Multi Commodity Exchange
-
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్‌తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
బంగారం ధర మళ్లీ పెరిగింది.. ఈ రోజు ఎంతంటే?
దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధరలు మాత్రం హెచ్చు తగ్గులు కనిపించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరింది ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది చెన్నైలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఫిబ్రవరి 28న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070.. ఇవ్వాళ సైతం అదే ధర కొనసాగుతుంది. కోల్‌కతాలో అదే 10 గ్రాముల బంగారం రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.56,170 నుంచి రూ.56,340కి చేరింది హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేజీల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 66,800లతో స్థిరంగా ఉంది. ముంబైలో సైతం వెండి ధరల్లో మర్పు చోటు చేసుకోలేదు. అక్కడ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.66,800గా ఉంది చెన్నైల్లో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి చేరింది కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ.66,800తో స్థిరంగా ఉంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి పెరిగింది. అహ్మదాబాద్‌లో సైతం స్థిరంగా రూ.66,800తో కొనసాగుతుంది. హైదరాబాద్‌లో రూ.69000 గా ఉన్న వెండి ధర రూ.69,200కి చేరింది. -
బంగారం ప్రియులకు భారీ శుభవార్త!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర రూ.400కి పైగా తగ్గింది. వచ్చే ఏడాది నాటికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించినట్లు పేర్కొన్న తర్వాత భారతదేశంలో బంగారం ధర భారీగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర సెప్టెంబర్ 23న 0.62 శాతం క్షీణించి రూ.46,383కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేటు పెంపును ప్రకటించడంతో బంగారం ధర పడిపోయింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!) ఇండియన్ బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.400లు తగ్గడంతో రూ.46,468కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.42,934 నుంచి రూ.42,565కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.600లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.60,362కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,954లుగా ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.47,840ల నుంచి రూ.47,560కు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి. -
బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్‌లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు. ఇదీ తీరు 2011లో రోజువారీగా ఎంసీఎక్స్‌లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్‌లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్ నమోదైంది. చమురు డీలా ఎంసీఎక్స్‌లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్‌లో రోజువారీ సగటు టర్నోవర్ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్‌అండ్‌వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌కు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), ఈటీఎఫ్‌లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం! చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! స్టాక్ ఎక్ఛేంజీల స్పీడ్ దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7.8 కోట్ల మంది, ఎన్ఎస్ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పోటీయేలేని ఎంసీఎక్స్ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్ షేరు మాత్రం 2013 ఆగస్ట్‌లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్‌కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఎంసీఎక్స్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ వాటా 15శాతం.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం కోటక్ గ్రూప్ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరుకి మరింత బూస్ట్ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్‌గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
పెరిగిన గోల్డ్ .. తగ్గిన వెండి ధరలు
ముంబై : మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఆగస్ట్ ఫీచర్‌కి బంగారం ధర రూ. 72 పెరిగింది. అంతకు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ, 47,684 దగ్గర ట్రేడవగా ఈ రోజు రూ. 72 పెరిగి రూ. 47, 756 దగ్గర నమోదు అవుతోంది. మరోవైపు వెండికి సంబంధించి సెప్టెంబరు ఫీచరు కిలో వెండి ధర రూ. 69,512 నుంచి 69,541కి పెరిగింది. జులై 6న కిలో ఒక దశలో వెండి రికార్డు స్థాయిలో రూ.70,309 రూపాయలు పలికింది. నిన్నటితో పోల్చితే వెండి ధర తగ్గింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. జులై 7న గోల్డ్ ఫ్యూచర్స్ 7.45 డాలర్లు పెరిగి 1,801.65 డాలర్ల వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్కి సంబంధించి 0.108 డాలర్లు పెరిగి 26.282 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
వడ్డీరేట్లు ఇప్పుడే పెంచబోమంటూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన కాసేపటికే ఫ్యూచర్స్ బంగారం ధర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో ఆగష్టు ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ప్రారంభంలో 47011 నుంచి 47,091కి చేరుకుంది. వెండికి సంబంధించి జులై ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 67,515 నుంచి 67,819కి చేరుకుంది. పెరిగిన కొనుగోళ్లు ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. మిగిలిన దేశాలతో పోల్చితే బంగారం మార్కెట్ ఇండియాలో మెరుగ్గానే ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,312గా నమోదు అవగా కిలో వెండి 68,198గా ఉంది. చదవండి : జెట్.. సెట్.. టేకాఫ్! దివాలా విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు -
దిగొస్తున్న బంగారం ధర
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా దిగివస్తోంది. కరోనా వ్యాక్సిన్ వార్తలు, ఈక్విటీ మార్కెట్ల ఆకర్షణ నేపథ్యంలో బంగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ వార్త రాసే సమయం రాత్రి 10.15 గంటలకు న్యూయార్క్ ఫ్యూచర్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గత శుక్రవారం (20వ తేదీ) ధరతో పోల్చిచూస్తే, 40 డాలర్లు పడిపోయి, 1,834 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,828 డాలర్లను కూడా చూసింది. అమెరికా తయరీ, సేవల రంగాల సూచీలు రెండు అంచనాలకు మించి ‘58’కి పెరగడం దీనికి తక్షణ నేపథ్యం. నైమెక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా 2,089 డాలర్లు, 1,459 డాలర్లు. కాగా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్‌లోనూ పసిడి ధర ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ధర 10 గ్రాములకు రూ.792 నష్టంతో రూ.49,420 వద్ద ట్రేడవుతోంది. అయితే భారత్‌లో ధర కదలిక డాలర్ మారకంలో రూపాయి విలువ కదలికలపైనా ఆధారపడి ఉంటుంది. రూపాయి భారీగా క్షీణిస్తే, అంతర్జాతీయంగా ధర తగ్గిన ప్రభావం దేశంలో కనబడదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.11 వద్ద ముగిసింది. -
పసిడి.. జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్! ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం. ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే. హాల్‌మార్కింగ్ గడువు పెంపు ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. -
గోల్డెన్ జూబ్లీ..!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం, వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన చర్యలు, కరెన్సీ మారక విలువలు పడిపోవడం తదితర అంశాల ఊతంతో పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధోరణులను ప్రతిబింబిస్తూ దేశీయంగా తొలిసారిగా రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛ్‌ంజీ (ఎంసీఎక్స్)లో బుధవారం రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది. అటు న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరుగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్టు (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. కరెన్సీల క్షీణత కూడా కారణం.. సాధారణంగా ఎకానమీ, స్టాక్ మార్కెట్ల పరిస్థితులు బాగా లేనప్పుడు సురక్షిత సాధనంగా పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం రేట్ల జోరుకు ఇదొక్కటే కారణం కాదని షేర్‌ఖాన్ కమోడిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. యూరప్, అమెరికాలో ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా కీలక కరెన్సీలు క్షీణిస్తుండటం వల్లే బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయని వివరించారు. మంగళవారమే యూరోపియన్ యూనియన్ నేతలు తమ తమ దేశాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు 750 బిలియన్ యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ‘అమెరికా ఇప్పటికే ఒక విడత ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. మరో విడత కూడా ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు‘ అని సింగ్ చెప్పారు. మరోవైపు, గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం కూడా పసిడి రేట్లకు ఊతమిస్తోందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం హెడ్ సునీల్‌కుమార్ కట్కే పేర్కొన్నారు. 2020 ప్రథమార్ధంలో అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏకంగా 39.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు నికరంగా వచ్చినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 పూర్తి సంవత్సరంలో నమోదైన 23 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వెండి కూడా రయ్... పసిడి బాటలోనే వెండి ధర కూడా గణనీయంగా పెరుగుతోంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరింది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలతో గత కొద్ది నెలల్లో వెండి రేటు గణనీయంగా పెరుగుతోందని కట్కే చెప్పారు. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే ఉంటోంది. ఇతర బేస్ మెటల్స్ రేట్లు పెరగడం కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా వెండి మైనింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఒకవేళ చాలా చోట్ల మళ్లీ ఉత్పత్తి మొదలైనా .. ఈ ఏడాది మొత్తం మీద చూస్తే ఉత్పత్తి 7 శాతం తగ్గొచ్చని ది సిల్వర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేస్తోంది. మరో 10 శాతం పెరిగే చాన్స్ భారీగా ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరల్లో కొంత కరెక్షన్ రావొచ్చని.. అయినప్పటికీ వచ్చే ఏడాది జూన్ నాటికి పుత్తడి ధర మరో 10 శాతం పెరగవచ్చని షేర్‌ఖాన్ అంచనా వేస్తున్నట్లు సింగ్ తెలిపారు. అలాగే, వెండి రేటు కూడా కేజీకి రూ. 73,000–74,000 స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల పాటు పసిడి, వెండి రేట్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులే ఉండొచ్చని కట్కే చెప్పారు. ‘ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా లేక ద్రవ్యోల్బణం భారీగా పెరిగి దాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తే బంగారం, వెండి రేట్లలో కొంత కరెక్షన్ ఉండొచ్చు. అయితే, అది ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే పసిడి, వెండి రేట్లు పెరిగేందుకు కారణాలు బలంగా ఉన్నాయి‘ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పసిడి రేటును మించి వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని కట్కే పేర్కొన్నారు. -
బ్యారల్‌కు రూ. 2,884 వద్ద సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ఏప్రిల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) బేరల్‌కు మైనస్ రూ.2,884 వద్ద సెటిల్‌చేసింది. దీని ప్రకారం, క్లియరింగ్ మెంబర్స్‌కు రూ.242.32 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్–న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ (నైమెక్స్) డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ ధరను అనుసరించి, భారత రూపాయిల్లో ఎంసీఎక్స్ ‘పే ఇన్ అండ్ పే అవుట్’ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ వివరించింది. సోమవారం క్రూడ్ ధర అనూహ్యంగా మైనస్ 40.32కు పతనమై చివరకు మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20తో ముగిసే కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ సెటిల్మెంట్ ధరపై వివాదం నెలకొంది. ఇక యథాతథంగా ట్రేడింగ్ సమయం వ్యవసాయేతర ఉత్పత్తుల ట్రేడింగ్ వేళలను ఏప్రిల్ 23 నుంచీ పొడిగిస్తున్నట్లు ఎంసీఎక్స్ ప్రకటించింది. 23వ తేదీ నుంచీ ట్రేడింగ్ సమయం యథాపూర్వం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ కొనసాగుతుంది. -
వరుసగా మూడో వారమూ పసిడి పరుగు
కొనసాగిన డాలర్ బలహీనత అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారం జరిగిన తన పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్ ఫండ్ రేటును పెంచకపోవడంతో (ప్రస్తుతం 1–1.25 శాతం) పసిడిలోకి ఇన్వెస్టర్ల పెట్టుబడులు వరుసగా మూడవ వారమూ కొనసాగాయి. అమెరికాలో వృద్ధి వేగం ఊహించినంతగా లేదన్నది దీనికి నేపథ్యం. 28వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1 గ్రా.) ధర 14 డాలర్లు ఎగసి, 1,269 డాలర్లకు చేరింది. గడచిన మూడు వారాల్లో ఇక్కడ పసిడి దాదాపు 64 డాలర్లు పెరిగింది. ఇదే వారంలో డాలర్ ఇండెక్స్ తన పతనాన్ని కొనసాగిస్తూ, మరో 0.60 పాయిం ట్లు తగ్గి 93.20కి చేరింది. డాలర్ బలోపేతం కావటం, ఫెడ్ రేటు పెంచుతుందన్న అంచనాలతో మూడు వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ (31.1 గ్రా.) ధర... అమెరికాలోని తాజా రాజకీయ, ఆర్థిక ప్రతికూల వార్తలతో తిరిగి భారీగా పైకి లేచింది. ఈ వారంలో ఒకదశలో కీలక మద్దతు 1,240ని తాకిన పసిడి, అటు తర్వాత ఒక దశలో 1,272ను సైతం తాకింది. దేశంలో పరుగుకు రూపాయి బ్రేకులు... అంతర్జాతీయంగా పసిడి దూకుడు ప్రదర్శించినప్పటికీ, ఆ స్థాయిలో దేశంలో బంగారం పెరగలేదు. డాలర్ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 30 పైసలు బలపడి 64.13కు చేరింది. దీనితో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో కేవలం రూ.41 పెరిగి రూ.28,580కి చేరింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.95 ఎగసి రూ.28,590కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,440కు ఎగసింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.170 ఎగసి రూ.37,975కు చేరింది. -
పసిడి... లాభాల స్వీకరణ!
వారంలో 16 డాలర్లు డౌన్ 1,240 డాలర్ల వద్ద కీలక మద్దతు న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో శుక్రవారం 30వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) ధర 16 డాలర్లు తగ్గి 1,242 డాలర్ల వద్దకు చేరింది. అంతక్రితం వారం (23వ తేదీతో ముగిసిన) 1,240 డాలర్ల వద్ద రెండు సార్లు కీలక మద్దతు తీసుకుని పైకి ఎగసిన పసిడి, తాజాగా ముగిసిన సమీక్షా వారంలో కూడా ఈ స్థాయిని మూడు సార్లు తాకింది. దీంతో ఈ ధర వద్ద పసిడి కన్సాలిడేషన్ జరుగుతోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నుంచి పసిడి మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని కూడా వారు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయి నుంచి కిందకు జారి, ఒక ట్రేడింగ్ సెషన్లో ఆలోపు ముగిస్తే, తిరిగి ఇక పసిడి తక్షణ మద్దతు స్థాయి 1,211 అని కూడా వారి విశ్లేషణలు చెబు తున్నాయి. పసిడి తిరిగి ముందుకు దూకుతుందనడానికి గత వారంలో డాలర్ ఇండెక్స్ 1.50 డాలర్లు పడిపోయి 95.39 డాలర్లకు చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డాలర్ బలహీనత పసిడికి బలంగా మారుతుందని ఇప్పటివరకూ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశీయంగానూ కిందికే... మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ధోరణిని కొనసాగించింది. ధర రూ. 305 పడిపోయి, రూ.28,734 నుంచి 28,439కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.140 తగ్గి, రూ.28,770కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.28,620కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర మాత్రం వారం వారీగా స్వల్పంగా పెరిగి రూ.39,080కి చేరింది. -
బంగారం మెరుపు పదిలం!
♦ డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు పడిన నేపథ్యం ♦ దేశంలోనూ ఇదే దూకుడు ♦ రెండు వారాల్లో రూ.500 అప్ న్యూయార్క్/ముంబై: అటు అంతర్జాతీయ మార్కెట్లో అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి దూకుడు కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పతనం కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే 24వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు అంటే 99.59 స్థాయికి చేరింది. వారం వారీగా చూస్తే 101 డాలర్ల నుంచి ఈ స్థాయికి డాలర్ ఇండెక్స్ దిగివచ్చింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) వారం వారీగా 14 డాలర్లు పెరిగి 1,243 డాలర్లకు చేరింది. ఈ నెల 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్ బలహీనత– బంగారం బలోపేతం జరుగుతున్న విషయం తెలిసిందే. 17వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దాదాపు 25 డాలర్లు పెరిగింది. డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా... అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 24వ తేదీతో ముగిసిన వారంలో రూ.284 పెరిగి రూ.28,793కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.255 పెరిగి రూ.28,895కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,745కి ఎగసింది. రెండు వారాల్లో ధర దాదాపు రూ.500 పెరిగింది. వెండి కేజీ ధర రూ. 335 పెరిగి రూ.41,660కు పెరిగింది. రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగసింది. -
డాలర్ వీక్... ఎగసిన పసిడి
►వారంలో అంతర్జాతీయంగా 25 డాలర్లు అప్ ►ఫెడ్ రేట్ పెంపుతో అనూహ్యంగా పతనమైన డాలర్ న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో వరుసగా రెండు వారాల్లో 53 డాలర్లు తగ్గిన బంగారం ఔన్స్ (31.1 గ్రా) ధర, మార్చి 17వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 25 డాలర్లు పెరిగింది. నిజానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గనక ఫండ్ రేటు పెంచితే డాలర్ బలపడుతుందని, ఇది పసిడి ధర తగ్గడానికి దారితీస్తుందని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ నెల 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం పెంచటంతో నిమిషాల్లో డాలర్ ఇండెక్స్ 101 స్థాయికి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా బంగారానికి బలమొచ్చింది. అప్పటి వరకూ 1,200 డాలర్లకు ఐదు డాలర్లు అటుఇటుగా తిరిగిన పసిడి, భారీ జంప్‌తో రెండు రోజుల్లో 1,229 డాలర్ల స్థాయికి చేరింది. డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచి వస్తే, ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా పెరిగినా... రూపాయి బలోపేతంతో బ్రేక్ అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 17వ తేదీతో ముగిసిన వారంలో రూ.143 పెరిగి రూ.28,509కి చేరింది. అంతక్రితం రెండు వారాల్లో పసిడి రూ.1,277 తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.90 పెరిగి రూ.28,640కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,490కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 260 పెరిగి రూ.41,325కు పెరిగింది. రూపాయి భారీగా బలపడ్డం (డాలర్ మారకంలో రూ.65.50 దిగువకు)దేశీయంగా పసిడి పరుగుకు (అంతర్జాతీయ ధర స్పీడ్‌తో పోల్చితే) బ్రేక్ పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా అంతక్రితం రెండు వారాల్లో (మార్చి 3, 10 తేదీలతో ముగిసిన వారాలు) స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాములకు దాదాపు రూ.1,000 తగ్గగా, వెండి దాదాపు రూ.2,000కుపైగా నష్టపోయింది. -
తొమ్మిది నెలల కనిష్టానికి బంగారం ధర!
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు కొద్దికాలంగా నష్టాల బాట పట్టాయి. బులియన్ మార్కెట్ లో బంగారం ఔన్స్ కు 1200 డాలర్లకు పడిపోయింది. ద్రవ్య మార్కెట్ లో డాలర్ విలువ బలంగా ఉండటం, చైనా కొనుగోలుదారుల నుంచి మద్దతు కరువు కావడంతో బంగారం ధర పతనానికి కారణానికి వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి మార్కెట్ మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర 1.08 శాతం నష్టంతో 293 రూపాయలు క్షీణించి 26836 వద్ద ట్రేడ్ అవుతోంది. డిసెంబర్ కాంట్రాక్టులో 26818 రూపాయలు నమోదైంది. -
వాటా తగ్గించుకోండి
న్యూఢిల్లీ: ప్రమోటర్లుగా తమ వాటాను నెల రోజుల్లోగా 2% లోపునకు తగ్గించుకోమంటూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)ను మల్టీ కమోడి టీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) బోర్డు కోరింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీ ఆదేశాల మేరకు ఎంసీఎక్స్ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్) సంక్షోభం నేపథ్యంలో ఎక్స్ఛేంజీల నిర్వహణకు ఎఫ్టీఐఎల్తోపాటు, సంస్థ చీఫ్ జిగ్నేష్ షాను గత వారం ఎఫ్ఎంసీ అనర్హులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఎఫ్‌టీఐఎల్‌కు 26% వాటా ఉంది. బోర్డులకు మార్గదర్శకాలు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ ఎక్స్ఛేంజీలకు సంబంధించి కార్పొరేట్ పాలన(గవర్నెన్స్) నిబంధనలను ఎఫ్ఎంసీ కఠినతరం చేసింది. దీనిలో భాగంగా అన్ని రకాల ప్రధాన వ్యాపార నిర్ణయాలను తగిన స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఎక్స్ఛేంజీల బోర్డులను ఆదేశించింది. ఈ బాటలో సీఈవోల ఆర్థికపరమైన అధికారాలపై కన్నేయడంతోపాటు, ప్రమోటర్లు, యాజమాన్య సంబంధిత వ్యక్తుల లావాదేవీలపై సైతం తగిన పరిశీలన చేపట్టాల్సిందిగా సూచించింది. ఇవికాకుండా డొనేషన్లు, పబ్లిసిటీ, మీడియా, లీగల్ తదితర చార్జీల వంటి అంశాలలో తగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా సలహా ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్సహా ఆరు జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలకు మార్గదర్శకాలను జారీ చేసింది.