న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు మరోసారి సందడి చేయనున్నాయి. గత వారం నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ఈ వారం సైతం ఇదే సంఖ్యలో ఐపీవోలు వెలువడనున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 5,000 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. తాజా జాబితాలో ఆర్కియన్ కెమికల్స్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ చేరాయి. గత వారం వెలువడిన నాలుగు ఇష్యూలలో బికాజీ ఫుడ్స్ (22 రెట్లు అధిక స్పందన), గ్లోబల్ హెల్త్ (10 రెట్లు సబ్‌స్క్రిప్షన్) సోమవారం(7న) ముగిశాయి. ఈ బాటలో ఆర్కియన్, ఫైవ్‌స్టార్ ఇష్యూలు 9న, కేన్స్ టెక్ 10న, ఐనాక్స్ గ్రీన్ 11న ప్రారంభంకానున్నాయి. 2022లో ఇప్పటివరకూ 26 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 48,000 కోట్లను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.
ఆర్కియన్ కెమ్
స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ రూ. 386–407 ధరల శ్రేణిలో ఐపీవో చేపట్టనుంది. 11న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ జారీ చేసిన ఎన్‌సీడీల చెల్లింపునకు వినియోగించనుంది.
ఫైవ్ స్టార్ బిజినెస్
ఎన్‌బీఎఫ్‌సీ.. ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఐపీవోకు రూ. 450–474 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 1,960 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సీక్వోయా, కేకేఆర్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి.
కేన్స్ టెక్నాలజీ
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ ఆధారిత సమీకృత ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ కేన్స్ టెక్నాలజీ ఐపీవోకు రూ. 559–587 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 530 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 55.85 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది.
ఐనాక్స్ గ్రీన్
పవన విద్యుత్ దిగ్గజం ఐనాక్స్ విండ్ గ్రూప్ కంపెనీ ఐనాక్స్ గ్రీన్ ఐపీవోకు రూ. 61–65 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ నెల 15న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 370 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇంతే విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఐనాక్స్ విండ్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పోరేట్ అవసరాలకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment