All Time hike
-
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
ఫ్లైట్ ఫ్యూయల్ ఆల్‌టైం హై! కిలో లీటరు ధర రూ. 1.10 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో విమాన ఇంధన ధరలు కనీనివినీ ఎరుగని స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా చమురు ధర బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత భారత్‌లో తొలిసారిగా కిలోలీటర్ (1,000 లీటర్లు) ధర రూ.1 లక్ష దాటి ఆల్‌టైమ్ హై రికార్డు నమోదు చేసింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటర్ ధర ఢిల్లీలో 18.3 శాతం ఎగసి రూ.1,10,666.29కు చేరింది. ఈ ఏడాది ధర పెరగడం ఇది ఆరవసారి. గడిచిన పక్షం రోజులలో సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా జెట్ ఇంధన ధరలు ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తున్నారు. 2022 జనవరి 1 నుంచి చూస్తే కిలో లీటర్‌కు మొత్తం రూ.36,643.88 ఎగసింది. అంటే దాదాపు 50 శాతం అధికమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధర బ్యారెల్‌కు గత వారం 14 ఏళ్ల గరిష్టం 140 డాలర్లకు చేరింది. ధర ప్రస్తుతం 100 డాలర్లకు వచ్చి చేరింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో జెట్ ఇంధనం వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ ధర రూ.71,028.26 నమోదైంది. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధర బ్యారెల్‌కు 147 డాలర్లుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గతేడాది నవంబర్ 4 నుంచి భారత్‌లో అదే రీతిలో కొనసాగుతున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యమే ఇందుకు కారణం. ఎల్పీజీ ధరలో సైతం 2021 అక్టోబర్ నుంచి ఎటువంటి మార్పు లేదు. -
కొనసాగిన రికార్డులు
ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర సోమవారమూ కొనసాగింది. మెటల్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించడంతో సూచీలు మూడోరోజూ ఇంట్రాడే, ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 244 పాయింట్లు ఎగసి 55,681 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 145 పాయింట్ల లాభంతో 55,583 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 60 పాయింట్లు పెరిగి 16,589 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్ ముగిసే సరికి 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది ఆరోరోజూ, సెన్సెక్స్ మూడోరోజూ లాభాల ముగింపు. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా నష్టపోయాయి. జూన్ త్రైమాసికపు ఫలితాలు మెప్పించడంతో పాటు ప్రపంచ మార్కెట్లోనూ ధరలు స్థిరంగా ఉండటంతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ లాభపడింది. ఆటో, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రభుత్వరంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నిరాశపరచడంతో పాటు కోవిడ్ వైరస్ విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్ పని చేయలేదు ఆరంభ నష్టాలు రికవరీ... దేశీయ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 55,480, నిఫ్టీ 11 పాయింట్ల పతనంతో 16,518 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు మరింత అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లను కోల్పోయాయి. ఈ సమయంలో జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణ దిగివచ్చినట్లు కేంద్ర గణాంకాల శాఖ ప్రకటనతో సూ చీల నష్టాలకు అడ్డుకట్ట పడింది. మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకొని క్రమంగా లాభాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రిలయన్స్ – సౌదీ ఆరామ్కో వ్యాపార ఒప్పంద చర్చలు సఫలవంతం దిశగా సాగుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఆర్ఐఎల్ షేరు ఒకటిన్నర శాతం లాభంతో రూ.2174 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.2203 వద్ద గరిష్టాన్ని తాకింది. ► ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ భాగంగా హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు అరశాతం లాభంతో రూ.1529 వద్ద, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేరు ఒకశాతం పెరిగి రూ.2,733 వద్ద స్థిరపడ్డాయి. ► వొడాఫోన్ ఐడియా షేరు ఆరుశాతం క్షీణించి రూ.6 వద్ద ముగిసింది. కంపెనీ రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది. ► పలు బ్రోకరేజ్ సంస్థలు షేరు టార్గెట్ ధరను పెంచడంతో టాటా స్టీల్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.1519 వద్ద ముగిసింది. ► జూన్ క్వార్టర్లో రూ.729 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడంతో స్పైస్‌జెట్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.69 వద్ద స్థిరపడింది. -
మార్కెట్లో రికార్డుల మోత
ముంబై: జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం తమ పాత రికార్డుల్ని తిరగరాశాయి. మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లు రాణించడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 324 పాయింట్లు పెరిగి 52,642 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఈ ఏడాదిలో ఫిబ్రవరి 16న నమోదైన 52,517 ఆల్‌టైం హై స్థాయి కనుమరుగైంది. చివరికి 174 పాయింట్ల లాభంతో 52,475 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు కూడా సూచీకి కొత్త ఆల్‌టైం హై కావడం విశేషం. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 96 పాయింట్లు ర్యాలీ చేసి 15,836 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. 62 పాయింట్ల్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపే రికార్డు స్థాయిలను అందుకున్న సూచీలు తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి లాభాల బాటపట్టాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.666 కోట్ల షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ 375 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకిది నాలుగో వారమూ లాభాల ముగింపు. యూఎస్ సూచీలు జీవితకాల గరిష్టస్థాయిని అందుకోవంతో సహా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఇన్వెస్టర్ల సంపద@రూ.213 లక్షల కోట్లు సూచీల రికార్డులతో ఇన్వెస్టర్ల సంపద కూడా కొత్త గరిష్టానికి ఎగసింది. ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం గురు, శుక్రవారాల్లో రూ.3.26 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ మైలురాళ్లు ఈ 2021 ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ మొత్తం 4,723 పాయింట్ల(9.89%)ను ఆర్జించింది. ఇదే ఏడాదిలో మొత్తం 18 సార్లు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేసింది. తేదీ సాధించిన ఘనత జనవరి 21 తొలిసారి 50వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 3 తొలిసారి 50వేల పైన ముగిసింది ఫిబ్రవరి 5 తొలిసారి 51వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 8 తొలిసారి 51 వేల స్థాయి పైన ముగిసింది ఫిబ్రవరి 15 తొలిసారి 52 స్థాయిని అందుకుంది. జూన్ 11 52,641 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు జూన్ 11 52,474 వద్ద ఆల్‌టైం హై ముగింపు -
రికవరీ ఆశలతో.. రికార్డులు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో స్టాక్ మార్కెట్ సోమవారం ఒక శాతం లాభంతో ముగిసింది. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ రికార్డుల పర్వం కొనసాగింది. ఇంట్రాడేలో 268 పాయింట్లు ఎగసి 15,606 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరికి 147 పాయింట్ల లాభంతో 15,583 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి నిఫ్టీకి ఆల్‌టైం హై కావడం విశేషం. మరో సూచీ సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 51,937 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 52 వేల మార్కును అధిగమించి 52,013 స్థాయిని తాకింది. సెన్సెక్స్‌కిది నాలుగోరోజూ లాభాల ముగింపు కాగా నిఫ్టీ సైతం ఏడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతతో ఉదయం సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికిలోనైనా.., దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో తిరిగి లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,412 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో ఆశావాదం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ తగినంత మద్దతు లభించింది. ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు మెప్పించకపోయినా.., లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో వేగవంతమైన రికవరీ జరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన వృద్ధి జరగవచ్చు. ఆర్థిక వృద్ధి ఆశలతో మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఇంధన రంగాలకు చెందిన హెవీ వెయిట్స్ షేర్లు రాణించడంతో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించగలిగాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 4 రోజుల్లో రూ.3.93 లక్షల కోట్లు అప్... నాలుగు రోజుల వరుస ర్యాలీలో బీఎస్ఈలో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.223 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం సూచీల 1% ర్యాలీతో రూ.1.82 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. రూపాయి మూడురోజుల ర్యాలీకి బ్రేక్..! రూపాయి విలువ సోమవారం 17 పైసలు నష్టపోయి 72.62 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయి కరిగిపోయేందుకు కారణమైనట్లు ఫారెక్స్ నిపుణులు తెలిపారు. రూపాయి పతనంతో మూడురోజుల ర్యాలీకి ముగింపుపడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 72.38 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.65 – 72.34 శ్రేణిలో కదలాడింది. ఈ మే నెలలో డాలర్ మారకంలో రూపాయి 149 పైసలు(2.01 శాతం) బలపడింది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు 3% లాభంతో రూ.2,160 వద్ద స్థిరపడింది. గత 4 రోజుల్లో ఈ షేరు 10% ర్యాలీ చేయడం విశేషం. ► నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్ షేరు 4% లాభపడి రూ.4,284 వద్ద ముగిసింది. ► మార్కెట్ ర్యాలీలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 6% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. -
మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా రెండోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. నేడు పెట్రోల్ ధరలపై రూ.0.26 పైసలు, డీజిల్ ధరలు లీటర్‌పై 27పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77కు, డీజిల్ ధర రూ.83.46కు చేరింది. గత 10 రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.88.37 నుంచి రూ.89.77 మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.86.30కు చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.76.48కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలా ఉన్నాయి... పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.92.86కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.83.30కు ఎగసింది. ఈ రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.(చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 25 పైసల చొప్పున ఎగబాకాయి. చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం..లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.70 కాగా, ముంబైలో 92.28కి చేరింది. అదేవిధంగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66గా ఉంది. ధరలు ఇలా పైకి ఎగబాకటం వరుసగా నాలుగో వారంలో రెండో రోజు. ఈ వారంలో పెట్రో ధరలు లీటర్‌కు రూ.1 చొప్పున పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ జనవరి 6 నుంచి పెట్రో ధరలను ఏరోజుకారోజు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి లీటర్‌కు పెట్రోల్ ధర రూ.1.99, డీజిల్ ధర రూ.2.01 మేర పెరిగాయి. సేల్స్ ట్యాక్స్, వ్యాట్ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో విధించడమే ధరల్లో పెరుగుదలకు కారణమని ఆరోపిస్తున్న చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..పన్నుల్లో కోత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యాక డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో భారత్‌తోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. -
పసిడి పరుగు ఆగదు..!
న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతూనే ఉంటాయని, వాటి ధరలు కొత్త రికార్డు స్థాయిలకు చేరతాయని ఇన్వెస్ట్మెంట్ గురు, క్వాంటమ్ ఫండ్ సహ–వ్యవస్థాపకుడు జిమ్ రోజర్స్ తెలిపారు. ‘రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ దేశాలు పలు సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగవచ్చు. పసిడి కొత్త గరిష్ట స్థాయిలను తాకడం కొనసాగుతుందని భావిస్తున్నాను. ఆల్–టైమ్ గరిష్ట స్థాయికి వెండి ఇంకా 45 శాతం దూరంలో ఉంది. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేలోగా అది కూడా మరో కొత్త గరిష్ట స్థాయిని తాకవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పలు దిగ్గజ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పసిడిపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రోజర్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పసిడి అంటే పెద్దగా గిట్టని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ సైతం 563 మిలియన్ డాలర్లతో కెనడాకు చెందిన ఒక పసిడి మైనింగ్ సంస్థ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఒకవైపు ఈక్విటీలు మరోవైపు పసిడి రేట్లు కూడా ర్యాలీ చేస్తుండటంపై రోజర్స్ స్పందించారు. ‘చరిత్ర చూస్తే.. ప్రభుత్వాలు, కరెన్సీలపై నమ్మకం కోల్పోయినప్పుడల్లా ప్రజలు పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలుస్తోంది. మళ్లీ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. సెంట్రల్ బ్యాంకులు నోట్లను భారీగా ముద్రిస్తున్న కొద్దీ ప్రజలకు కరెన్సీపై నమ్మకం సడలుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులపై క్రమేపీ నమ్మకం తగ్గవచ్చని, పసిడి ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌పై ఆసక్తి .. వర్ధమాన దేశాల మార్కెట్లు పరుగులు తీస్తున్నాయని, పెట్టుబడులకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ కూడా ఒకటని రోజర్స్ పేర్కొన్నారు. ‘ప్రపంచ దేశాలు ఎడాపెడా నగదు ముద్రిస్తున్నాయి. అది ఎక్కడో ఒక దగ్గర ఖర్చు కావాలి. గణనీయంగా పడిపోయిన వర్ధమాన మార్కెట్లలోకి ఆ డబ్బు వచ్చి చేరుతోంది. అందుకే ఆ దేశాల మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు‘ అని ఆయన తెలిపారు. తన అలసత్వం కారణంగానే భారత్‌లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయలేదని, అందుకు కాస్త విచారం కలుగుతోందన్నారు. ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు నిజంగానే స్మార్ట్‌గాను, వివేకవంతంగా వ్యవహరించారనే భావించాలి. స్థానిక అంశాలపై అవగాహన ఉంటే నేనూ కచ్చితంగా భారత్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తా‘ అని రోజర్స్ పేర్కొన్నారు. మరో టెక్ బబుల్..: టెక్నాలజీ స్టాక్స్ ర్యాలీ బుడగ ఏదో ఒక సమయంలో పేలడం ఖాయమని రోజర్స్ హెచ్చరించారు. ‘కొన్ని మార్కెట్లలో బబుల్స్ కనిపించడం మొదలైంది. కొన్ని అమెరికన్ కంపెనీల షేర్లు తగ్గనే తగ్గడం లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ధోరణులే బబుల్‌కు దారితీస్తాయి. వీటిలో కొన్ని షేర్లు గణనీయంగా పతనం కాబోతున్నాయి. పడిపోయే ప్రసక్తే లేదనిపించే స్టాక్స్ ఏదో ఒక రోజు అత్యంత భారీగా పతనమవుతాయి. ఇన్వెస్టర్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి‘ అని రోజర్స్ పేర్కొన్నారు. -
పసిడి.. జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్! ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం. ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే. హాల్‌మార్కింగ్ గడువు పెంపు ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. -
గోల్డెన్ జూబ్లీ..!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం, వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన చర్యలు, కరెన్సీ మారక విలువలు పడిపోవడం తదితర అంశాల ఊతంతో పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధోరణులను ప్రతిబింబిస్తూ దేశీయంగా తొలిసారిగా రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛ్‌ంజీ (ఎంసీఎక్స్)లో బుధవారం రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది. అటు న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరుగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్టు (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. కరెన్సీల క్షీణత కూడా కారణం.. సాధారణంగా ఎకానమీ, స్టాక్ మార్కెట్ల పరిస్థితులు బాగా లేనప్పుడు సురక్షిత సాధనంగా పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం రేట్ల జోరుకు ఇదొక్కటే కారణం కాదని షేర్‌ఖాన్ కమోడిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. యూరప్, అమెరికాలో ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా కీలక కరెన్సీలు క్షీణిస్తుండటం వల్లే బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయని వివరించారు. మంగళవారమే యూరోపియన్ యూనియన్ నేతలు తమ తమ దేశాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు 750 బిలియన్ యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ‘అమెరికా ఇప్పటికే ఒక విడత ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. మరో విడత కూడా ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు‘ అని సింగ్ చెప్పారు. మరోవైపు, గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం కూడా పసిడి రేట్లకు ఊతమిస్తోందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం హెడ్ సునీల్‌కుమార్ కట్కే పేర్కొన్నారు. 2020 ప్రథమార్ధంలో అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏకంగా 39.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు నికరంగా వచ్చినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 పూర్తి సంవత్సరంలో నమోదైన 23 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వెండి కూడా రయ్... పసిడి బాటలోనే వెండి ధర కూడా గణనీయంగా పెరుగుతోంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరింది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలతో గత కొద్ది నెలల్లో వెండి రేటు గణనీయంగా పెరుగుతోందని కట్కే చెప్పారు. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే ఉంటోంది. ఇతర బేస్ మెటల్స్ రేట్లు పెరగడం కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా వెండి మైనింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఒకవేళ చాలా చోట్ల మళ్లీ ఉత్పత్తి మొదలైనా .. ఈ ఏడాది మొత్తం మీద చూస్తే ఉత్పత్తి 7 శాతం తగ్గొచ్చని ది సిల్వర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేస్తోంది. మరో 10 శాతం పెరిగే చాన్స్ భారీగా ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరల్లో కొంత కరెక్షన్ రావొచ్చని.. అయినప్పటికీ వచ్చే ఏడాది జూన్ నాటికి పుత్తడి ధర మరో 10 శాతం పెరగవచ్చని షేర్‌ఖాన్ అంచనా వేస్తున్నట్లు సింగ్ తెలిపారు. అలాగే, వెండి రేటు కూడా కేజీకి రూ. 73,000–74,000 స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల పాటు పసిడి, వెండి రేట్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులే ఉండొచ్చని కట్కే చెప్పారు. ‘ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా లేక ద్రవ్యోల్బణం భారీగా పెరిగి దాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తే బంగారం, వెండి రేట్లలో కొంత కరెక్షన్ ఉండొచ్చు. అయితే, అది ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే పసిడి, వెండి రేట్లు పెరిగేందుకు కారణాలు బలంగా ఉన్నాయి‘ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పసిడి రేటును మించి వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని కట్కే పేర్కొన్నారు. -
బంగారం మరింత మెరిసే అవకాశం
కరోనా వైరస్ నేపథ్యం... పెట్టుబడిదారులను పసిడివైపు పరుగులు తీసేలా చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మాంద్యంలోకి జారుకుంటున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఈక్విటీల్లో తీవ్ర ఆటుపోట్లు తత్సంబంధ పరిస్థితుల్లో పసిడి తిరిగి తన చరిత్రాత్మక గరిష్ట రికార్డు స్థాయి... ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశాలే సుస్పష్టమవుతున్నాయి. కరోనా కట్టడి జర క్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5 శాతంపైగా క్షీణతలోకి జారిపోతుందన్న అంచనాలు ఇక్కడ గమనార్హం. అటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతోపాటు, ఇటు వర్థమాన దేశాల విషయంలోనూ ఆర్థిక వ్యవస్థలు క్షీణతనే నమోదుచేస్తాయని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఒక దశలో పసిడి 1,752 డాలర్ల స్థాయినీ చూడ్డం ఇక్కడ ముఖ్యాంశం. దేశంలోనూ రూ.50 వేలు దాటే అవకాశం అంతర్జాతీయ ధోరణే కాకుండా, డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి భారత్‌లో పసిడికి బలమవుతోంది. ఈ పరిస్థితుల్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు శుక్రవారం రూ.47,334 వద్ద ముగిసింది. -
కోవిడ్ భయం.. పసిడి పరుగు!
న్యూయార్క్: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ వార్త రాసే 10 గంటల సమయంలో 1,607 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ వృద్ధిరేటు పడిపోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వస్తున్న వార్తలు కూడా పసిడికి బలంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఏడాదిలో పసిడి ధర 21 శాతం (1,277.9 డాలర్లు కనిష్టం) పెరిగింది. దేశీయంగానూ జోరు... ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, పెళ్లిళ్ల సీజన్ దేశంలో పసిడి ధరను పెంచుతోంది. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి కూడా పసిడికి బలమవుతోంది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర లాభాల్లో రూ.41,470 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఈ మెటల్ ధర రూ.462 ఎగసి రూ.42,339కు ఎగసింది. -
42,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్
సెన్సెక్స్ తొలిసారిగా 42,000 పాయింట్లపైకి ఎగబాకింది. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 42,059 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. పెరుగుతున్న బ్యాంక్‌ల మొండి బకాయిల భారం, ఆర్థిక గణాంకాలపై ఆందోళనతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు అర శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. 247 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... అమెరికా– చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పం దం బుధవారం కుదిరింది. దీంతో గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమ్మకాలు జోరుగా జరగడంతో రెండు సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. చివర్లో నష్టాలు రికవరీ అయి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 60 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ► నెస్లే ఇండియా 3 శాతం లాభంతో రూ.15,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ క్యూ3లో ఆర్థిక ఫలితాలు బాగా ఉండగలవనే అంచనాలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.15,399ను తాకింది. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డాబర్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇప్కా ల్యాబ్స్, జేకే సిమెంట్స్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మణప్పురం ఫైనాన్స్, ఫీనిక్స్ మిల్స్, పాలీక్యాబ్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది సెన్సెక్స్ లాభం 9 శాతం ! ఈ ఏడాది సెన్సెక్స్ 9 శాతం మేర లాభపడగలదని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 44,500 పాయింట్లకు ఎగబాకుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం అంతంతమాత్రంగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయని తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థ కాదని, అగ్రస్థాయి 50 కంపెనీలకు సంబంధించిందని ఈ సంస్థ ఇండియా హెడ్ అభిరామ్ ఈలేశ్వరపు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్‌కు రిస్క్ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సూచీల ఇంట్రాడే శిఖర స్థాయిలు సెన్సెక్స్ 42,059 నిఫ్టీ 12,389 36 సెషన్లలో 1,000 పాయింట్లు సెన్సెక్స్ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.ఈ కాలంలో టాటా స్టీల్ 18 శాతం, ఇన్ఫోసిస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, భారతీ ఎయిర్టెల్ 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బాటా ఇండియా, పీటీసీ ఇండియా, డీసీబీ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ట్రైడెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, బెర్జర్ పెయింట్స్, ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు 10–100 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ 36 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, బడ్జెట్లో మరిన్ని తాయిలాలు ఇవ్వనున్నదన్న అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులంటున్నారు. -
రికార్డుల ర్యాలీ..
స్టాక్ మార్కెట్లో ఆల్‌టైమ్ హై రికార్డ్ల జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల దన్నుతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులు చోటుచేసుకున్నా,...సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నేడు(శుక్రవారం) వెల్లడి కానున్న ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 జీడీపీ గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, సూచీలు ముందుకే దూసుకుపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 12,151 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా రెండో రోజు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కలసివచ్చింది. ఒక్క వాహన సూచీ మినహా మిగిలిన అన్ని నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా.... హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే పెరుగుతున్న అంతర్జాతీయ లిక్విడిటీ మన మార్కెట్‌కు ఊతాన్నిస్తోందని విశ్లేషకులంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానివ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,164, నిఫ్టీ 12,159 పాయింట్ల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇవి రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. ► ధరలు పెంచే అవకాశాలున్నాయన్న వార్తలతో లోహ షేర్లు పెరిగాయి. ► ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 25 శాతం ఎగసి రూ.334 వద్ద ముగిసింది. గత నెల 17న రూ.166కు పడిపోయిన ఈ షేర్ నెలన్నర వ్యవధిలోనే 110% పెరగడం విశేషం. ► ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 2.6 శాతం లాభంతో రూ. 519 వద్ద ముగిసింది. ► పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, అదానీ గ్రీన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, దివీస్ ల్యాబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. రూ.1.87 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.1.87 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.1,87,371 కోట్లు పెరిగి రూ.155.58 లక్షల కోట్లకు ఎగబాకింది. -
ఆల్‌టైమ్ హైకి సెన్సెక్స్
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. రోజంతా లాభాలే..:లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ ఆల్‌టైమ్ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగబాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. కొనసాగిన ‘రిలయన్స్’ రికార్డ్‌లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రికార్డ్ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. షేర్ ఆల్‌టైమ్ హై, మార్కెట్ క్యాప్ రికార్డ్‌లు బుధవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో 4.1 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,572ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,547 వద్ద ముగిసింది. ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇక ఈ కంపెనీ మార్కెట్ క్యాప్(ఈ కంపెనీ మొత్తం షేర్లను ప్రస్తుత ధర వద్ద గుణిస్తే వచ్చే మొత్తం) రూ.10 లక్షల కోట్ల మార్క్‌కు చేరువయింది. మార్కెట్ ముగిసేనాటికి రూ.9,80,700 కోట్ల మార్కెట్ క్యాప్‌తో అత్యధిక మార్కెట్ క్యాప్ గల భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,96,415 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ (13,600 కోట్ల డాలర్లు) బ్రిటిష్ ఇంధన దిగ్గజం, బీపీపీఎల్సీని దాటేసింది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు ముందు బీపీపీఎల్‌సీ మార్కెట్ క్యాప్ 13,000 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంది. -
11,800 దిగువకు నిఫ్టీ
మ్యూచువల్ ఫండ్స్‌పై నిబంధనలను కఠినతరం చేస్తూ సెబీ నిర్ణయాలు తీసుకోవడం ప్రతికూల ప్రభావం చూపడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. జీ–20 సమావేశం నేపథ్యంలో అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా మార్కెట్ క్షీణతకు ఒక కారణమని నిపుణులు పేర్కొన్నారు. గత నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయన్న వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు తగ్గి 39,395 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు పతనమై 11,789 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, కమోడిటీ షేర్లు కూడా పతనమయ్యాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడటంతో నష్టాలు పరిమితమయ్యాయి. అయితే వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్‌చేసే లిక్విడ్ స్కీమ్స్.. తమ నిధుల్లో కనీసం 20 శాతం మేర నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి లిక్విడ్ అసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని సెబీ ఆదేశించింది. అంతేకాకుండా షేర్ల తనఖాగా రుణాలిచ్చిన కంపెనీలతో తదనంతర చెల్లింపుల ఒప్పందాలు కుదుర్చుకోవడంపై నిషేధం విధించింది. మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్‌కంపెనీలపై మరింత నిఘా అవసరమంటూ ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక వెల్లడించింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరగడం... మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత తేరుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చింది. వెంటనే మళ్లీ నష్టాల బాట పట్టింది. ఆల్‌టైమ్ హైకి ఎస్బీఐ మొండి బకాయిల సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, 2020, మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి రుణాలు 9 శాతానికి తగ్గగలవన్న తాజా ఆర్బీఐ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 12 శాతం వరకూ పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.365ను తాకింది. చివరకు శాతం 0.3 శాతం నష్టంతో రూ.361 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఓబీలు 1–7 శాతం రేంజ్ లాభాలతో ముగిశాయి. ఎస్బీఐతో పాటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, గోద్రేజ్ ప్రొపర్టీస్, హావెల్స్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, ఒబెరాయ్ రియల్టీ, ట్రెంట్ తదితర షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. కాక్స్ అండ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ.36 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేసే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో 89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 224 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 313 పాయింట్ల రేంజ్లో కదలాడింది. -
ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్
న్యూఢిల్లీ: సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్ ధరలు సోమవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91 మార్క్‌ను దాటింది. ముంబైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఔట్లెట్లలో లీటర్ పెట్రోల్ రూ.91.08 ఉండగా, డీజిల్ రూ.79.72కు చేరుకుంది. ఇక, భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీఎల్) ఔట్లెట్లలో పెట్రోల్ రూ.91.15 కాగా, డీజిల్ రూ.79.79గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటంతో ఆయిల్ కంపెనీలు సోమవారం లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.73, డీజిల్ రూ.75.09కు చేరుకొని రికార్డు సృష్టించాయి. గడచిన 6 వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.59, డీజిల్ 6.37 రూపాయలు పెరగటం గమనార్హం. -
ముంబైలో పెట్రోల్ రూ.90
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్ ధరలు సోమవారం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆ ర్థిక రాజధాని ముంబైలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్క్‌ను దాటి రికార్డ్ సృష్టించింది. ముంబై నగరంలోని ఐవోసీ ఔట్లెట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.08, డీజిల్ రూ.78.58. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సోమవారం లీటర్ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి. -
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం సవరించిన ధరల ప్రకారం.. పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 39 పైసల ధర పెరిగింది. దీంతో ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.86.56కు చేరుకుంది. డీజిల్ ధర రూ.75.54గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.79.15, లీటరు డీజిల్ రూ.71.15గా ఉంది. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.42 ధర పెరిగింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు (బ్యారెల్‌కు) పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్జీ, పీఎన్జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్జీ 63 పైసలు, పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సీఎం)కు రూ.1.11 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సీఎన్జీ రూ.42.60గా పీఎన్జీ ధర ఎస్సీఎంకు రూ.28.25కు చేరుకుంది. -
తొలిసారి 26 వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్
ముంబై: కేంద్ర వార్షిక బడ్జెట్ గురువారం(10న) వెలువడనున్న నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. మార్కెట్ సూచిలు జీవనకాల గరిష్టస్థాయిని అందుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 26 వేల పాయింట్లను తాకింది. సెన్సెక్స్ 26 వేల పాయింట్ల స్థాయిని అందుకోవడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7,787 పాయింట్లను తాకింది. మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం(8న) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆపై బుధవారం(9న) ఆర్థిక సర్వే వెల్లడికానుంది. ఇవికాకుండా శుక్రవారం సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి క్వార్టర్(2013-14, ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఇదే రోజున మే నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.