ముంబై: జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం తమ పాత రికార్డుల్ని తిరగరాశాయి. మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లు రాణించడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 324 పాయింట్లు పెరిగి 52,642 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఈ ఏడాదిలో ఫిబ్రవరి 16న నమోదైన 52,517 ఆల్‌టైం హై స్థాయి కనుమరుగైంది.
చివరికి 174 పాయింట్ల లాభంతో 52,475 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు కూడా సూచీకి కొత్త ఆల్‌టైం హై కావడం విశేషం. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 96 పాయింట్లు ర్యాలీ చేసి 15,836 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. 62 పాయింట్ల్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపే రికార్డు స్థాయిలను అందుకున్న సూచీలు తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి లాభాల బాటపట్టాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.666 కోట్ల షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ 375 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకిది నాలుగో వారమూ లాభాల ముగింపు. యూఎస్ సూచీలు జీవితకాల గరిష్టస్థాయిని అందుకోవంతో సహా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు.
ఇన్వెస్టర్ల సంపద@రూ.213 లక్షల కోట్లు
సూచీల రికార్డులతో ఇన్వెస్టర్ల సంపద కూడా కొత్త గరిష్టానికి ఎగసింది. ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం గురు, శుక్రవారాల్లో రూ.3.26 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.
ఈ ఏడాదిలో సెన్సెక్స్ మైలురాళ్లు
ఈ 2021 ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ మొత్తం 4,723 పాయింట్ల(9.89%)ను ఆర్జించింది. ఇదే ఏడాదిలో మొత్తం 18 సార్లు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేసింది.
తేదీ సాధించిన ఘనత
జనవరి 21 తొలిసారి 50వేల స్థాయిని అందుకుంది.
ఫిబ్రవరి 3 తొలిసారి 50వేల పైన ముగిసింది
ఫిబ్రవరి 5 తొలిసారి 51వేల స్థాయిని అందుకుంది.
ఫిబ్రవరి 8 తొలిసారి 51 వేల స్థాయి పైన ముగిసింది
ఫిబ్రవరి 15 తొలిసారి 52 స్థాయిని అందుకుంది.
జూన్ 11 52,641 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు
జూన్ 11 52,474 వద్ద ఆల్‌టైం హై ముగింపు
Comments
Please login to add a commentAdd a comment