Economic Offences Wing
-
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్‌కు మరోసారి చుక్కెదురైంది. భారత్‌పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్‌తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్‌టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్‌ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్‌పే ఫౌండర్ ట్యాగ్‌ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్‌లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్
ఆర్థిక నేరాలు, కుంభకోణాలు మనం నిత్యం చూస్తున్నవే. కానీ, ఆ నేరాల్లో నైపుణ్యం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నది మేధావుల మాట. ఆర్థిక మేధావిగా ప్రపంచం నుంచి జేజేలు అందుకున్న అరిఫ్ నక్వీ.. తర్వాతి కాలంలో ‘స్కామర్’గా ఓ మాయని మచ్చను అంటించుకున్నాడు. ప్రస్తుతం తాను పాల్పడ్డ ఆర్థిక నేరాలకు సుదీర్ఘ కాలం జైలుశిక్ష అనుభవించేంత పరిస్థితికి చేరుకున్నాడు. అందులో బిల్‌గేట్స్‌ను 700 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన అబ్రాజ్ గ్రూపుల అధినేతే ఈ అరిఫ్ నక్వీ(60). ప్రపంచానికి ఏదో మంచి చేస్తామంటూ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. కంపెనీలు, సేవా కార్యక్రమాల పేరిట పెట్టుబడులను స్వీకరించాడు. ఈ క్రమంలో దర్పం ప్రదర్శిస్తూ గొప్ప గొప్పవాళ్లతో భేటీ అవుతూ.. తెలివిగా బోల్తా అందరినీ ఏమాయ చేశాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలతో పాటు గోల్డ్‌మ్యాన్ సాచ్స్ మాజీ సీఈవో లాయ్డ్ బ్లాంక్‌ఫెయిన్, బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటి ప్రముఖలెందరో అరిఫ్ చేతిలో మోసపోయినవాళ్ల లిస్ట్‌లో ఉన్నారు. ‘ది కీ మ్యాన్: ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాస్ డూప్డ్ బై ఏ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టెయిల్’ అనే బుక్‌లో సైమన్ క్లార్క్, విల్ లాంఛ్ ద్వయం ఈ బిల్డప్ బాబాయ్ మోసాల గురించి రాశారు. మొత్తం ఫండ్స్ నుంచి 780 మిలియన్ డాలర్ల సొమ్మును ఎలా పక్కదారి పట్టించాడు, మరో 385 మిలియన్ డాలర్ల సొమ్మును లెక్కల్లోనే లేకుండా ఎలా చేశాడు అనే వివరాల్ని ప్రస్తావించారు. ఇక బిల్‌గేట్స్ సహాయక కార్యక్రమాల ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దావోస్ సదస్సులో తనను తాను ఓ వ్యాపార దిగ్గజంగా పరిచయం చేసుకున్న అరిఫ్.. తన కంపెనీ ర్యాంకింగ్లంటూ, ఎన్జీవో సేవాకార్యక్రమాలంటూ ఫేక్ వివరాలను, సర్వేలను చూపించాడు నక్వీ. చేయూత నివ్వాలంటూ కోరడం, అతని ఆర్భాటాలు-హడావిడి చూసి గేట్స్ మోసపోవడం గురించి వివరంగా రాశారు ఆ బుక్‌లో. అయితే అబ్రాజ్ తరపున నక్వీ మోసాలు బయటకు రావడం, అప్పటికే ఆలస్యం కావడంతో నష్టం జరిగిపోయిందంటూ బుక్‌లో తెలిపారు. పాక్‌లో ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ల కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ల కోసం 100 మిలియన్ డాలర్ల(700 కోట్ల రూపాయలపైనే) సాయం అందించింది గేట్స్ ఫౌండేషన్. అలా ఆ డబ్బును తన ఖాతాలో వేసేసుకున్నాడు నక్వీ.. రహస్యాంగా అంతా ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. బిల్డప్ బాబాయ్ నేపథ్యం 1960లో పాకిస్తాన్ కరాచీలో పుట్టిన నక్వీ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆర్థిక మేధావిగా ఎన్నో సదస్సుల్లో ప్రసగించడమే కాకుండా, ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆపై అమన్ పేరుతో ఓ ఫౌండేషన్ నెలకొల్పి.. చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. 2003లో ఇస్లాం దేశాల రాజులు, వ్యాపారుల నుంచి 118 మిలియన్ డాలర్లను సేకరించాడు. ఆ సొమ్ముతో అబ్రాజ్ కంపెనీని నెలకొల్పి.. భారీ అవతకవలకు పాల్పడ్డాడు. 2010లో ఒబామా అధ్యక్షతన అమెరికాలో జరిగిన ఎంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్‌కు నక్వీ కూడా హాజరయ్యాడు. అంతేకాదు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సైతం దక్కించుకున్నాడు. దుబాయ్‌లో లగ్జరీ ఇంటిలో విలాసవంతమైన జీవితం గడిపిన నక్వీ.. కంటితుడుపుగా యూనివర్సిటీలకు విరాళాలు ఇస్తుండేవాడు. ఈ బిల్డప్లతోనే సుమారు 300 కంపెనీల నుంచి పెట్టుబడులను రాబట్టాడంటే అతిశయోక్తి కాదు. పైగా దావోస్ లాంటి విదేశీ సమ్మిట్లకు హాజరవుతూ.. బిల్‌గేట్స్‌లాంటి బిలియనీర్లెందరితోనో పరిచయం పెంచుకున్నాడు. 2017లో ఆయన అవినీతి గురించి ఉద్యోగులు మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. ఆరోపణల తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఈ ఆరోపణలపై ప్రైవేట్ దర్యాప్తునకు ఆదేశించింది. చివరికి ఆ ఆరోపణల ఆధారంగా నక్వీని నేరస్తుడిగా తేల్చిన అమెరికా కోర్టు.. ఏప్రిల్ 10, 2019న లండన్ హెత్రో ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయించింది. అయితే బెయిల్ దొరికినప్పటికీ.. వ్యక్తిగత పూచీ కత్తులపై హౌజ్ అరెస్ట్‌ను కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ కూడా నక్వీ నేరాలపై విచారణ కొనసాగిస్తోంది. నక్వీ ఆర్థిక నేరాలు గనుక రుజువైతే 300 ఏళ్లు జైలు శిక్ష పడనుంది. చదవండి: డర్టీ బిజినెస్- భార్య ఎఫైర్లను సైట్లో పెట్టిన గూగుల్ ఫౌండర్ -
జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!
భోపాల్: గ్వాలియర్ రాజవంశీయుడు, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన క్రమంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన క్రమంలో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలో బల నిరూపణ పరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష బీజేపీ ప్రతిపాదిస్తుండగా... తమకు కొంత సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సింధియాపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మరోసారి తాజాగా సింధియాపై కేసు నమోదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ ఆర్థిక నేర విభాగం(ఈవోడబ్ల్యూ) పేర్కొంది.(ఆ కుటుంబాన్ని వీడాను: సింధియా భావోద్వేగం) ఈ మేరకు... ‘‘సురేంద్ర మరోసారి గురువారం సింధియా కుటుంబానికి వ్యతిరేకంగా మాకు ఫిర్యాదు చేశారు. 2009లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని 6 వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని తనకు అమ్మారని.. ఇందుకు సంబంధించి తప్పుడు పత్రాలు చూపించారని ఆరోపించారు. మహల్గావ్లోని భూమికి సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు’’అని ఈవోడబ్ల్యూ తన నోట్లో పేర్కొంది. ఇక ఈ విషయం గురించి ఈవోడబ్ల్యూ అధికారి మాట్లాడుతూ... ‘‘ సురేంద్ర మార్చి 26, 2014లో తొలిసారి ఫిర్యాదు చేశారు. ఆ కేసును విచారించి 2018లో మూసివేశాం. అయితే తాజాగా మరోసారి పిటిషన్ వేశారు. కాబట్టి నిజానిజాలను తేల్చేందుకు మరలా విచారణకు సిద్ధమవుతున్నాం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన సింధియా అనుచరుడు పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ.. ఇది రాజకీయ క్షక్షపూరిత చర్య అని మండిపడ్డారు. ‘‘ఈ కేసును ఎప్పుడో మూసివేశారు. అయితే ఇప్పుడు కావాలనే తిరగదోడుతున్నారు. మాకు రాజ్యాంగం పట్ల... చట్టాల పట్ల నమ్మకం ఉంది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మేం సరైన సమాధానం ఇస్తాం’’అని పేర్కొన్నారు.(సింధియా నిష్క్రమణపై సచిన్ పైలట్ ట్వీట్) -
రూ.100 కోట్ల స్కాం : లిక్కర్ బారెన్ కుమారుడు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లిక్కర్ బారెన్ పాంటీ చద్దా కుమారుడు, వేవ్ గ్రూపు వైస్ ఛైర్మన్ మణిప్రీత్ సింగ్ (మోంటీ చద్దా)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 100 కోట్ల కుంభకోణం కోసులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. ధాయ్‌లాండ్‌కు పారిపోతుండగా అధికారులు చద్దాను అడ్డుకున్నారు. చౌక ధరలో ఫ్లాట్లను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చి వినియోగదారులను మోసం చేశారన్న ఆరోపణలపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్-చద్దా హైటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వేవ్ గ్రూపు వైస్ చైర్మన్ మోంటీ చందాను బుధవారం అరెస్ట్ చేశారు. రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారని అధికారులు ఆరోపించారు. చద్దాను గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఆర్థిక నేరాల విభాగం) సువాష్ష్ చౌదరి తెలిపారు. ఘజియాబాద్‌లో హౌటెక్ టౌన్షిప్ పేరుతో కొనుగోలుదారును మోసం చేసిన కేసులో 2018, జనవరిలో మోంటీ చద్దా, ఇతర కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వేవ్ గ్రూప్‌తోపాటు, ఇతర ప్రమోటర్లపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. రోజ్‌వుడ్ ఎన్క్లేవ్, సన్నీవుడ్ ఎన్క్లేవ్, లైమ్వుడ్ ఎన్క్లేస్, చెస్ట్వుడ్ ఎన్క్లేవ్ టౌన్షిప్పేరుతో గృహకొనుగోలుదారులను ఆకర్షించాడు. ఇళ్ళు, విల్లాలు గోల్ఫ్ కోర్సు, హెలిపాడ్స్, ఇంటర్నేషనల్ స్కూలు, కాలేజ్,షాపింగ్ మాల్స్ తదితర అత్యాధునిక సదుపాయాలంటూ వారిని మభ్య పెట్టారు. కానీ ప్లాట్లను వారికి కేటాయించడంలో విఫలమైనారనేది ప్రధాన అరోపణ. దాదాపు 11 సంవత్సరాలుగా వీరి చేతుల్లో బాధితులు నానా అగచాట్లు పడుతున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా ఆస్తుల వివాదంలో 2012లో మోంటీ చద్దా తండ్రి వివాదాస్పద మద్యం వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి పాంటీ చద్దాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటినుంచి తండ్రి బాధ్యతలను మోంటీ చేపట్టారు. -
సంస్కరణలతో ఆశించిన ఫలితాలు:ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల కట్టలు బ్యాంకుల్లోకి వచ్చినట్టు చెప్పారు. ‘‘మొత్తం నగదును బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే నోట్ల రద్దు ఉద్దేశ్యం. అది చాలా వరకు నెరవేరింది’’అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్‌లిస్టెడ్ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది. -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో ముగ్గురు అరెస్టు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణానికి సంబంధించి ముగ్గురిని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేశారు. ఆనంద్ రాఠీ కమోడిటీస్ ఎండీ అమిత్ రాఠీ, ఇండియా ఇన్ఫోలైన్ కమోడిటీస్ వీపీ చింతన్ మోదీ, జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్ టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ సంస్థలకు చెందిన ఇతర ఉద్యోగులను కూడా ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణం 2013 జూలైలో వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ సమయం ముగిసిపోయిన తర్వాత ఏకంగా 3,00,000 సార్లు క్లయింట్ కోడ్లను దుర్వినియోగం చేసి పలు బ్రోకింగ్ సంస్థలు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా అవి మనీలాండరింగ్‌కి పాల్పడ్డాయని అభియోగాలున్నాయి. కేసు నేపథ్యంలో ఎన్ఎస్ఈఎల్ ప్రమోటరు జిగ్నేష్ షా సహా పలువురు ఉద్యోగులు అరెస్టరయ్యారు. జిగ్నేష్ షా ఆ తరవాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ నిల్చిపోయింది. దీన్ని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో విలీనం చేయాలంటూ సెబీ ఆదేశించింది.