న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది.
ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు.
దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్!
ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం.
ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే.
హాల్‌మార్కింగ్ గడువు పెంపు
ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment