స్టాక్ బ్రోకర్
న్యూఢిల్లీ: ప్రమోటర్లుగా తమ వాటాను నెల రోజుల్లోగా 2% లోపునకు తగ్గించుకోమంటూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్)ను మల్టీ కమోడి టీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) బోర్డు కోరింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎంసీ ఆదేశాల మేరకు ఎంసీఎక్స్ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్) సంక్షోభం నేపథ్యంలో ఎక్స్ఛేంజీల నిర్వహణకు ఎఫ్‌టీఐఎల్‌తోపాటు, సంస్థ చీఫ్ జిగ్నేష్ షాను గత వారం ఎఫ్‌ఎంసీ అనర్హులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఎఫ్‌టీఐఎల్‌కు 26% వాటా ఉంది.
బోర్డులకు మార్గదర్శకాలు
ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ ఎక్స్ఛేంజీలకు సంబంధించి కార్పొరేట్ పాలన(గవర్నెన్స్) నిబంధనలను ఎఫ్‌ఎంసీ కఠినతరం చేసింది. దీనిలో భాగంగా అన్ని రకాల ప్రధాన వ్యాపార నిర్ణయాలను తగిన స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఎక్స్ఛేంజీల బోర్డులను ఆదేశించింది. ఈ బాటలో సీఈవోల ఆర్థికపరమైన అధికారాలపై కన్నేయడంతోపాటు, ప్రమోటర్లు, యాజమాన్య సంబంధిత వ్యక్తుల లావాదేవీలపై సైతం తగిన పరిశీలన చేపట్టాల్సిందిగా సూచించింది. ఇవికాకుండా డొనేషన్లు, పబ్లిసిటీ, మీడియా, లీగల్ తదితర చార్జీల వంటి అంశాలలో తగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా సలహా ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్‌సహా ఆరు జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలకు మార్గదర్శకాలను జారీ చేసింది.