HDFC Securities
-
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్‌లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్‌టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్‌లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్‌గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
గోల్డెన్ జూబ్లీ..!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం, వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన చర్యలు, కరెన్సీ మారక విలువలు పడిపోవడం తదితర అంశాల ఊతంతో పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధోరణులను ప్రతిబింబిస్తూ దేశీయంగా తొలిసారిగా రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛ్‌ంజీ (ఎంసీఎక్స్)లో బుధవారం రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది. అటు న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరుగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్టు (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. కరెన్సీల క్షీణత కూడా కారణం.. సాధారణంగా ఎకానమీ, స్టాక్ మార్కెట్ల పరిస్థితులు బాగా లేనప్పుడు సురక్షిత సాధనంగా పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం రేట్ల జోరుకు ఇదొక్కటే కారణం కాదని షేర్‌ఖాన్ కమోడిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. యూరప్, అమెరికాలో ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా కీలక కరెన్సీలు క్షీణిస్తుండటం వల్లే బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయని వివరించారు. మంగళవారమే యూరోపియన్ యూనియన్ నేతలు తమ తమ దేశాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు 750 బిలియన్ యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ‘అమెరికా ఇప్పటికే ఒక విడత ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. మరో విడత కూడా ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు‘ అని సింగ్ చెప్పారు. మరోవైపు, గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం కూడా పసిడి రేట్లకు ఊతమిస్తోందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం హెడ్ సునీల్‌కుమార్ కట్కే పేర్కొన్నారు. 2020 ప్రథమార్ధంలో అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏకంగా 39.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు నికరంగా వచ్చినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 పూర్తి సంవత్సరంలో నమోదైన 23 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వెండి కూడా రయ్... పసిడి బాటలోనే వెండి ధర కూడా గణనీయంగా పెరుగుతోంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరింది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలతో గత కొద్ది నెలల్లో వెండి రేటు గణనీయంగా పెరుగుతోందని కట్కే చెప్పారు. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే ఉంటోంది. ఇతర బేస్ మెటల్స్ రేట్లు పెరగడం కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా వెండి మైనింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఒకవేళ చాలా చోట్ల మళ్లీ ఉత్పత్తి మొదలైనా .. ఈ ఏడాది మొత్తం మీద చూస్తే ఉత్పత్తి 7 శాతం తగ్గొచ్చని ది సిల్వర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేస్తోంది. మరో 10 శాతం పెరిగే చాన్స్ భారీగా ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరల్లో కొంత కరెక్షన్ రావొచ్చని.. అయినప్పటికీ వచ్చే ఏడాది జూన్ నాటికి పుత్తడి ధర మరో 10 శాతం పెరగవచ్చని షేర్‌ఖాన్ అంచనా వేస్తున్నట్లు సింగ్ తెలిపారు. అలాగే, వెండి రేటు కూడా కేజీకి రూ. 73,000–74,000 స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల పాటు పసిడి, వెండి రేట్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులే ఉండొచ్చని కట్కే చెప్పారు. ‘ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా లేక ద్రవ్యోల్బణం భారీగా పెరిగి దాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తే బంగారం, వెండి రేట్లలో కొంత కరెక్షన్ ఉండొచ్చు. అయితే, అది ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే పసిడి, వెండి రేట్లు పెరిగేందుకు కారణాలు బలంగా ఉన్నాయి‘ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పసిడి రేటును మించి వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని కట్కే పేర్కొన్నారు. -
సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్ ఆధారిత మార్కెట్ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది... కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..? నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే.. ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫం డ్స్ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్ లేదా స్టాక్స్) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్డీలు, బాండ్ ఫండ్స్ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు. ఫండ్స్ పెట్టుబడుల విలువ పడిపోతే? ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు. సిప్‌ను కొనసాగించాలా..? ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ కారణంగా ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్ ఆపేసి, మంచి పథకాల్లో సిప్ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి. ఎఫ్ అండ్ ఓ లతో రక్షణ ఎలా? రిస్క్ నిర్వహణకు డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో బేర్ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి? 1992, 2000, 2008 సందర్భాల్లో బేర్ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది. బంగారంలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తే...? మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు? ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ రంగ కంపెనీలు, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు. నష్టాలను బుక్ చేసుకోవచ్చా..? భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. -
బొగ్గు, ఉప్పు పోయి ఆవాలు, పూదీన వచ్చే!
సాక్షి, న్యూఢిల్లీ : తళతళలాడే దంతాల కోసం తాపత్రయ పడే ప్రజలు మొన్న బొగ్గు, నిన్న ఉప్పు, నేడు ఆవాలు, పూదీన, ఆఖరికి పసుపుతో కూడిన మంజన్లు, పేస్టులు వాడుతున్నారు. భారత్‌లో ఈ విప్లవానికి శ్రీకారం చుట్టి దంత సంరక్షణ మార్కెట్‌ను మరెక్కడికో తీసుకెళుతన్నది నిస్సందేహంగా బాబా రామ్‌దేవ్ నాయకత్వంలోని పతంజలి ఉత్పత్తులే. సంప్రదాయబద్ధంగా ఆయుర్వేదం లేదా ఔషధ మూలికల మూలాలు కలిగిన ఉత్పత్తులతో ముందుకు వస్తున్న పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో మరెంతో ముందుకు దూసుకెళుతున్నాయి. ఒక్క భారత్‌లోనే పదివేల కోట్ల రూపాయల మార్కెట్ కలిగిన దంత సంరక్షణ రంగంలో బాబా రామ్‌దేవ్ ప్రధాన వాటా కోసం పోటీ పడుతున్నారు. ఆయన పోటీని తట్టుకొని తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి కాల్గేట్, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి సంస్థలు కూడా పంతంజలి బాటను పట్టక తప్పలేదు. ‘మీరు వాడే కాల్గేట్లో ఉప్పు ఉందా?’ అంటూ ఈ దిశగా ముందుకొచ్చిన కాల్గేట్ ‘సిబాకా వేదశక్తి’ని 2016, ఆగస్టులో మార్కెట్లోని విడుదల చేసింది. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఆవాలు, రాతి ఉప్పు మూలాలు కలిగిన ‘ఆయుష్’ బ్రాండ్‌ను 2017, ఆగస్టులో విడుదల చేసింది. అయినప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధ మూలికల దంత ఉత్పత్తుల్లో అమ్ముడుపోతున్న ఐదింటిలో నాలుగు బ్రాండ్లు పతంజలి, డాబర్ ఉత్పత్తులే కావడం విశేషం. ‘హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్’ లెక్కల ప్రకారం దేశంలో దంత సంరక్షణ మార్కెట్ పదివేల కోట్ల రూపాయలకు విస్తరించగా, 10 సంవత్సరాల క్రితం వీటిల్లో ఆయుర్వేద లేదా ఔషధ మూలికల బ్రాండ్లు ఒక్కటైనను లేదు. నేడు వాటి వాటా పదివేల కోట్ల రూపాయల్లో 20 శాతానికి చేరుకొంది. భారత దేశంలో నేడు 90 శాతం ఇళ్లలో టూత్‌పేస్ట్ లేదా టూత్ పౌడర్ వాడుతున్నారు. వీటిల్లోకి ఔషధ మూలాలున్న ఉత్పత్తులు చొచ్చుకుపోవడానికి కారణం ఆరోగ్యానికి అవి మంచి చేస్తాయన్న విశ్వాసమే కాకుండా ధర తక్కువగా ఉండడం కూడా మరో కారణం. పతంజలి ఉత్పత్తులో దంత్ కాంతి బ్రాండ్‌ను ప్రతి వంద గ్రాములను 40 రూపాయలకు విక్రయిస్తుండగా, కాల్గేట్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తులను ప్రతి వంద గ్రాములను 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ లీడర్ కాల్గేట్ కంపెనీయే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2015 సంవత్సరంలో మార్కెట్లో కాల్గేట్ వాటా 57 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది. ప్రజలు కాస్మోటిక్ కేర్ నుంచి థెరపాటిక్ కేర్‌కు, అంటే సౌందర్య పిపాస నుంచి ఆరోగ్య సంరక్షణకు మల్లడం వల్ల మూలికల మూలాలున్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని డాబర్ ఇండియా సీఈవో సునీల్ దుగ్గల్ వ్యాఖ్యానించారు. భారత్‌లో డాబర్ ఇండియా రెడ్, బాబుల్, మెశ్వాక్ బ్రాండ్ల టూత్‌పేస్ట్‌ను విక్రయిస్తున్న విషయం తెల్సిందే. -
ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 స్థాయికి నిఫ్టీ
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ న్యూఢిల్లీ: మార్కెట్ సెంటిమెంట్ బావుండటం, సంస్కరణలు కొనసాగుతాయన్న అంచనాలు, జీఎస్టీ అమలు, రుతుపవనాలు మెరుగ్గావుండటం తదితర సానుకూల అంశాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 10,000 పాయింట్ల స్థాయిని అధిగమిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనావేస్తోంది. 10,300–10,400 పాయింట్ల శ్రేణికి నిఫ్టీ చేరుతుందన్న అంచనాలతో తాము వున్నామని, అయితే ఈ స్థాయికి కరెక్షన్ జరిగిన తర్వాత చేరుతుందా...లేక నేరుగా వెళుతుందా అనేది చూడాల్సివుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి అన్నారు. మార్కెట్లో కరెక్షన్ వచ్చినా, అది ఆరోగ్యకరంగానే వుంటుందని, అంతర్జాతీయ ప్రతికూలాంశాలతో ఏదైనా పతనం సంభవిస్తే..అది స్వల్పకాలికమేనని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కార్పొరేట్ లాభాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అతిపెద్ద సంస్కరణ జీఎస్టీ అమలులోకి వస్తున్నదని, దాంతో జీడీపీ వృద్ధి క్రమేపీ పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఇపుడు షేర్లే ఆకర్షణీయం...
రియల్టీ, బంగారానికి వన్నె తగ్గుతోంది డీమోనిటైజేషన్‌తో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఆశావహంగా ఆటో, బ్యాంకింగ్, సిమెంట్ స్టాక్స్ రియల్ ఎస్టేట్, పసిడి వంటి సాధనాలకు వన్నె తగ్గుతోందని, అందుకే ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి ఫైనాన్షియల్ సాధనాల వైపు మళ్లుతున్నారని చెప్పారు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీఈవో ధీరజ్ రెల్లి. పెద్ద నోట్ల రద్దు అంశం స్వల్పకాలికంగా కష్టం కలిగించినా దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగానే ఉంటుందని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో అభిప్రాయపడ్డారు.ముఖ్యాంశాలివీ... సాక్షి, బిజినెస్ బ్యూరో పెట్టుబడికి ఇపుడు ఏ సాధనాలు బాగున్నాయంటారు? రియల్ ఎస్టేట్, బంగారం వంటి సాధనాలకు ఆకర్షణ తగ్గుతోంది. చాలా మంది ప్రస్తుతం ఫైనాన్షియల్ అసెట్స్ వైపు చూస్తున్నారు. లిక్విడిటీ లేకపోవడం, రేట్ల విషయంలో సందిగ్ధత వంటివి రియల్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. చాలా చోట్ల డిమాండ్‌కి మించి నిర్మాణాల కారణంగా నిల్వలు పెరిగిపోయాయి. ఇక వడ్డీ రేట్ల తగ్గుదల, ద్రవ్యోల్బణానికి తగ్గ రాబడి అందించలేకపోవడం వంటి కారణాలతో ఫిక్సిడ్ డిపాజిట్ల కన్నా అధిక రాబడులు అందించే సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈక్విటీలతోనే ఇది సాధ్యపడుతుంది. అందుకే, కస్టమర్లు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, కొంత మేర నేరుగా ఈక్విటీల్లోనూ, ఐపీవోల మార్గంలోనూ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మా సంస్థపరంగా చూస్తే.. మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించే దిశగా ప్రస్తుతం 270గా ఉన్న శాఖల సంఖ్యను ఈ ఏడాది 300కి పెంచుకుంటున్నాం. దాదాపు 5 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 15–20 శాతం వృద్ధితో సుమారు 7 శాతం స్థాయికి పెంచుకోవాలని యోచిస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. కారణం? భారత్‌లో నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య తక్కువ. వీరి సంఖ్య సుమారు 56 లక్షలుగా ఉంది. అదే ఫండ్స్ పోర్ట్ఫోలియోలైతే సుమారు 5 కోట్ల దాకా ఉన్నాయి. అంటే చాలా మంది రిటైల్ కస్టమర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా.. అందునా సిప్ విధానంలో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా దాదాపు అర బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,500 కోట్లు) పెట్టుబడులు సిప్ల రూపంలో వస్తున్నాయి. మొత్తంగా ఇటు ఫండ్స్, అటు బీమా సంస్థల నుంచి మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులుంటున్నాయి. అందుకే గత మూడు నెలల్లో ఎఫ్ఐఐలు ఏకంగా 4.5 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలకు దిగినా.. దేశీ సంస్థలు కొనుగోళ్లు జరపగలగడంతో మార్కెట్లు తట్టుకుని నిలబడగలిగాయి. నోట్ల రద్దు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది స్వల్పకాలికంగా కొంత బాధపెట్టినా..దీర్ఘకాలికంగా లాభమే. నవంబర్, డిసెంబర్లలో అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడింది. కానీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అక్టోబర్‌లో వ్యాపారాలు బాగున్నాయి కనుక క్యూ3లో కంపెనీల ఆర్థిక ఫలితాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. నగదు అందుబాటులోకి వస్తోంది కనుక క్యూ4లో పరిస్థితి మామూలుగా ఉండొచ్చు. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ వల్ల పన్నులు కట్టే వారి సంఖ్య పెరుగుతుంది. వచ్చే కొన్నేళ్లలో ప్రస్తుతమున్న దానికన్నా రెట్టింపు స్థాయికి ఇది పెరగొచ్చు. జీఎస్టీ కూడా ఇందుకు తోడ్పడవచ్చు. బడ్జెట్ స్వరూపం ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) లేదా ఎస్టీటీ నిబంధనల్లో వాటిల్లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అయితే, ఆర్థిక మంత్రి సూచనప్రాయంగా చెప్పినట్లు పన్నుల శ్లాబ్‌లు పెంచడం లేదా ఆదాయ పన్ను తగ్గించడం లాంటివేమైనా చేస్తే ప్రజానీకానికి ఊరటగా ఉంటుంది. దీనివల్ల వినిమయంతో పాటు సక్రమంగా పన్నులు కట్టే ధోరణి కూడా పెరగొచ్చు. మార్కెట్‌పై ఈ సంవత్సరం అంచనాలేంటి? ఎన్నికల ఫలితాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, జీఎస్టీ, కార్పొరేట్ల ఆదాయాలు ఈ సారి ప్రభావం చూపించొచ్చు. 2016–17లో ద్రవ్యోల్బణం కొంత తగ్గినా.. 2018 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కింద బకాయిల చెల్లింపులు, అధిక ముడి చమురు ధరలు మొదలైన వాటి కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగొచ్చు. క్రూడ్, కమోడిటీల రేట్లు ప్రతికూలంగా ఉన్నా.. సంస్కరణలను వేగంగా అమలు చేస్తే ఆ ప్రభావం కొంత తగ్గొచ్చు. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ 25–50 బేసిస్ పాయింట్ల మేర కీలక పాలసీ రేట్లు తగ్గించవచ్చు. అయితే, సమీప భవిష్యత్‌లో వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉండగలదన్నది అంచనా వేయలేం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జీఎస్టీ జులై 1 నుంచి అమల్లోకి రావొచ్చు. మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే క్యూ3 ఫలితాల్లో చాలా సంస్థల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయి లేదా అంతకన్నా తక్కువే ఉండొచ్చు. ఏయే రంగాల షేర్లవైపు చూడొచ్చు? ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీ కంపెనీలు... ఆటోæ పరికరాల సంస్థలు, కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు మెరుగ్గా ఉండొచ్చు. పే కమిషన్ సిఫార్సుల అమలు, మెరుగైన రుతుపవనాలతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ఇందుకు దోహదపడొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులపై బులిష్ ధోరణుల విషయంలో మరికొన్నాళ్లు వేచి చూడాలి. ఇక సిమెంటు రంగం విషయానికొస్తే.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి సామర్ధ్యం వినియోగం పెరగొచ్చు. ప్రభుత్వం ప్రధానంగా ఇన్ఫ్రా, పరిశ్రమలపై దృష్టి పెడుతుండటం సిమెంటు తయారీ సంస్థలకు సానుకూలంగా ఉంటుంది. ముడిచమురు ధరల తగ్గుదల, ఉత్పత్తులకు డిమాండ్, అధిక రిఫైనింగ్ మార్జిన్ల వంటివి రిఫైనింగ్, చమురు ఉత్పత్తి సంస్థలకు లాభదాయకంగా ఉంటాయి. మెటల్స్ విషయానికొస్తే.. ఫెర్రస్ సంస్థలు బాగుండొచ్చు. స్టాక్స్ విషయానికొస్తే.. న్యూక్లియస్ సాఫ్ట్వేర్, వి–గార్డ్ ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర షేర్లు ఆశావహంగా ఉన్నాయి. -
తెలుగులో హెచ్డీఎఫ్సీ మొబైల్ ట్రేడింగ్ యాప్
హైదరాబాద్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తన మొబైల్ ట్రేడింగ్ యాప్‌ను తెలుగుతో సహా 10 భాషల్లో ఆవిష్కరించింది. ఇంగ్లిష్, హిందీ, మరాఠి, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్‌తో వినియోగదారులు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను కొనుగోలు చేయవచ్చని, విక్రయించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్‌రెల్లి పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ డిజిటల్ సేవల్లో ఇదొక భాగమని తెలిపారు. దీంతో పాటు కొత్త తరం ట్రేడింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను, దీనికి ఆన్లైన్ రిలేషన్షిప్ మేనేజర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. -
కెయిర్న్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.324 టార్గెట్ ధర: రూ. 400 ఎందుకంటే: రోజువారీ సగటు ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇబిటా 10 శాతం వృద్ధితో రూ.3,590 కోట్లకు, నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,880 కోట్లకు పెరిగాయి. అమ్మకాల పరిమాణం 10 శాతం పెరగడం, రూపాయి 15 శాతం పతనం కావడంతో అమ్మకాల వృద్ధి పెరిగింది. దీంతో ఆదాయం 17 శాతం వృద్ధి సాధించింది. బామర్ హిల్ ప్లాంట్‌లో ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్నది. రాజస్థాన్, రవ్వ, కేజీ బేసిన్లలో అదనపు నిక్షేపాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది. రూపాయి బలహీనంగా ఉండడంతో ఆదాయం మరింతగా పెరగవచ్చని భావిస్తున్నాం. గతేడాది డిసెంబర్ చివరి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.22,000 కోట్లుగా ఉన్నాయి. ఉత్పత్తి పెంపు, నిక్షేపాల అన్వేషణ విజయవంతం కావడం.. ఈ రెండు అంశాలు షేర్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం.