ఎన్‌ఎస్‌ఈఎల్ స్కామ్‌లో ముగ్గురు అరెస్టు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) కుంభకోణానికి సంబంధించి ముగ్గురిని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేశారు. ఆనంద్ రాఠీ కమోడిటీస్ ఎండీ అమిత్ రాఠీ, ఇండియా ఇన్ఫోలైన్ కమోడిటీస్ వీపీ చింతన్ మోదీ, జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్ టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ సంస్థలకు చెందిన ఇతర ఉద్యోగులను కూడా ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌ఎస్‌ఈఎల్ కుంభకోణం 2013 జూలైలో వెలుగులోకి వచ్చింది.
ట్రేడింగ్ సమయం ముగిసిపోయిన తర్వాత ఏకంగా 3,00,000 సార్లు క్లయింట్ కోడ్‌లను దుర్వినియోగం చేసి పలు బ్రోకింగ్ సంస్థలు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా అవి మనీలాండరింగ్‌కి పాల్పడ్డాయని అభియోగాలున్నాయి. కేసు నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రమోటరు జిగ్నేష్ షా సహా పలువురు ఉద్యోగులు అరెస్టరయ్యారు. జిగ్నేష్ షా ఆ తరవాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ట్రేడింగ్ నిల్చిపోయింది. దీన్ని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో విలీనం చేయాలంటూ సెబీ ఆదేశించింది.