త్వరలో భారీ ప్యాకేజీ! | Sensex ends 593 points higher and Nifty above 11,200 | Sakshi
Sakshi News home page

త్వరలో భారీ ప్యాకేజీ!

Published Tue, Sep 29 2020 5:34 AM | Last Updated on Tue, Sep 29 2020 5:34 AM

Sensex ends 593 points higher and Nifty above 11,200 - Sakshi

కేంద్రం  గత ప్యాకేజీకి మించి, భారీ ఉద్దీపన ప్యాకేజీని రూపొందిస్తోందన్న వార్తల జోష్‌తో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. డాలర్‌తో  రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 73.79కు చేరినా, కరోనా కేసులు పెరుగుతున్నా మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల  పెట్టుబడులు అందనున్నాయన్న వార్తలు, ప్రపంచ మార్కెట్లు లాభపడటం..... సానుకూల ప్రభావం చూపించాయి.   సెన్సెక్స్‌ 593  పాయింట్లు లాభపడి 37,982 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు ఎగసి 11,228 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి.  

రూ. 3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 2.81 లక్షల కోట్లు పెరిగి రూ. 155.10లక్షల కోట్లకు ఎగసింది.

చివర్లో మరింత జోరు...
ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్టు లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో కొనుగోళ్ళు మరింత జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38 వేల పాయింట్లపైకి ఎగబాకింది. ఆర్థిక, వాహన, ఫార్మా రంగ షేర్లు మంచి లాభాలు సాధించాయి.   

► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో మూడు షేర్లు–హిందుస్తాన్‌ యూనీలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే  ఇండియాలు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
► ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 8% లాభంతో రూ.40.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► షేర్‌ బైబ్యాక్‌ ఆఫర్‌ ముగియడంతో సన్‌ ఫార్మా షేర్‌ 5 శాతం లాభంతో రూ. 20.75 వద్ద ముగిసింది.  
► ఒక్కో షేర్‌ ఐదు షేర్లుగా నేడు(మంగళవారం)విభజన చెందనుండటంతో లారస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 10 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది.  
► పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల 1 నుంచి సినిమా హాళ్లు ప్రారంభం కానుండటంతో పీవీఆర్, ఐనాక్స్‌ విండ్‌ షేర్లు 6–10 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలకు ఎగిశాయి. ఇండి యామార్ట్‌ ఇంటర్‌మెష్, అపోలో హాస్పిటల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  
► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. డిష్‌ టీవీ, ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు, అదానీ గ్రీన్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► నేటి నుంచి మూడు ఐపీఓలు–మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్‌ఫ్రా ప్రారంభం  కానున్నాయి.  


చైనా పరిశ్రమల లాభాలు ఆగస్టులో పెరిగాయి. ఈ లాభాలు వరుసగా నాలుగో నెలలోనూ పెరగడం ఇన్వెస్టర్లలో జోష్‌ని నింపింది. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నేడు (మంగళవారం)తొలి డిబేట్‌ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. షాంఘై మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు 1–2 % రేంజ్‌లో లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 2–3% లాభాల్లో ముగిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement