రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. రుణ రహిత కంపెనీగా అవతరించామని ప్రకటించడంతో రిలయన్స్ షేర్ దూసుకుపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 2 శాతం పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 76,20కు చేరినా సూచీలు ముందుకే దూసుకుపోయాయి. వరుసగా రెండు రోజులు సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 640 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 524 పాయింట్లు లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 10,244 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు మూడు నెలల గరిష్టస్థాయికి చేరాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 951 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్లు చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.7 శాతం లాభపడ్డాయి.
712 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్.....
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత అరగంటకే నష్టాల్లోకి జారిపోయాయి. వెంటనే లాభాల్లోకి వచ్చాయి. ట్రేడింగ్ జరుగుతున్న కొద్దీ, లాభాలు పెరుగుతూ పోయాయి. ఒక దశలో 72 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 640 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా 712 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
లాభాల్లో ప్రపంచ మార్కెట్లు....
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు 2 శాతం,యూరప్ మార్కెట్లు కూడా 2 శాతం రేంజ్‌లో పెరిగాయి.
► దాదాపు 120కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ముత్తూట్ ఫైనాన్స్, రుచి సోయా, వైభవ్ గ్లోబల్, డిక్సన్ టెక్నాలజీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నిబంధనలను మార్చాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ తాజా ప్రతిపాదనల కారణంగా ఈ కంపెనీలకు నిధుల సమీకరణ మరింత సులభమవుతుంది. ఈ కారణంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 32 శాతం లాభంతో రూ.204కు చేరింది.
ఆల్‌టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్స్ రెండు నెలల్లో 1.15 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. రూ.53,000 కోట్ల మే రైట్స్ ఇష్యూను కూడా కలుపుకుంటే మొత్తం నిధులు రూ.1.69 లక్షల కోట్లకు చేరుతాయి. కాగా ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీ నికర రుణ భారం రూ.1.61 లక్షల కోట్లుగా ఉంది. కాగా ఎలాంటి నికర రుణ భారం లేని కంపెనీగా అవతరించామని శుక్రవారం రిలయన్స్ ప్రకటించింది.
దీంతో ఈ షేర్ 6 శాతం ఎగసి రూ.1,761 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,789æని తాకింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 524 పాయింట్ల లాభంలో ఈ ఒక్క షేర్ వాటాయే 306 పాయింట్లుగా ఉంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాక్షిక చెల్లించిన షేర్లు(ఆర్‌ఐఎల్–పీపీ) 10% అప్పర్ సర్క్యూట్‌తో రూ.813 వద్దకు చేరాయి.
మూడు నెలల్లో డబుల్..: రిలయన్స్ షేర్ 3 నెలల్లో రెట్టింపైంది. ఈ ఏడాది మార్చి 23న రూ.868 వద్ద ఉన్న ఈ షేర్ శుక్రవారం రూ.1,761కు చేరింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,89,746 లక్షల కోట్లు (15,000 కోట్ల డాలర్లు)కు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా రికార్డ్ సృష్టించింది.
రిలయన్స్ జోరుతో ర్యాలీ
Published Sat, Jun 20 2020 5:59 AM | Last Updated on Sat, Jun 20 2020 5:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment