రోజంతా ఒడిదుడుకులే..
♦ నేడు డెరివేటివ్‌ల ముగింపు
♦ జాగ్రత్తగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
♦ 6 పాయింట్ల లాభంతో 24,492కు సెన్సెక్స్
♦ 2 పాయింట్ల లాభంతో 7,438కు నిఫ్టీ
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. నేడు (గురువారం) జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం వెలువడనుండడం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 6 పాయింట్లు లాభపడి 24,492 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 7,438 పాయింట్ల వద్ద ముగిశాయి.
ముడి చమురు ధరల ర్యాలీ కారణంగా మంగళవారం అమెరికా మార్కెట్ లాభపడడంతో బుధవారం చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం 29 నెలల కనిష్టానికి పడిపోవడం, ఫెడ్ వడ్డీరేట్ల నిర్ణయం, ముడి చమురు ధరలు పతనం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురికావడం, జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేయడంతో లాభాలు తగ్గాయి.