మ్యూచువల్ ఫండ్స్‌పై నిబంధనలను కఠినతరం చేస్తూ సెబీ నిర్ణయాలు తీసుకోవడం ప్రతికూల ప్రభావం చూపడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. జీ–20 సమావేశం నేపథ్యంలో అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా మార్కెట్ క్షీణతకు ఒక కారణమని నిపుణులు పేర్కొన్నారు. గత నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయన్న వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు తగ్గి 39,395 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్లు పతనమై 11,789 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, కమోడిటీ షేర్లు కూడా పతనమయ్యాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడటంతో నష్టాలు పరిమితమయ్యాయి. అయితే వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్‌చేసే లిక్విడ్ స్కీమ్స్.. తమ నిధుల్లో కనీసం 20 శాతం మేర నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి లిక్విడ్ అసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని సెబీ ఆదేశించింది.
అంతేకాకుండా షేర్ల తనఖాగా రుణాలిచ్చిన కంపెనీలతో తదనంతర చెల్లింపుల ఒప్పందాలు కుదుర్చుకోవడంపై నిషేధం విధించింది. మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్‌కంపెనీలపై మరింత నిఘా అవసరమంటూ ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక వెల్లడించింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరగడం... మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత తేరుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చింది. వెంటనే మళ్లీ నష్టాల బాట పట్టింది.
ఆల్‌టైమ్ హైకి ఎస్‌బీఐ
మొండి బకాయిల సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, 2020, మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి రుణాలు 9 శాతానికి తగ్గగలవన్న తాజా ఆర్‌బీఐ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 12 శాతం వరకూ పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.365ను తాకింది. చివరకు శాతం 0.3 శాతం నష్టంతో రూ.361 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఓబీలు 1–7 శాతం రేంజ్ లాభాలతో ముగిశాయి. ఎస్‌బీఐతో పాటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, గోద్రేజ్ ప్రొపర్టీస్, హావెల్స్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, ఒబెరాయ్ రియల్టీ, ట్రెంట్ తదితర షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. కాక్స్ అండ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ.36 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేసే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది.
ఒక దశలో 89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 224 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 313 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
Comments
Please login to add a commentAdd a comment