సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్‌కు మరోసారి చుక్కెదురైంది. భారత్‌పే టాప్ లీడర్‌షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్‌తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
గత ఏడాది ఫిన్‌టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది.
ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు
86 నకిలీ, తప్పుడు ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది.
కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్‌ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్‌పే ఫౌండర్ ట్యాగ్‌ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్‌లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment