స్టాక్ మార్కెట్‌లో ఆల్‌టైమ్ హై రికార్డ్‌ల జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల దన్నుతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులు చోటుచేసుకున్నా,...సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నేడు(శుక్రవారం) వెల్లడి కానున్న ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 జీడీపీ గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, సూచీలు ముందుకే దూసుకుపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 12,151 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా రెండో రోజు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కలసివచ్చింది. ఒక్క వాహన సూచీ మినహా మిగిలిన అన్ని నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి.
ప్రపంచ మార్కెట్లు పతనమైనా....
హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే పెరుగుతున్న అంతర్జాతీయ లిక్విడిటీ మన మార్కెట్‌కు ఊతాన్నిస్తోందని విశ్లేషకులంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానివ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,164, నిఫ్టీ 12,159 పాయింట్ల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇవి రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు.
► ధరలు పెంచే అవకాశాలున్నాయన్న వార్తలతో లోహ షేర్లు పెరిగాయి.
► ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 25 శాతం ఎగసి రూ.334 వద్ద ముగిసింది. గత నెల 17న రూ.166కు పడిపోయిన ఈ షేర్ నెలన్నర వ్యవధిలోనే 110% పెరగడం విశేషం.
► ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 2.6 శాతం లాభంతో రూ. 519 వద్ద ముగిసింది.
► పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, అదానీ గ్రీన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, దివీస్ ల్యాబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
రూ.1.87 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.1.87 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.1,87,371 కోట్లు పెరిగి రూ.155.58 లక్షల కోట్లకు ఎగబాకింది.
రికార్డుల ర్యాలీ..
Published Fri, Nov 29 2019 6:11 AM | Last Updated on Fri, Nov 29 2019 6:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment