low profit
-
వెంటాడిన ‘ఒమిక్రాన్’ భయాలు!
ముంబై: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలున్నప్పటికీ.., స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1244 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 153 పాయింట్లు పెరిగి 57,261 వద్ద ముగిసింది. నిఫ్టీ 379 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 28 పాయింట్ల లాభంతో 17,054 వద్ద స్థిరపడింది. జియో మొబైల్ టారీఫ్‌ల పెంపుతో అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఒకటిన్నర శాతం లాభపడింది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 23 పైసల పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ షేర్లు రాణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ జరగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,332 కోట్ల షేర్లను అమ్మేశారు. గత 7 సెషన్లలో రూ.28 వేల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,611 కోట్ల షేర్లను కొన్నారు. కొత్త వేరియంట్ కట్టడికి పలు దేశాలు లాక్డౌన్ విధింపు, సరిహద్దుల మూసివేత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 1244 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 79 పాయింట్ల పతనంతో 57,028 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17,056 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారాంతంలో భారీ నష్టాల నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లోకి మళ్లాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా సూచీలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు పెరిగి 57,626 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 17,161 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు లాభాలన్నీ హరించుకుపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(57,626) నుంచి 1244 పాయింట్ల పాయింట్లు నష్టపోయి 56,383 వద్ద, నిఫ్టీ డే హై(17,161) నుంచి 379 పాయింట్లు క్షీణించి 16,782 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ‘‘కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై మరింత స్పష్టత వచ్చే వరకు మార్కెట్లో ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ఇన్వెస్టర్లు సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ, మౌలిక రంగ, వాహన విక్రయ, ద్రవ్యలోటు గణాంకాలపై దృష్టి సారించారు’’ రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్ర తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు మూడు శాతం పెరిగి రూ.2020 వద్ద స్థిరపడింది. ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ కోటక్ బ్యాంకులో తన వాటాను పది శాతానికి పెంచుకోవడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,044 స్థాయిని అందుకుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో నష్టాలను ప్రకటించడంతో పిన్‌టెక్ సంస్థ పేటీఎం షేరు మూడు శాతం నష్టపోయి రూ.1734 వద్ద ముగిసింది. ► ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో స్థానం కోల్పోవడంతో ఆదానీ పోర్ట్స్ రెండు శాతం క్షీణించి రూ.703 వద్ద నిలిచింది. ఐదు వారాల కనిష్టానికి రూపాయి 18 పైసల నష్టంతో 75.07కు డౌన్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 18 పైసలు నష్టపోయి 75.07కు పడిపోయింది. గడచిన ఐదు వారాల్లో భారత్ కరెన్సీ ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. కోవిడ్–19 కొత్త వేరియంట్ భయాలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 74.84 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 74.82 గరిష్ట–75.16 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి నష్టాల్లో ముగుస్తోంది. ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న భయాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 75.05 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96.40 వద్ద ట్రేడవుతోంది. -
42,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్
సెన్సెక్స్ తొలిసారిగా 42,000 పాయింట్లపైకి ఎగబాకింది. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 42,059 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. పెరుగుతున్న బ్యాంక్‌ల మొండి బకాయిల భారం, ఆర్థిక గణాంకాలపై ఆందోళనతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు అర శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. 247 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... అమెరికా– చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పం దం బుధవారం కుదిరింది. దీంతో గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమ్మకాలు జోరుగా జరగడంతో రెండు సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. చివర్లో నష్టాలు రికవరీ అయి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 60 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ► నెస్లే ఇండియా 3 శాతం లాభంతో రూ.15,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ క్యూ3లో ఆర్థిక ఫలితాలు బాగా ఉండగలవనే అంచనాలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.15,399ను తాకింది. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డాబర్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇప్కా ల్యాబ్స్, జేకే సిమెంట్స్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మణప్పురం ఫైనాన్స్, ఫీనిక్స్ మిల్స్, పాలీక్యాబ్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది సెన్సెక్స్ లాభం 9 శాతం ! ఈ ఏడాది సెన్సెక్స్ 9 శాతం మేర లాభపడగలదని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 44,500 పాయింట్లకు ఎగబాకుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం అంతంతమాత్రంగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయని తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థ కాదని, అగ్రస్థాయి 50 కంపెనీలకు సంబంధించిందని ఈ సంస్థ ఇండియా హెడ్ అభిరామ్ ఈలేశ్వరపు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్‌కు రిస్క్ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సూచీల ఇంట్రాడే శిఖర స్థాయిలు సెన్సెక్స్ 42,059 నిఫ్టీ 12,389 36 సెషన్లలో 1,000 పాయింట్లు సెన్సెక్స్ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.ఈ కాలంలో టాటా స్టీల్ 18 శాతం, ఇన్ఫోసిస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, భారతీ ఎయిర్టెల్ 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బాటా ఇండియా, పీటీసీ ఇండియా, డీసీబీ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ట్రైడెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, బెర్జర్ పెయింట్స్, ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు 10–100 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ 36 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, బడ్జెట్లో మరిన్ని తాయిలాలు ఇవ్వనున్నదన్న అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులంటున్నారు. -
రోజంతా ఒడిదుడుకులే..
♦ నేడు డెరివేటివ్‌ల ముగింపు ♦ జాగ్రత్తగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు ♦ 6 పాయింట్ల లాభంతో 24,492కు సెన్సెక్స్ ♦ 2 పాయింట్ల లాభంతో 7,438కు నిఫ్టీ రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. నేడు (గురువారం) జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం వెలువడనుండడం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 6 పాయింట్లు లాభపడి 24,492 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 7,438 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరల ర్యాలీ కారణంగా మంగళవారం అమెరికా మార్కెట్ లాభపడడంతో బుధవారం చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం 29 నెలల కనిష్టానికి పడిపోవడం, ఫెడ్ వడ్డీరేట్ల నిర్ణయం, ముడి చమురు ధరలు పతనం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురికావడం, జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేయడంతో లాభాలు తగ్గాయి.