న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం, వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన చర్యలు, కరెన్సీ మారక విలువలు పడిపోవడం తదితర అంశాల ఊతంతో పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధోరణులను ప్రతిబింబిస్తూ దేశీయంగా తొలిసారిగా రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛ్‌ంజీ (ఎంసీఎక్స్)లో బుధవారం రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది.
అటు న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరుగుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్టు (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు.
కరెన్సీల క్షీణత కూడా కారణం..
సాధారణంగా ఎకానమీ, స్టాక్ మార్కెట్ల పరిస్థితులు బాగా లేనప్పుడు సురక్షిత సాధనంగా పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం రేట్ల జోరుకు ఇదొక్కటే కారణం కాదని షేర్‌ఖాన్ కమోడిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. యూరప్, అమెరికాలో ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా కీలక కరెన్సీలు క్షీణిస్తుండటం వల్లే బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయని వివరించారు.
మంగళవారమే యూరోపియన్ యూనియన్ నేతలు తమ తమ దేశాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు 750 బిలియన్ యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ‘అమెరికా ఇప్పటికే ఒక విడత ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. మరో విడత కూడా ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు‘ అని సింగ్ చెప్పారు.
మరోవైపు, గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం కూడా పసిడి రేట్లకు ఊతమిస్తోందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం హెడ్ సునీల్‌కుమార్ కట్కే పేర్కొన్నారు. 2020 ప్రథమార్ధంలో అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏకంగా 39.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు నికరంగా వచ్చినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 పూర్తి సంవత్సరంలో నమోదైన 23 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కన్నా ఇది అధికం కావడం గమనార్హం.
వెండి కూడా రయ్...
పసిడి బాటలోనే వెండి ధర కూడా గణనీయంగా
పెరుగుతోంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరింది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలతో గత కొద్ది నెలల్లో వెండి రేటు గణనీయంగా పెరుగుతోందని కట్కే చెప్పారు.
వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే ఉంటోంది. ఇతర బేస్ మెటల్స్ రేట్లు పెరగడం కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా వెండి మైనింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఒకవేళ చాలా చోట్ల మళ్లీ ఉత్పత్తి మొదలైనా .. ఈ ఏడాది మొత్తం మీద చూస్తే ఉత్పత్తి 7 శాతం తగ్గొచ్చని ది సిల్వర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేస్తోంది.
మరో 10 శాతం పెరిగే చాన్స్
భారీగా ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరల్లో కొంత కరెక్షన్ రావొచ్చని.. అయినప్పటికీ వచ్చే ఏడాది జూన్ నాటికి పుత్తడి ధర మరో 10 శాతం పెరగవచ్చని షేర్‌ఖాన్ అంచనా వేస్తున్నట్లు సింగ్ తెలిపారు. అలాగే, వెండి రేటు కూడా కేజీకి రూ. 73,000–74,000 స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల పాటు పసిడి, వెండి రేట్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులే ఉండొచ్చని కట్కే చెప్పారు.
‘ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా లేక ద్రవ్యోల్బణం భారీగా పెరిగి దాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తే బంగారం, వెండి రేట్లలో కొంత కరెక్షన్ ఉండొచ్చు. అయితే, అది ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే పసిడి, వెండి రేట్లు పెరిగేందుకు కారణాలు బలంగా ఉన్నాయి‘ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పసిడి రేటును మించి వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని కట్కే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment