యూఎస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 3 శాతం ఎగసింది. యూఎస్ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. లేదా డెమొక్రటిక్ బైడెన్ గెలిచినాగానీ దేశీ ఐటీ రంగానికి మేలే జరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్ విజయం సాధిస్తే హెచ్1బీ వీసాల నిబంధనల సడలింపు ద్వారా దేశీ ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదేవిధంగా ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ పదవి చేపడితే.. యూఎస్ డాలరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశీ ఐటీ కంపెనీలు అధిక శాతం ఆదాయాలను ఉత్తర అమెరికా నుంచి సాధించే విషయం విదితమే. దీంతో డాలరు బలపడితే ఐటీ రంగ మార్జిన్లు మెరుగుపడే వీలుంటుంది. వెరసి రెండు విధాలా దేశీ ఐటీ కంపెనీలకు ప్రయోజనమేనని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం..
హుషారుగా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పలు బ్లూచిప్, మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్లు హుషారుగా కదులుతున్నాయి. కోఫోర్జ్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 2,222ను తాకగా.. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ 3.5 శాతం పెరిగి రూ. 3,039కు చేరింది. ఈ బాటలో ఇన్ఫోసిస్ 3.4 శాతం ఎగసి రూ. 1,099 వద్ద, విప్రో 3.1 శాతం బలపడి రూ. 346 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో టీసీఎస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2691కు చేరగా.. మైండ్‌ట్రీ 2.2 శాతం లాభంతో రూ. 1,346 వద్ద, టెక్ మహీంద్రా 2.1 శాతం వృద్ధితో రూ. 825 వద్ద కదులుతున్నాయి. ఇదేవిధంగా ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,383ను తాకగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.3 శాతం అధికంగా రూ. 825 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment