ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం! | how ashneer grover settled dispute with bharatpe | Sakshi
Sakshi News home page

Bharatpe: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!

Published Mon, Sep 30 2024 2:44 PM | Last Updated on Mon, Sep 30 2024 3:11 PM

how ashneer grover settled dispute with bharatpe

ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ రెండేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అష్నీర్‌, సంస్థకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇకపై తాను భారత్‌పేతో ఏ హోదాలో కొనసాగరు. కంపెనీలోని తన షేర్లను కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. ఇరువైపులా ఉన్న చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోనున్నారు.

అసలేం జరిగిందంటే..

భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్‌ గ్రోవర్‌ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్‌ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు  పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్‌ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్‌ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది.

ఈ నేపథ్యంలో అష్నీర్‌ సంస్థతో రెండేళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. సంస్థ కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇకపై గ్రోవర్‌కు భారత్‌పేతో సంబంధం ఉండదు. తాను కంపెనీలో ఏ హోదాలోనూ కొనసాగరు. గ్రోవర్ షేర్లు ఫ్యామిలీ ట్రస్ట్‌కి బదిలీ చేయబడతాయి. అందులో కొంతభాగం కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ‘రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్‌’కు బదిలీ చేయనున్నారు.

ఇదీ చదవండి: యాపిల్‌కు రూ.1.29 లక్షల జరిమానా

‘భారత్‌పేతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకున్నాను. సంస్థ వృద్ధికి సరైన దిశలో పాటుపడుతున్న మేనేజ్‌మెంట్, బోర్డు సభ్యులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపై సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నాను. నాకు చెందిన కొన్ని షేర్లను నా ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంస్థతో ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేసుకున్నాం’ అని ఎక్స్‌లో ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement