ముంబై: ట్రేడింగ్‌లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం చివరికి లాభాలతోనే ముగిశాయి. ఇంట్రాడేలో 51 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 50,732 వద్ద స్థిరపడింది. అలాగే తొలిసారి 15000 స్థాయిని తాకిన నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 14,924 వద్ద నిలిచింది. సూచీలకిది అయిదో రోజు లాభాల ముగింపు. ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఐటీ, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. వరుస ర్యాలీతో జోష్ మీదున్న సూచీలు ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 51 వేల స్థాయిని, నిఫ్టీ 15 వేల మార్క్‌ను అందుకున్నాయి.
అనంతరం... ఊహించినట్లుగానే ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 508 పాయింట్ల రేంజ్‌లో 50,565 – 51,073 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 150 పాయింట్ల పరిధిలో 14,865 – 15,015 స్థాయిలో ట్రేడైంది. ఈ వారంలో సెన్సెక్స్ 4446 పాయింట్లు, నిఫ్టీ 1289 పాయింట్లను ఆర్జించాయి. గతేడాది ఏప్రిల్ 10తో ముగిసిన వారం తర్వాత సూచీలు అత్యధికంగా లాభపడిన వారం ఇదే. ‘‘మంచి వ్యాల్యూమ్స్ మద్దతుతో మార్కెట్ పటిష్టమైన స్థితిలో ముగిసింది. నిఫ్టీకి 15,000 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఇప్పటికీ బుల్లిష్ వైఖరినే కలిగి ఉన్నాము. త్వరలో నిఫ్టీ 15200 స్థాయికి చేరుకోవచ్చు. పతనమైన ప్రతిసారి కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేస్తే మంచింది.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ నిపుణుడు రుస్మిక్ ఓజా సలహానిస్తున్నారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► డిసెంబర్ క్వార్టర్‌లో ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని ఎస్‌బీఐ ప్రకటించడంతో ఈ బ్యాంకు షేరు 11% లాభంతో రూ.393 వద్ద ముగిసింది.
► ఫిబ్రవరి 11న జరిగే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్ ప్రకటనపై చర్చిస్తామని ఐటీసీ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ షేరు రెండు శాతం లాభపడింది.
► క్యూ3 లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేరు 20% లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment