అంతర్జాతీయ ప్రతికూలాంశాలతో ఏదైనా పతనం సంభవిస్తే..అది స్వల్పకాలికమేనని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కార్పొరేట్ లాభాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అతిపెద్ద సంస్కరణ జీఎస్‌టీ అమలులోకి వస్తున్నదని, దాంతో జీడీపీ వృద్ధి క్రమేపీ పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు ఆయన వివరించారు.