సెన్సెక్స్ తొలిసారిగా 42,000 పాయింట్లపైకి ఎగబాకింది. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 42,059 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. పెరుగుతున్న బ్యాంక్‌ల మొండి బకాయిల భారం, ఆర్థిక గణాంకాలపై ఆందోళనతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు అర శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
247 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
అమెరికా– చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పం దం బుధవారం కుదిరింది. దీంతో గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమ్మకాలు జోరుగా జరగడంతో రెండు సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. చివర్లో నష్టాలు రికవరీ అయి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 60 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
► నెస్లే ఇండియా 3 శాతం లాభంతో రూ.15,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ క్యూ3లో ఆర్థిక ఫలితాలు బాగా ఉండగలవనే అంచనాలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.15,399ను తాకింది.
► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డాబర్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇప్కా ల్యాబ్స్, జేకే సిమెంట్స్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మణప్పురం ఫైనాన్స్, ఫీనిక్స్ మిల్స్, పాలీక్యాబ్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ ఏడాది సెన్సెక్స్ లాభం 9 శాతం !
ఈ ఏడాది సెన్సెక్స్ 9 శాతం మేర లాభపడగలదని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్‌పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 44,500 పాయింట్లకు ఎగబాకుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం అంతంతమాత్రంగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయని తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థ కాదని, అగ్రస్థాయి 50 కంపెనీలకు సంబంధించిందని ఈ సంస్థ ఇండియా హెడ్ అభిరామ్ ఈలేశ్వరపు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్‌కు రిస్క్ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది.
సూచీల ఇంట్రాడే శిఖర స్థాయిలు
సెన్సెక్స్ 42,059
నిఫ్టీ 12,389
36 సెషన్లలో 1,000 పాయింట్లు
సెన్సెక్స్ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.ఈ కాలంలో టాటా స్టీల్ 18 శాతం, ఇన్ఫోసిస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బాటా ఇండియా, పీటీసీ ఇండియా, డీసీబీ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ట్రైడెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, బెర్జర్ పెయింట్స్, ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు 10–100 శాతం రేంజ్‌లో పెరిగాయి. ఈ 36 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, బడ్జెట్‌లో మరిన్ని తాయిలాలు ఇవ్వనున్నదన్న అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులంటున్నారు.
42,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్
Published Fri, Jan 17 2020 5:07 AM | Last Updated on Fri, Jan 17 2020 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment