National Spot Exchange
-
వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: ప్రస్తుతం మూతబడిన నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్కి సంబంధించిన అక్రమ ’పెయిర్డ్ కాంట్రాక్టుల్లో’ ట్రేడింగ్ చేసే సదుపాయం కల్పించడం ద్వారా ఇన్వెస్టర్లను వే2వెల్త్ రిస్కులోకి నెట్టిందని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. నియంత్రణ సంస్థ అనుమతి లేని పెయిర్డ్ కాంట్రాక్టుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించడంలో కంపెనీ విఫలమైందని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీల మార్కెట్లో బ్రోకింగ్ సంస్థగా కొనసాగే అర్హత కోల్పోయిందని తెలిపింది. 15 రోజుల్లోగా క్లయింట్లు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు లేదా సెక్యూరిటీస్, డబ్బును బదిలీ చేసుకునేందుకు వే2వెల్త్ కమోడిటీస్ వీలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఒకవేళ క్లయింట్లు డబ్బు, సెక్యూరిటీలను విత్‌డ్రా చేసుకోవడంలో విఫలమైతే వాటిని తదుపరి 15 రోజుల్లోగా మరో బ్రోకింగ్ సంస్థకు బదలాయించాలని సూచించింది. 2009లో ఎన్ఎస్ఈఎల్ ప్రవేశపెట్టిన పెయిర్డ్ కాంట్రాక్టుల స్కీముతో ఇన్వెస్టర్లకు ఏకంగా రూ. 5,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 2022 నవంబర్‌లో కొత్త క్లయింట్లను తీసుకోకుండా అయిదు బ్రోకరేజీలపై సెబీ ఆరు నెలల నిషేధం విధించింది. -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో ముగ్గురు అరెస్టు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణానికి సంబంధించి ముగ్గురిని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేశారు. ఆనంద్ రాఠీ కమోడిటీస్ ఎండీ అమిత్ రాఠీ, ఇండియా ఇన్ఫోలైన్ కమోడిటీస్ వీపీ చింతన్ మోదీ, జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్ టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ సంస్థలకు చెందిన ఇతర ఉద్యోగులను కూడా ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణం 2013 జూలైలో వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ సమయం ముగిసిపోయిన తర్వాత ఏకంగా 3,00,000 సార్లు క్లయింట్ కోడ్లను దుర్వినియోగం చేసి పలు బ్రోకింగ్ సంస్థలు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా అవి మనీలాండరింగ్‌కి పాల్పడ్డాయని అభియోగాలున్నాయి. కేసు నేపథ్యంలో ఎన్ఎస్ఈఎల్ ప్రమోటరు జిగ్నేష్ షా సహా పలువురు ఉద్యోగులు అరెస్టరయ్యారు. జిగ్నేష్ షా ఆ తరవాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ నిల్చిపోయింది. దీన్ని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో విలీనం చేయాలంటూ సెబీ ఆదేశించింది. -
కేంద్రం ‘స్పాట్’!
రూ. 5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌పై.. * ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో ఎన్ఎస్ఈఎల్ విలీనం * కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశం... * ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమేనని వెల్లడి * ఎన్ఎస్ఈఎల్ చెల్లింపులు, అప్పులనూ ఎఫ్టీఐఎల్ భరించాల్సిందేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని మాతృసంస్థ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) గ్రూప్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను విలీనం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్‌లో చిక్కుకొని నష్టపోయిన ఇన్వెస్టర్లు, బ్రోకర్ల సొమ్మును తిరిగి ఇప్పించడం, వాళ్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. కాగా, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. దీనిపై తమ న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. ఇక బాధ్యతంతా ఎఫ్టీఐఎల్దే... ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన చెలింపులతో పాటు ఆ కంపెనీ రుణాలన్నింటికీ ఎఫ్టీఐఎల్ బాధ్యత వహించాల్సిందేనని ఆదేశాల్లో కేంద్రం తేల్చిచెప్పింది. ఎస్ఎస్ఈఎల్ మొత్తం వ్యాపారం, ఆస్తులు ఇతరత్రా అన్నీకూడా ఎఫ్‌టీఐఎల్‌కు బదిలీఅవుతాయి. ప్రజా ప్రయోజనాల రీత్యాప్రైవేటు రంగ కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న కంపెనీల చట్టంలోని సెక్షన్ 396(నిబంధన-క్లాజ్)ను ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ప్రయోగించింది. ఈ క్లాజ్‌ను చాలా అరుదుగా మాత్రమే ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. కాగా, 2009లో సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణం తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు కంపెనీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దాదాపు ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అయితే, సత్యం కేసు లో ఆ కంపెనీని థర్డ్‌పార్టీ(టెక్ మహీంద్రా)కి వేలం ద్వారా విక్రయిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్నీ పరిశీలించాకే... ఏడాది కాలంగా పెండింగ్‌లోఉన్న బకాయిల రికవరీ, చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ చేతులెత్తేసిందని.. దీంతో తగిన వనరులున్న ఎఫ్‌టీఐఎల్‌లో విలీనం చేయడంద్వారా చెల్లింపులను వేగంగా రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 2013 నాటికి ఎన్ఎస్ఈఎల్ నెట్‌వర్త్ రూ.175.76 కోట్లుగా అంచనా. విలీనానికి సంబంధించి విధివిధానాలన్నీ పాటిస్తామని.. ఇరు కంపెనీల వాటాదారులు, రుణదాతలు తమ అభ్యంతరాలు/సూచనలను 60 రోజుల్లోగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ముఖ్యంగా కంపెనీల చట్టం-1956లోని పలు నిబంధనలను ఇరు కంపెనీలూ ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని.. అంతేకాకుండా ఎఫ్టైఎల్, దాని కీలక యాజమాన్య వ్యక్తుల నియంత్రణలో ఎన్ఎస్ఈఎల్ నడిచిందన్న విషయం కూడా వెలుగుచూసినట్లు కార్పొరేట్ వ్యవహరాల శాఖ ముసాయిదా ఆదేశాల్లో తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఏవైనా కేసులు నమోదుకావాలన్నా, లేదంటే ఎలాంటి చట్టపరమైన చర్యలైనా ఎఫ్టీఐఎల్పైనే ఫైల్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల ఆనందం... ఇదిలాఉండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫోరం(ఎన్ఐఎఫ్) స్వాగతించింది. చెల్లిం పులు నిలిచిపోయిన 13,000 మంది ఇన్వెస్టర్లు కలసి ఈ ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఎన్ఐఎఫ్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షేరు క్రాష్: ప్రభుత్వ విలీన ఆదేశాల వార్తలతో ఎఫ్టీఐఎల్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 20 శాతం కుప్పకూలి లోయర్ సర్కూట్‌ను తాకింది. రూ.169.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.200 కోట్ల మేర ఆవిరైంది. రూ.781.72 కోట్లకు దిగజారింది. -
యాజవూన్యానిదే తప్పు
ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ నివేదిక ఎఫ్టీఐఎల్ బోర్డుకూ భాగస్వామ్యం న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) వ్యవహారంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ తుది నివేదికను సిద్ధం చేసింది. ఎన్ఎస్ఈఎల్ యాజమాన్యం కొన్ని అంశాలలో కంపెనీల చట్టాన్ని అతిక్రమించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను ఇప్పటికే న్యాయ శాఖ, ఆర్థిక శాఖలతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో జరిగిన కొన్ని రకాల అవకతవకలకు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు(ఎఫ్టీఐఎల్) సైతం బాధ్యురాలైనట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈఎల్లో ఎఫ్‌టీఐఎల్‌కు 99.99% వాటా ఉంది. పలు అవకతవకలు 2013 నవంబర్‌లో కంపెనీల రిజిస్ట్రార్(ఆర్వోసీ) ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్లుగానే ఈ రెండు సంస్థల బోర్డు స్థాయిల్లో అవకతవకలు జరిగినట్లు తాజా నివేదిక సైతం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్‌ను అనుమతించడంపై డెరైక్టర్లు ఎన్నడూ చర్చించలేదని, వీటిని స్వల్పకాలిక కాంట్రాక్ట్‌లతో అనుసంధానించడం వల్ల చెల్లింపుల సంక్షోభం తలెత్తిందని నివేదిక పేర్కొంది. నిజాలను దాచడం, గిడ్డంగుల నిర్వహణలో లోపాలు, రిస్క్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం, చెల్లింపుల్లో విఫలమైన సభ్యులను ట్రేడింగ్‌కు అనుమతించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు వివరించింది. కార్పొరేట్ పాలన విషయంలో కంపెనీ బోర్డు పూర్తిస్థాయిలో విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక ఎన్ఎస్ఈఎల్ ఆడిట్ నివేదికలోనూ పలు లోపాలున్నట్లు వెల్లడించింది. తప్పించుకోలేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ కంపెనీలలో జిగ్నేష్ షాతోపాటు, జోసెఫ్ మాసే, శ్రీకాంత్ జవల్గే కర్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్వోసీ నివేదిక తెలిపింది. అయితే ఆయా కంపెనీలలో జరిగిన అవకతవకలు తెలియవన్నట్లు తప్పించుకోవడానికి వీలుండదని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఇచ్చిన నివేదికలో ఆర్వోసీ స్పష్టం చేసింది కూడా. ఏం జరిగింది? ఎల క్ట్రానిక్ పద్ధతిలో వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లను నిర్వహించేందుకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్‌లకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను పూర్తిచేయలేక ఎక్స్ఛేంజీ సంక్షోభంలో చిక్కుకుంది. దీనికితోడు గిడ్డంగుల్లో సైతం తగిన స్థాయిలో సరుకు నిల్వలు లేకపోవడం సంక్షోభాన్ని పెంచింది. దీంతో గతేడాది ఆగస్టులో ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దశలవారీ చెల్లింపులకు కోరిన గడువులలో సైతం ఎక్స్ఛేంజీ నగదు సమకూర్చుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ఇందుకు పలువురు సభ్యులు చెల్లింపుల్లో విఫలంకావడం కారణమైంది. -
వాటా తగ్గించుకోండి
న్యూఢిల్లీ: ప్రమోటర్లుగా తమ వాటాను నెల రోజుల్లోగా 2% లోపునకు తగ్గించుకోమంటూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)ను మల్టీ కమోడి టీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) బోర్డు కోరింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీ ఆదేశాల మేరకు ఎంసీఎక్స్ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్) సంక్షోభం నేపథ్యంలో ఎక్స్ఛేంజీల నిర్వహణకు ఎఫ్టీఐఎల్తోపాటు, సంస్థ చీఫ్ జిగ్నేష్ షాను గత వారం ఎఫ్ఎంసీ అనర్హులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఎఫ్‌టీఐఎల్‌కు 26% వాటా ఉంది. బోర్డులకు మార్గదర్శకాలు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ ఎక్స్ఛేంజీలకు సంబంధించి కార్పొరేట్ పాలన(గవర్నెన్స్) నిబంధనలను ఎఫ్ఎంసీ కఠినతరం చేసింది. దీనిలో భాగంగా అన్ని రకాల ప్రధాన వ్యాపార నిర్ణయాలను తగిన స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఎక్స్ఛేంజీల బోర్డులను ఆదేశించింది. ఈ బాటలో సీఈవోల ఆర్థికపరమైన అధికారాలపై కన్నేయడంతోపాటు, ప్రమోటర్లు, యాజమాన్య సంబంధిత వ్యక్తుల లావాదేవీలపై సైతం తగిన పరిశీలన చేపట్టాల్సిందిగా సూచించింది. ఇవికాకుండా డొనేషన్లు, పబ్లిసిటీ, మీడియా, లీగల్ తదితర చార్జీల వంటి అంశాలలో తగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా సలహా ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్సహా ఆరు జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. -
61శాతం పడిన ఫైనాన్షియల్ టెక్ లాభం
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా నేతృత్వంలోని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇం డియా) నికర లాభం రెండవ త్రైమాసికంలో 61 శాతంపైగా పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రూ.70 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో కూరుకుపోయిన అనుబంధ సంస్థ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్)కి కేటాయింపులు జరపాల్సి రావడం దీనికి ప్రధాన కారణం. ఇక నిర్వహణపరమైన ఆదాయం సైతం రూ.125 కోట్ల నుంచి రూ.93 కోట్లకు పడిపోయింది. సాఫ్ట్వేర్ బిజినెస్‌పరంగా రెవెన్యూ తగ్గడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. వ్యయాలు రూ.55 కోట్ల నుంచి రూ. 68 కోట్లకు ఎగశాయి. కాగా షేర్‌కు రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ చెల్లింపులు ఉంటాయి. -
స్పాట్ ఎక్స్చేంజ్ వైస్ ప్రెసిడెంట్ అరెస్టు
ముంబై: సుమారు రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్ విభాగం) అమిత్ ముఖర్జీని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్టు చేసింది. ఈ కేసులో ఇది మొట్టమొదటి అరెస్టు. బుధవారం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు ఈవోడబ్ల్యూ అదనపు పోలీస్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా తెలిపారు. మరోవైపు, ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షాతో పాటు డెరైక్టర్లు జోసెఫ్ మాసీ, శ్రీకాంత్ జవల్గేకర్, దేవాంగ్ల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. గత నెల 30 నుంచి ముఖర్జీని విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని సిన్హా తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో సంస్థ ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్-ఎస్ఎక్స్) బోర్డు సభ్యత్వానికి జిగ్నేష్ షా రాజీనామా చేశారు. అలాగే, వైస్ చైర్మన్ జోసెఫ్ మాసీ కూడా వైదొలిగారు. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్) అవకతవకలపై సీబీఐ నిగ్గుతేలుస్తుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఐపీసీ ఇతర చట్టాలను ఎన్ఎస్ఈఎల్ ఉల్లంఘించినట్లు సీబీఐకి ఫిర్యాదు అందిందని, దీని ఆధారంగా దర్యాప్తు సంస్థ తగిన చర్యలు చేపడుతుందని గురువారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ కమిటీ ఇటీవలి నివేదిక ఆధారంగా సీబీఐతోపాటు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్ఎంసీ), కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) కూడా ఈ చెల్లింపుల సంక్షోభంపై దర్యాప్తు జరపనున్నాయని ఆయన వెల్లడించారు. ‘ఎన్ఎస్ఈఎల్ ఉదంతంలో అవకతవకలు జరిగినట్లు మాయారామ్ కమిటీ నివేదిక తేల్చింది. దీనిపై ఎప్పటికల్లా చర్యలు ఉంటాయన్న నిర్దిష్ట గడువును నేను చెప్పలేను. అయితే, ఈ మూడు సంస్థలూ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి సాధ్యమైనంత త్వరగానే తగు చర్యలు తీసుకుంటాయి’ అని చిదంబరం పేర్కొన్నారు. జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) గ్రూప్‌నకు చెందిన ఎన్ఎస్ఈఎల్... కమోడిటీ ఫ్యూచర్స్ లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.5,600 కోట్ల మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేయడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆతర్వాత జూలై 31న ఎక్స్ఛేంజ్ కూడా నిలిచిపోయింది. ఇన్వెస్టర్లకు వరుసగా ఆరు వారాల్లో కొంత మొత్తాన్ని చెల్లింపులు చేస్తామని చెప్పిన ఎన్ఎస్ఈఎల్ మొత్తం ఆరు విడతల్లో కూడా సొమ్ము తిరిగివ్వడంలో విఫలమైంది. కాగా, ప్రమోటర్ సంస్థ ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్ఎస్ఈఎల్ బదిలీ చేసిన నిధుల విషయంలో పన్ను ఉల్లంఘనలను నిగ్గుతేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగనుంది. ఇన్వెస్టర్లకు అంతా తెలుసు... ఎన్ఎస్ఈఎల్ నియంత్రణ సంస్థల కనుసన్నల్లో లేదని ఇన్వెస్టర్లకు తెలుసని చిదంబరం పేర్కొన్నారు. ‘ఇది ఎఫ్ఎంసీ నియంత్రణలో రిజిస్టర్ అయిన సంస్థ కాదు. అయినా, వ్యాపారం ప్రారంభానికి ముందే కొన్ని మినహాయింపులు పొంది ఎక్స్ఛేంజ్ మొదలైంది. దీనిపై నియంత్రణ లేదన్న విషయం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు తెలుసు. ఆరంభమైన తొలినాళ్లనుంచే నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తున్న ఎన్‌ఎస్‌ఈఎల్‌ను గుడ్డిగా నమ్మి ఇన్వెస్టర్లు మోసపోయారు’ అని చిదంబరం చెప్పారు. ఇతర నియంత్రణ సంస్థలూ అప్రమత్తం... ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం ఇతర మార్కెట్లకూ పాకొచ్చనే భయాలు నెలకొన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సెబీ, ఎఫ్‌ఎంసీలకు సూచించినట్లు చిదంబరం చెప్పారు. అసలు ఎక్స్ఛేంజ్ ప్రాథమిక వ్యాపార నిబంధనలనే ఎన్ఎస్ఈఎల్ తుంగలోకితొక్కుతూ వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ అయిన ఎఫ్టీఐఎల్... మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్లను కూడా ప్రమోట్ చేసింది. ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్లకు చెందిన ఇతర ఎక్స్ఛేంజీల్లో యాజమాన్య మార్పులపై ప్రభుత్వం దృష్టిపెట్టిందా అన్న ప్రశ్నకు.. విచారణ నివేదికలు వచ్చాక ఆలోచించగలమని చిదంబరం పేర్కొన్నారు. ‘సంక్షోభంపై ఎఫ్ఎంసీ నివేదిక ఒకట్రెండు రోజుల్లో వస్తుంది. దీన్ని పరిశీలించాక సీబీఐ, ఎంసీఏ కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నిర్ణయిస్తాయి. ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో బ్లాక్‌మనీ వంటి వ్యవహరాలేవైనా ఉన్నాయా అనేదానిపైనా ఐటీ శాఖ దృష్టిసారిస్తోంది’ అని విత్తమంత్రి చెప్పారు. కోర్టుకు కూడా వెళ్లొచ్చు...: మరోపక్క, ఎన్ఎస్ఈఎల్ వ్యవహారం ఇన్వెస్టర్లు, కంపెనీకి మధ్య అంశం అయినందున వాళ్లు కచ్చితంగా తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించ వచ్చని చిదంబరం తెలిపారు. ఎన్ఎస్ఈఎల్లో లావాదేవీలు జరుపుతున్న ఇన్వెస్టర్లు దాదాపు 17,000 మంది దాకా ఉంటారు. వీరిలో 9,000 మంది వరకూ ఇన్వెస్టర్లు ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టెమాటిక్స్ వంటి టాప్-8 బ్రోకరేజి సంస్థల ద్వారా ట్రేడింగ్ జరిపారు. -
సొమ్ము రికవరీకి ప్రాధాన్యం: జిగ్నేష్ షా
న్యూఢిల్లీ: మొత్తం 23 మంది రుణగ్రహీతల(చెల్లింపుదారులు) నుంచి సొమ్మును రికవర్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడతామని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) ప్రమోటర్ జిగ్నేష్ షా పేర్కొన్నారు. తద్వారా ఇన్వెస్టర్ల ఖాతాలను సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఈ అంశాలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్తో సమావేశమైన షా ప్రమోటర్‌గా తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ ఫోరమ్‌తో మాయారామ్ భేటీ... కాగా, చట్టాల ఉల్లంఘన జరిగితే ఇందుకు కారణమైన వారిని శిక్షించేందుకు వెనకాడబోమని మరోవైపు మాయారామ్ విలేకరులతో వ్యాఖ్యానించడం గమనార్హం. మాయారామ్ ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ ఫోరమ్‌తో కూడా సమావేశమయ్యారు. తామెలా మోసపోయామో మాయారామ్కు వివరించామని ఇన్వెస్టర్ల ఫోరమ్ కార్యదర్శి అరుణ్ కుమార్ దాల్మియా చెప్పారు. జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఈఎల్‌ను దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో స్పాట్ ట్రేడింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. తద్వారా స్పాట్ ప్రాతిపదికన వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లకు తెరలేపారు. అయితే వివిధ కాంట్రాక్ట్‌లకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక ఎక్స్ఛేంజీ విఫలమై సంక్షోభంలో కూరుకుపోయింది. ఎక్స్ఛేంజీ సంక్షోభంపై పరిశోధన చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్, విదేశీ మారక చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఆర్థిక శాఖకు నివేదికను సమర్పించింది. ఈ అంశాలపై సమీక్ష చేపట్టేందుకు మాయారామ్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ ఈ నెల 18న సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 7% పతనమై రూ. 185 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 168 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. -
యాజమాన్యంలో చెడ్డవారివల్లే సమస్యలు
న్యూఢిల్లీ: యాజమాన్య టీమ్‌లోని కొంతమంది చెడ్డ వ్యక్తులవల్లే చెల్లింపుల సంక్షోభం ఎదురైందని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) బోర్డు మాజీ సభ్యులు తాజాగా ఆరోపించారు. ఇటీవల రాజీనామా చేసిన సంస్థ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శంకర్‌లాల్ గురుతోపాటు, బీడీ పవార్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. వీరిరువురితోపాటు మరో డెరైక్టర్ రామనాథన్ దేవరాజన్ గత వారం బోర్డుకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం బోర్డులో ఇద్దరే మిగిలారు. ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డులో ప్రస్తుతం ప్రధాన ప్రమోటర్ జిగ్నేష్ షా, జోసఫ్ మెస్సీ మాత్రమే మిగిలారు. కాగా, కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపులను సెటిల్ చేయలేక ఎన్ఎస్ఈఎల్ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఈవో అంజనీ సిన్హాతోపాటు మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన మేనేజ్మెంట్ టీమ్‌ను తొలగిస్తూ ఇటీవలే ఎన్ఎస్ఎఈల్ బోర్డు నిర్ణయం తీసుకుంది కూడా. ఈ నెల 7నే రాజీనామా: ఎన్ఎస్ఈఎల్ బోర్డుకి ఈ నెల 7న రాజీనామా చేశానని గురు చెప్పారు. ఎక్స్ఛేంజీ కార్యకలాపాలలో వ్యవసాయ మార్కెటింగ్‌ను ప్రోత్సహించే కార్యక్రమాన్ని(మిషన్) కొనసాగించడంలేదని తనతోపాటు, బీడీ పవార్ కూడా భావించారని గురు పేర్కొన్నారు. ఎక్స్ఛేంజీలో ఈ స్థాయి కుంభకోణం జరగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో తనకు ఏ విధమైన సంబంధమూ లేదని చెప్పారు. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ లేదా ఎక్స్ఛేంజీని నడిపే విషయంలో నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. సీఈవో ఆధ్వర్యంలోని టీమ్ ఈ విషయాలను చూసుకుంటుందని చెప్పారు. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు, యాజమాన్య టీమ్‌లోని చెడ్డ వ్యక్తులను శిక్షించాలని కోరారు.