IT Business
-
ఇక టెక్ గురూ.. సాఫ్ట్వేర్ బిజినెస్‌లోకి రాందేవ్ బాబా!
యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాందేవ్ బాబా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం ఆయన రాణిస్తున్నారు. తాజాగా రాందేవ్ బాబా నేతృత్వంలోని కంపెనీ సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్నాలజీ సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పుణేకు చెందిన అష్దాన్ ప్రాపర్టీస్ రోల్టాకు అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించిన కొద్ది వారాలకే బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 830 కోట్లు ఆఫర్ చేసింది. పతంజలి ఆయుర్వేద్ తన ఆఫర్‌ను చేర్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో సంస్థ చేరికను ప్యానెల్ నిర్ణయిస్తుంది. మూడుసార్లు దివాలా.. కమల్ సింగ్ అనే వ్యక్తి రోల్టాను డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రమోట్ చేశారు. ఈ సంస్థ జనవరి 2023లో దివాలా ప్రక్రియలో చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూ. 7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ. 6,699 కోట్లు బకాయిపడింది. రోల్టా మొదటిసారిగా 2016లో విదేశీ కరెన్సీ రుణాలను డిఫాల్ట్ చేసింది. మూడుసార్లు దివాలా తీసివేసిన తర్వాత ఆఖరికి యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఎన్సీఎల్టీకి చేరింది. ఇదీ చదవండి: టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి.. కంపెనీ డిఫెన్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్‌లలో సేవలు అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ కాలంలో ఆదాయం రూ.38 కోట్లు మాత్రమే. రోల్టాకు ఉన్న రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ముంబైలోని ఆస్తులు బిడ్డర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ హోమ్ డెలివరీ అప్లికేషన్ కోసం రోల్టా ఐటీ మౌలిక సదుపాయాలను పతంజలి ఆయుర్వేద్ పరిశీలిస్తున్నట్లు ఈటీ నివేదిక పేర్కొంది. -
రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: ఐటీ, ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీఐఐసీ (ఏపీ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కూడా భారీ ఐటీ బిజినెస్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. మధురవాడ హిల్ నెంబర్–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ తాజాగా బిడ్లను ఆహ్వనించింది. ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫెసిలిటీలతో పాటు తగినంత పార్కింగ్ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్‌ను సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్పీవీలో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా.. ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 40 శాతం ఈక్విటీగా సమకూర్చాల్సి ఉంటుంది. ఈక్విటీ రూపంలో ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం రూ.1,380 కోట్లను రుణ రూపంలో సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అన్నీ భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించామని, భాగస్వామ్య కంపెనీ ఎన్నిక అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. గడిచిన ఐదేళ్లలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్ సంస్థలు విశాఖలో ఏర్పాటుకావడంతో స్థిరాస్తి ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఐ–స్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
లేఆఫ్స్ బాంబు: టాప్ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!
సాక్షి,ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇప్పటికే 10వేలకు పైగా సిబ్బందిని తొలగించినట్టు ప్రకటించిన అమెజాన్ తాజాగా టాప్ మేనేజర్లు సహా 20 వేల మందికి ఉద్వాసన పలికేందుకు రడీ అవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎవరికి ఎపుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియక ఉద్యోగులు వణికిపోతున్నారు. (కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్) తాజా నివేదికల ప్రకారం రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ దెబ్బ కారణంగా రానున్న నెలల్లో అమెజాన్ ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ యోచిస్తోంది. ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలగించే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీచేయడంతో పరిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయనున్నారు. 20 వేల మందిని తొలగించే ప్రయత్నంలో భాగంగా, గత కొన్ని రోజులుగా కంపెనీ మేనేజర్లు, ఉద్యోగులలో పని పనితీరు సమస్యలను గుర్తించడానికి ప్రయత్నించాలని చెప్పిందట. ఇరవై వేల మంది ఉద్యోగులు దాదాపు 6శాతం కార్పొరేట్ సిబ్బందికి సమానం. కాగా పలు విభాగాల్లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ ఇటీవలి సంకేతాల అందించిన సంగతి తెలిసిందే. -
వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు
న్యూఢిల్లీ: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌లు, ఐటీ-ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో వచ్చే రెండేళ్ల కాలంలో కోటి ఉద్యోగాల కల్పన మైలురాయిని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈఎస్సీ-ఎస్టీపీఐ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ-ఐటీఈఎస్, స్టార్టప్‌లు మూడు ముఖ్య స్తంభాలుగా అభివర్ణించారు. ఈ రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించి నట్టు మంత్రి చెప్పారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వచ్చే రెండేళ్లలో ఇది సులభంగానే కోటి దాటుతుందన్నారు. ‘‘లోగడ స్టార్టప్‌లకు సంబంధించి కొన్ని పట్టణాల పేర్లే వినిపించేవి. కానీ, ఇప్పుడు గ్రామాల్లో పాఠశాలలను సందర్శించినప్పుడు అక్కడి పిల్లలు స్థానికంగానే స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు’’అని మంత్రి వెల్లడించారు. భారత్ టెక్నాలజీ వినియోగదారు నుంచి టెక్నాలజీ ఉత్పత్తిదారుగా మారినట్టు చెప్పారు. (జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు) స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్లగ్ అండ్ ప్లే (వచ్చి వెంటనే పనిచేసుకునే ఏర్పాట్లు) సదుపాయాలను కల్పిస్తున్నట్టు మంత్రి వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 64 పట్టణాల్లో స్టార్టప్‌ల కోసం ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలను ఆఫర్ చేస్తున్నట్టు ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ ఇదే కార్యక్రమంలో తెలిపారు. ఇందులో 53 కేంద్రాలు టైర్ 2, 3 పట్టణాల్లో ఉన్నట్టు చెప్పారు. రూ.5-10 లక్షల సీడ్ ఫండింగ్ కూడా సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇవీ చదవండి: వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు -
విప్రో ‘సీఈవో’గా అనిస్!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో సీఈవోగా (ఆసియా పసిఫిక్, భారత్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల విభాగం – ఏపీఎంఈఏ) అనిస్ చెన్చా నియమితులయ్యారు. కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల్లో ఆయనకు రెండు దశాబ్దాల పైగా అనుభవం ఉందని సంస్థ వెల్లడించింది. అనిస్ ఇప్పటివరకూ క్యాప్‌జెమినిలో గ్లోబల్ సీఈవోగా (బిజినెస్ సర్వీసెస్ విభాగం), గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా వ్యవహరించారు. అత్యంత సమర్ధమంతులైన వారితో టీమ్‌లను తీర్చిదిద్దడం, సంక్లిష్టమైన మార్పులను సమర్ధంగా అమలు చేయగలగడం వంటి సామర్థ్యాలు అనిస్‌కు సొంతమని ఈ సందర్భంగా విప్రో సీఈవో, ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. ఇప్పటివరకూ ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ బాలా వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో అనిస్ నియమితులయ్యారు. -
మారిన ఐటీ కంపెనీల ఫోకస్
ముంబై, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో కొద్ది రోజులుగా యూరోపియన్ మార్కెట్లవైపు దృష్టి సారించాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతాల నుంచి భారీ డిల్స్‌ను పొందడంతో రూటు మార్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేశీ ఐటీ కంపెనీలు యూఎస్ నుంచే అత్యధిక కాంట్రాక్టులు సంపాదిస్తుంటాయి. దీంతో ఆదాయంలో యూఎస్ 70 శాతం వాటా వరకూ ఆక్రమిస్తుంటుంది. అయితే ఇటీవల దేశీ కంపెనీలు యూరోపియన్ ప్రాంత కంపెనీలను కొనుగోలు చేస్తుండటం కూడా వ్యూహాల మార్పునకు కారణమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) కోవిడ్-19 ఎఫెక్ట్ ఏడాది కాలంగా ప్రపంచాన్ని.. ప్రధానంగా యూరోపియన్ దేశాలను కోవిడ్-19 మహమ్మారి వణికిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని యూరోపియన్ మార్కెట్లు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. ఫలితంగా దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలకు అవకాశాలు పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం కారణంగా విక్రయానికి వచ్చిన అక్కడి కంపెనీలను సైతం కొనుగోలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. గత కొద్ది నెలలుగా చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో పలు చిన్న కంపెనీలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవలలు అందించేందుకు భారీ డిల్స్‌ను సైతం కుదుర్చుకున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లోనూ ఇతర కంపెనీల కొనుగోళ్లు, లేదా కాంట్రాక్టులను పొందేందుకు ప్రయత్నించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. (డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే) జర్మన్ జోష్ యూరోప్‌లో ఇటీవల జర్మనీ నుంచి దేశీ కంపెనీలు మెగా డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఔట్‌సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వని జర్మన్ కంపెనీలు కరోనా కల్లోలంతో వ్యూహాలు మార్చుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితరాలకు అవకాశాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది నెలలుగా యూరోపియన్ ప్రాంత ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం తెలియజేశారు. ఇది కొనసాగే వీలున్న్లట్లు అంచనా వేశారు. గతేడాది నవంబర్‌లో డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్స్‌ను టీసీఎస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 1,500 మంది జర్మన్ ఉద్యోగులకు శిక్షణ, తదితర సేవలను అందిస్తోంది. ఇదే నెలలో బీమా దిగ్గజం ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రామెరికా సిస్టమ్స్ ఐర్లాండ్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వల్ల వీసాల సమస్యలున్న ప్రాంతాలలో 2,500 మంది ఉద్యోగులను వెనువెంటనే వినియోగించుకునేందుకు వీలు చిక్కినట్లు సుబ్రమణ్యం చెప్పారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాలలో భారీగా వృద్ధిని ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఐటీ షేర్ల దూకుడు- సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. తొలుత కొంతమేర ఊగిసలాటకు లోనైనప్పటికీ ప్రస్తుతం సెన్సెక్స్ 311 పాయింట్లు జంప్‌చేసింది. 46,318కు చేరింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు ఎగసి 13,557 వద్ద ట్రేడవుతోంది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలోనూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. యాక్సెంచర్ అంచనాలను మించిన గైడెన్స్ ప్రకటించడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు విప్రో తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 70 కోట్ల డాలర్ల డీల్‌ను కుదుర్చుకోవడం, రూ. 9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుండటం వంటి అంశాలు జత కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కౌంటర్లలో కనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా అటు బీఎస్ఈలోనూ, ఇటు ఎన్ఎస్ఈలోనూ ఐటీ ఇండెక్సులు తాజాగా సరికొత్త గరిష్టాలను చేరాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌తోపాటు.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్) రికార్డుల బాట ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా.. బీఎస్ఈలో 24,174కు చేరింది. సాఫ్ట్వేర్ సేవల కంపెనీలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ. 1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ. 960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 933 సమీపంలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ రూ. 3,685 సమీపంలో, ఎంఫసిస్ రూ. 1,533 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 265 సమీపంలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ. 1,459 వద్ద చరిత్రాత్మక గరిష్టాల రికార్డులను సాధించాయి. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) లాభాల్లో ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో రామ్‌కో సిస్టమ్స్, ఈక్లెర్క్స్, హెచ్జీఎస్, ఫస్ట్‌సోర్స్, మాస్టెక్, టాటా ఎలక్సీ, ఎన్ఐఐటీ లిమిటెడ్, మైండ్‌ట్రీ, ట్రైజిన్, ఇంటెలెక్ట్ డిజైన్, శాస్కెన్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ తదితరాలు 8-3.5 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! -
యూఎస్ ఎన్నికలు- ఐటీ షేర్లు గెలాప్
యూఎస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 3 శాతం ఎగసింది. యూఎస్ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. లేదా డెమొక్రటిక్ బైడెన్ గెలిచినాగానీ దేశీ ఐటీ రంగానికి మేలే జరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్ విజయం సాధిస్తే హెచ్1బీ వీసాల నిబంధనల సడలింపు ద్వారా దేశీ ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదేవిధంగా ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ పదవి చేపడితే.. యూఎస్ డాలరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశీ ఐటీ కంపెనీలు అధిక శాతం ఆదాయాలను ఉత్తర అమెరికా నుంచి సాధించే విషయం విదితమే. దీంతో డాలరు బలపడితే ఐటీ రంగ మార్జిన్లు మెరుగుపడే వీలుంటుంది. వెరసి రెండు విధాలా దేశీ ఐటీ కంపెనీలకు ప్రయోజనమేనని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పలు బ్లూచిప్, మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్లు హుషారుగా కదులుతున్నాయి. కోఫోర్జ్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 2,222ను తాకగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 3.5 శాతం పెరిగి రూ. 3,039కు చేరింది. ఈ బాటలో ఇన్ఫోసిస్ 3.4 శాతం ఎగసి రూ. 1,099 వద్ద, విప్రో 3.1 శాతం బలపడి రూ. 346 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో టీసీఎస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2691కు చేరగా.. మైండ్‌ట్రీ 2.2 శాతం లాభంతో రూ. 1,346 వద్ద, టెక్ మహీంద్రా 2.1 శాతం వృద్ధితో రూ. 825 వద్ద కదులుతున్నాయి. ఇదేవిధంగా ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,383ను తాకగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.3 శాతం అధికంగా రూ. 825 వద్ద ట్రేడవుతోంది. -
ఐటీ అదుర్స్- సెన్సెక్స్@ 40,000
దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ హవా చూపుతోంది. వరుసగా ఐదో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ప్రస్తుతం 434 పాయింట్లు పెరిగి 10,313ను తాకింది. నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 11,866 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై తిరిగి అంచనాలు పెరగడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. దీంతో సెంటిమెంటుకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ 4.25 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ, మారుతీ, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, టైటన్, కోల్ ఇండియా, టైటన్, ఐటీసీ, ఐవోసీ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో మైండ్‌ట్రీ, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, ఐబీ హౌసింగ్, ఎన్ఎండీసీ, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐడియా 5.3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. అదానీ ఎంటర్, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ ప్రు, టాటా పవర్, ఎంజీఎల్, ఏసీసీ, పేజ్ 1.6-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,111 షేర్లు లాభపడగా.. 593 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
లాభాలతో షురూ- బ్యాంకింగ్ జోరు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 265 పాయింట్లు జంప్‌చేసి 38,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు ఎగసి 11,351కు చేరింది. మూడు రోజుల పతనానికి బుధవారం చెక్ పెడుతూ యూఎస్ మార్కెట్లు హైజంప్ చేశాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా నష్టాలకు చెక్ పడినట్లు తెలియజేశారు. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టడంతో అటు యూఎస్, ఇటు దేశీ మార్కెట్లు రీబౌండ్ అయినట్లు వివరించారు. ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ఫార్మా 0.15 శాతం బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఐటీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, యాక్సిస్, గెయిల్, ఐసీఐసీఐ, ఎంఅండ్ఎం 3.4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్, ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా 1-0.25 శాతం మధ్య నీరసించాయి. ఫైనాన్స్ భేష్ డెరివేటివ్ కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్, ఎల్ఐసీ హౌసింగ్, కెనరా బ్యాంక్, నాల్కో, మణప్పురం, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐడియా 3-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మ్యాక్స్ ఫైనాన్స్, ఎస్కార్ట్స్, కంకార్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.6 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1228 లాభాలతోనూ, 237 నష్టాలతోనూ కదులుతున్నాయి. -
ఆరంభ లాభాలు ఆవిరి
ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు సోమవారం నాడు స్టాక్‌మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఆర్థిక రంగ షేర్లు నష్టపోయినా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ లాభపడింది. ఇంట్రాడేలో 330 పాయింట్ల మేర లాభపడినా, చివరకు సెన్సెక్స్ 99 పాయింట్లు పెరిగి 36,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10,803 పాయింట్ల వద్దకు చేరింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చినా, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు 2 శాతం మేర నష్టపోవడంతో సూచీల లాభాలు సగానికి పైగా హరించుకుపోయాయి. దేశంలో కొన్ని చోట్ల మళ్లీ లాక్డౌన్ విధించనుండడం, కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే మొదలైంది. 10 గంటల తర్వాత లాభాలు తగ్గడం మొదలైంది. మధ్యాహ్నం రెండు తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. తొందర్లోనే కోలుకొని మళ్లీ లాభాల బాట పట్టింది. చివరకు స్వల్ప లాభాల్లోనే ముగిసింది. కంపెనీల క్యూ1 ఫలితాలపై ఆశాభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► వాహన కొనుగోళ్ల రుణాల విషయమై జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందన్న వార్తల కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,080 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన రెండో షేర్ ఇదే. ► దాదాపు 120కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► క్యూ1లో నికర లాభం 88% తగ్గడంతో అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ 4% నష్టంతో రూ.2,232 వద్ద ముగిసింది. రికార్డ్ హైకి రిలయన్స్ రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,947 ను తాకింది. చివరకు 3 శాతం లాభంతో రూ. 1,930 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12 లక్షల కోట్ల మార్క్‌ను దాటిపోయింది. సోమవారం ఒక్క రోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.35,374 కోట్లు పెరిగి రూ.12,26,231 కోట్లకు చేరింది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీ ఇదే. ఇక అంతర్జాతీయంగా చూస్తే, 51వ స్థానంలో నిలిచింది. మార్చి 23 నాటి కనిష్ట స్థాయి, రూ.867 నుంచి చూస్తే, ఈ షేర్ 125 శాతం ఎగసింది. క్వాల్కామ్ సంస్థ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.730 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసిందని గత శనివారం రిలయన్స్ ప్రకటించింది. -
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
వరుస రెండు రోజుల నష్టాల నుంచి శుక్రవారం స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఐటీ, బ్యాంక్, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడం కలసివచ్చింది. సెన్సెక్స్ మళ్లీ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,300 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా 75.65 వద్ద ముగిసినా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెన్సెక్స్ 329 పాయింట్లు ఎగసి 35,171 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 440 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఈ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో వారం. మిశ్రమంగా ప్రపంచ మార్కెట్లు.... బ్యాంక్‌ల పెట్టుబడులపై ఉన్న పరిమితులను అమెరికా తొలగించింది. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే సాగుతున్నాయి. హాంగ్ కాంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే డివిడెండ్లపై పరిమితి విధించాలని, బైబ్యాక్‌లు ఆపేయాలని అమెరికా ప్రభుత్వం అక్కడి బ్యాంక్‌లను తాజాగా కోరింది. మాంద్యం పరిస్థితులు మరింత అస్తవ్యస్తమైన పక్షంలో నిధులను పరిరక్షించుకునే దిశగా బ్యాంక్‌లను సిద్ధం చేయడాన్ని ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. ఫలితంగా యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా స్టాక్ సూచీలు 1–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లకు యాక్సెంచర్ జోష్ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ మార్చి క్వార్టర్ ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో మన ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ► ఇన్ఫోసిస్ 7% లాభంతో రూ.వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 130కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. బయోకాన్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. -
దేశీ ఐటీకి వైరస్ షాక్
ముంబై : కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దేశీ టెక్నాలజీ పరిశ్రమ కుదేలవుతోంది. వైరస్ ధాటికి ఆర్డర్లు, ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో భారత ఐటీ రంగంలో రాబడి వృద్ధి పదేళ్ల కనిష్ట స్ధాయిలో రెండు శాతం వరకూ తగ్గనుంది. ఐటీ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో లాభాలు తగ్గుముఖం పడతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. లాక్డౌన్ల నేపథ్యంలో కొత్త ఒప్పందాలు జరగకపోవడంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలుస్తూ 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సమకూరుస్తున్న దేశీ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమ మహమ్మారి ప్రభావానికి లోనైతే ఉపాధి రంగంపై అది పెను ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న క్రమంలో దేశీ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో సహా పలు కంపెనీలు వార్షిక గైడెన్స్‌లు ఇచ్చే పద్ధతిని విరమించాయి. చదవండి : ‘టీ వర్క్స్’ టెక్నాలజీతో ఎయిరోసోల్ బాక్సులు మార్చి- మే మధ్య సహజంగా కొత్త ఒప్పందాలు జరుగుతుంటాయని, ఈసారి వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు అమలవుతున్న క్రమంలో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, మరోవైపు ప్రస్తుత కాంట్రాక్టుల కొనసాగింపుపైనా అనిశ్చితి నెలకొందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి పేర్కొన్నారు. ఆదాయాల్లో క్షీణత ఐటీ కంపెనీల లాభాలను ప్రభావితం చేస్తుందని, మరోవైపు ఆయా కంపెనీలు డిజిటల్ ప్రాజెక్టులపై వెచ్చిస్తున్న క్రమంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ రాజేశ్వరి కార్తిగేయన్ విశ్లేషించారు. -
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ వ్యాపారం
డీల్ విలువ రూ.895 కోట్లు న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వోల్వో గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనున్నది. వోల్వో ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థ రూ.895 కోట్లకు కొనుగోలు చేస్తోందని, దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నామని వోల్వో గ్రూప్ తెలిపింది. ఈ డీల్ అంతా నగదు రూపేణా జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా వోల్వో గ్రూప్ ఐటీ ఇన్ఫ్రా కార్యకలాపాలను ఐదేళ్లపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు అవుట్సోర్సింగ్కు ఇచ్చామని తెలిపింది. దీనికి సంబంధించిన అర్థిక వివరాలను మాత్రం వొల్వో గ్రూప్ వెల్లడించలేదు. ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్‌కు విక్రయించడం వల్ల 2,600 మంది ఐటీ సిబ్బందిపై ప్రభావం పడుతుందని, హెచ్‌సీఎల్‌లో పనిచేసే అవకాశాన్ని వారికి కల్పించామని వివరించింది. ఐటీ వ్యాపార విక్రయం వొల్వో గ్రూప్‌కు ప్రయోజనకరమేనని వోల్వో సీఎఫ్ఓ, తాత్కాలిక ప్రెసిడెంట్ జాన్ గారండర్ పేర్కొన్నారు. వోల్వో సంస్థతో జట్టు కట్టడం అదనపు విలువను సృష్టించడానికి తమకు దక్కిన ఒక మంచి అవకాశమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత గుప్తా చెప్పారు. ఈ డీల్ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.7 శాతం వృద్దితో రూ.864 వద్ద ముగిసింది.