ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు సోమవారం నాడు స్టాక్‌మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఆర్థిక రంగ షేర్లు నష్టపోయినా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ లాభపడింది. ఇంట్రాడేలో 330 పాయింట్ల మేర లాభపడినా, చివరకు సెన్సెక్స్ 99 పాయింట్లు పెరిగి 36,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10,803 పాయింట్ల వద్దకు చేరింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చినా, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు 2 శాతం మేర నష్టపోవడంతో సూచీల లాభాలు సగానికి పైగా హరించుకుపోయాయి. దేశంలో కొన్ని చోట్ల మళ్లీ లాక్‌డౌన్ విధించనుండడం, కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి.
లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...
ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే మొదలైంది. 10 గంటల తర్వాత లాభాలు తగ్గడం మొదలైంది. మధ్యాహ్నం రెండు తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. తొందర్లోనే కోలుకొని మళ్లీ లాభాల బాట పట్టింది. చివరకు స్వల్ప లాభాల్లోనే ముగిసింది. కంపెనీల క్యూ1 ఫలితాలపై ఆశాభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
► వాహన కొనుగోళ్ల రుణాల విషయమై జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందన్న వార్తల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,080 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన రెండో షేర్ ఇదే.
► దాదాపు 120కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► క్యూ1లో నికర లాభం 88% తగ్గడంతో అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ 4% నష్టంతో రూ.2,232 వద్ద ముగిసింది.
రికార్డ్ హైకి రిలయన్స్
రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,947 ను తాకింది. చివరకు 3 శాతం లాభంతో రూ. 1,930 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12 లక్షల కోట్ల మార్క్‌ను దాటిపోయింది. సోమవారం ఒక్క రోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.35,374 కోట్లు పెరిగి రూ.12,26,231 కోట్లకు చేరింది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీ ఇదే. ఇక అంతర్జాతీయంగా చూస్తే, 51వ స్థానంలో నిలిచింది. మార్చి 23 నాటి కనిష్ట స్థాయి, రూ.867 నుంచి చూస్తే, ఈ షేర్ 125 శాతం ఎగసింది. క్వాల్‌కామ్ సంస్థ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.730 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసిందని గత శనివారం రిలయన్స్ ప్రకటించింది.
ఆరంభ లాభాలు ఆవిరి
Published Tue, Jul 14 2020 2:10 AM | Last Updated on Tue, Jul 14 2020 2:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment