ముంబై: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలున్నప్పటికీ.., స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1244 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 153 పాయింట్లు పెరిగి 57,261 వద్ద ముగిసింది. నిఫ్టీ 379 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 28 పాయింట్ల లాభంతో 17,054 వద్ద స్థిరపడింది. జియో మొబైల్ టారీఫ్‌ల పెంపుతో అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఒకటిన్నర శాతం లాభపడింది.
ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 23 పైసల పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ షేర్లు రాణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ జరగడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,332 కోట్ల షేర్లను అమ్మేశారు. గత 7 సెషన్లలో రూ.28 వేల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,611 కోట్ల షేర్లను కొన్నారు. కొత్త వేరియంట్ కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధింపు, సరిహద్దుల మూసివేత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి.
1244 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్...
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 79 పాయింట్ల పతనంతో 57,028 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17,056 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారాంతంలో భారీ నష్టాల నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లోకి మళ్లాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా సూచీలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు పెరిగి 57,626 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 17,161 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు లాభాలన్నీ హరించుకుపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(57,626) నుంచి 1244 పాయింట్ల పాయింట్లు నష్టపోయి 56,383 వద్ద, నిఫ్టీ డే హై(17,161) నుంచి 379 పాయింట్లు క్షీణించి 16,782 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
‘‘కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై మరింత స్పష్టత వచ్చే వరకు మార్కెట్‌లో ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ఇన్వెస్టర్లు సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ, మౌలిక రంగ, వాహన విక్రయ, ద్రవ్యలోటు గణాంకాలపై దృష్టి సారించారు’’ రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్ర తెలిపారు.
మార్కెట్లో మరిన్ని విశేషాలు
► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు మూడు శాతం పెరిగి రూ.2020 వద్ద స్థిరపడింది. ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్‌ఐసీ కోటక్ బ్యాంకులో తన వాటాను పది శాతానికి పెంచుకోవడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,044 స్థాయిని అందుకుంది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో నష్టాలను ప్రకటించడంతో పిన్‌టెక్ సంస్థ పేటీఎం షేరు మూడు శాతం నష్టపోయి రూ.1734 వద్ద ముగిసింది.
► ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో స్థానం కోల్పోవడంతో ఆదానీ పోర్ట్స్ రెండు శాతం క్షీణించి రూ.703 వద్ద నిలిచింది.
ఐదు వారాల కనిష్టానికి రూపాయి
18 పైసల నష్టంతో 75.07కు డౌన్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 18 పైసలు నష్టపోయి 75.07కు పడిపోయింది. గడచిన ఐదు వారాల్లో భారత్ కరెన్సీ ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. కోవిడ్–19 కొత్త వేరియంట్ భయాలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 74.84 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 74.82 గరిష్ట–75.16 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి నష్టాల్లో ముగుస్తోంది. ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న భయాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి విలువ నష్టాల్లో 75.05 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96.40 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment