ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ కుటుంబ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తెలిపింది.
పోలీసుల కథనం ప్రకారం..‘భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ బావమరిది దీపక్ గుప్తా సంస్థ నిధుల దుర్వినియోగంలో పలువురికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. సంస్థకు చెందిన అనేక మంది విక్రేతలతో ఆయనకు సంబంధం ఉందని ప్రాథమిక సమాచారం. నిధులు దుర్వినియోగం కేసులో ఇప్పటికే అరెస్టయిన అమిత్ కుమార్ బన్సల్‌కు దీపక్‌గుప్తా సూచనలిచ్చారని ఆరోపణలొచ్చాయి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
అసలేం జరిగిందంటే..
భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఈఓడబ్ల్యూ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment