బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్‌ బాబాయ్‌ | Pakistan Arif Naqvi Cheats Bill Gates For Hundred Crores | Sakshi
Sakshi News home page

Arif Naqvi: బిల్‌గేట్స్‌లాంటి మేధావులెందరినో బురిడీ కొట్టించిన కేటుగాడు.. నేరాలు రుజువైతే 300 ఏళ్ల శిక్ష!!

Published Mon, Aug 30 2021 10:44 AM | Last Updated on Mon, Aug 30 2021 10:50 AM

Pakistan Arif Naqvi Cheats Bill Gates For Hundred Crores - Sakshi

ఆర్థిక నేరాలు, కుంభకోణాలు మనం నిత్యం చూస్తున్నవే. కానీ, ఆ నేరాల్లో నైపుణ్యం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇన్‌వాల్వ్‌ అవుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నది మేధావుల మాట. ఆర్థిక మేధావిగా  ప్రపంచం నుంచి జేజేలు అందుకున్న అరిఫ్‌ నక్వీ.. తర్వాతి కాలంలో ‘స్కామర్‌’గా ఓ మాయని మచ్చను అంటించుకున్నాడు. ప్రస్తుతం తాను పాల్పడ్డ ఆర్థిక నేరాలకు సుదీర్ఘ కాలం జైలుశిక్ష అనుభవించేంత పరిస్థితికి చేరుకున్నాడు. అందులో బిల్‌గేట్స్‌ను 700 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


పాకిస్థాన్‌కు చెందిన అబ్‌రాజ్‌ గ్రూపుల అధినేతే ఈ అరిఫ్‌ నక్వీ(60). ప్రపంచానికి ఏదో మంచి చేస్తామంటూ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. కంపెనీలు, సేవా కార్యక్రమాల పేరిట పెట్టుబడులను స్వీకరించాడు. ఈ క్రమంలో దర్పం ప్రదర్శిస్తూ గొప్ప గొప్పవాళ్లతో భేటీ అవుతూ.. తెలివిగా బోల్తా అందరినీ ఏమాయ చేశాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌లు  బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామాలతో పాటు గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ మాజీ సీఈవో లాయ్డ్‌ బ్లాంక్‌ఫెయిన్‌, బిల్‌ గేట్స్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ లాంటి ప్రముఖలెందరో అరిఫ్‌ చేతిలో మోసపోయినవాళ్ల లిస్ట్‌లో ఉన్నారు.
 

‘ది కీ మ్యాన్‌: ట్రూ స్టోరీ ఆఫ్‌ హౌ ది గ్లోబల్‌ ఎలైట్‌ వాస్‌ డూప్డ్‌ బై ఏ క్యాపిటలిస్ట్‌ ఫెయిరీ టెయిల్‌’ అనే బుక్‌లో సైమన్‌ క్లార్క్‌, విల్‌ లాంఛ్‌ ద్వయం ఈ బిల్డప్‌ బాబాయ్‌ మోసాల గురించి రాశారు. మొత్తం ఫండ్స్‌ నుంచి 780 మిలియన్‌ డాలర్ల సొమ్మును ఎలా పక్కదారి పట్టించాడు, మరో 385 మిలియన్‌ డాలర్ల సొమ్మును లెక్కల్లోనే లేకుండా ఎలా చేశాడు అనే వివరాల్ని ప్రస్తావించారు. ఇక బిల్‌గేట్స్‌ సహాయక కార్యక్రమాల ఫౌండేషన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దావోస్‌ సదస్సులో తనను తాను ఓ వ్యాపార దిగ్గజంగా పరిచయం చేసుకున్న అరిఫ్‌..  తన కంపెనీ ర్యాంకింగ్‌లంటూ, ఎన్జీవో సేవాకార్యక్రమాలంటూ ఫేక్‌ వివరాలను, సర్వేలను చూపించాడు నక్వీ. చేయూత నివ్వాలంటూ కోరడం, అతని ఆర్భాటాలు-హడావిడి చూసి గేట్స్‌ మోసపోవడం గురించి వివరంగా రాశారు ఆ బుక్‌లో.

అయితే అబ్‌రాజ్‌ తరపున నక్వీ మోసాలు బయటకు రావడం, అప్పటికే ఆలస్యం కావడంతో నష్టం జరిగిపోయిందంటూ బుక్‌లో తెలిపారు. పాక్‌లో ఫ్యామిలీ ఫ్లానింగ్‌ ఆపరేషన్ల కోసం, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ల కోసం 100 మిలియన్‌ డాలర్ల(700 కోట్ల రూపాయలపైనే) సాయం అందించింది గేట్స్‌ ఫౌండేషన్‌. అలా ఆ డబ్బును తన ఖాతాలో వేసేసుకున్నాడు నక్వీ.. రహస్యాంగా అంతా ఖర్చు పెట్టుకుంటూ పోయాడు.

బిల్డప్‌ ​బాబాయ్‌ నేపథ్యం
1960లో పాకిస్తాన్‌ కరాచీలో పుట్టిన నక్వీ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఆర్థిక మేధావిగా ఎన్నో సదస్సుల్లో ప్రసగించడమే కాకుండా, ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆపై అమన్‌ పేరుతో ఓ ఫౌండేషన్‌ నెలకొల్పి.. చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు.  2003లో ఇస్లాం దేశాల రాజులు, వ్యాపారుల నుంచి 118 మిలియన్‌ డాలర్లను సేకరించాడు. ఆ సొమ్ముతో అబ్‌రాజ్‌ కంపెనీని నెలకొల్పి.. భారీ అవతకవలకు పాల్పడ్డాడు. 2010లో ఒబామా అధ్యక్షతన అమెరికాలో జరిగిన ఎంట్రాప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు నక్వీ కూడా హాజరయ్యాడు. అంతేకాదు 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సైతం దక్కించుకున్నాడు. దుబాయ్‌లో లగ్జరీ ఇంటిలో విలాసవంతమైన జీవితం గడిపిన నక్వీ.. కంటితుడుపుగా యూనివర్సిటీలకు విరాళాలు ఇస్తుండేవాడు.

ఈ బిల్డప్‌లతోనే సుమారు 300 కంపెనీల నుంచి పెట్టుబడులను రాబట్టాడంటే అతిశయోక్తి కాదు. పైగా దావోస్‌ లాంటి విదేశీ సమ్మిట్‌లకు హాజరవుతూ.. బిల్‌గేట్స్‌లాంటి బిలియనీర్‌లెందరితోనో పరిచయం పెంచుకున్నాడు. 2017లో ఆయన అవినీతి గురించి ఉద్యోగులు మెయిల్స్‌ ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. ఆరోపణల తర్వాత గేట్స్‌ ఫౌండేషన్‌  ఈ ఆరోపణలపై ప్రైవేట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. చివరికి ఆ ఆరోపణల ఆధారంగా నక్వీని నేరస్తుడిగా తేల్చిన అమెరికా కోర్టు.. ఏప్రిల్‌ 10, 2019న లండన్‌ హెత్‌రో ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేయించింది. అయితే బెయిల్‌ దొరికినప్పటికీ.. వ్యక్తిగత పూచీ కత్తులపై హౌజ్‌ అరెస్ట్‌ను కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబాయ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అథారిటీ కూడా నక్వీ నేరాలపై విచారణ కొనసాగిస్తోంది. నక్వీ ఆర్థిక నేరాలు గనుక రుజువైతే 300 ఏళ్లు జైలు శిక్ష పడనుంది.

చదవండి: డర్టీ బిజినెస్‌- భార్య ఎఫైర్లను సైట్‌లో పెట్టిన గూగుల్‌ ఫౌండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement