ఇక టెక్‌ గురూ.. సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌లోకి రాందేవ్‌ బాబా!  | Baba Ramdev getting into IT business patanjali Rolta bid sparks buzz | Sakshi
Sakshi News home page

ఇక టెక్‌ గురూ.. సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌లోకి రాందేవ్‌ బాబా! 

Published Sat, Feb 3 2024 3:47 PM | Last Updated on Sat, Feb 3 2024 4:32 PM

Baba Ramdev getting into IT business patanjali Rolta bid sparks buzz - Sakshi

యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాందేవ్‌ బాబా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.  భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం ఆయన రాణిస్తున్నారు. తాజాగా రాందేవ్‌ బాబా నేతృత్వంలోని కంపెనీ సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్నాలజీ సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. పుణేకు చెందిన అష్దాన్ ప్రాపర్టీస్ రోల్టాకు అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించిన కొద్ది వారాలకే బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 830 కోట్లు ఆఫర్‌ చేసింది. పతంజలి ఆయుర్వేద్ తన ఆఫర్‌ను చేర్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో సంస్థ చేరికను ప్యానెల్ నిర్ణయిస్తుంది.

 

మూడుసార్లు దివాలా..
కమల్ సింగ్ అనే వ్యక్తి రోల్టాను డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీగా ప్రమోట్ చేశారు. ఈ సంస్థ జనవరి 2023లో దివాలా ప్రక్రియలో చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూ. 7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని విదేశీ బాండ్ హోల్డర్‌లకు మరో రూ. 6,699 కోట్లు బకాయిపడింది. రోల్టా మొదటిసారిగా 2016లో విదేశీ కరెన్సీ రుణాలను డిఫాల్ట్ చేసింది. మూడుసార్లు దివాలా తీసివేసిన తర్వాత ఆఖరికి యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఎన్‌సీఎల్‌టీకి చేరింది.

ఇదీ చదవండి: టెక్‌ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్‌! ఇన్నాళ్లకు తెరపైకి..

కంపెనీ డిఫెన్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్‌లలో సేవలు అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ కాలంలో ఆదాయం రూ.38 కోట్లు మాత్రమే. రోల్టాకు ఉన్న రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ముంబైలోని ఆస్తులు బిడ్డర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ హోమ్ డెలివరీ అప్లికేషన్ కోసం రోల్టా ఐటీ మౌలిక సదుపాయాలను పతంజలి ఆయుర్వేద్  పరిశీలిస్తున్నట్లు ఈటీ నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement