సొమ్ము రికవరీకి ప్రాధాన్యం: జిగ్నేష్ షా
సొమ్ము రికవరీకి ప్రాధాన్యం: జిగ్నేష్ షా
Published Tue, Sep 17 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
న్యూఢిల్లీ: మొత్తం 23 మంది రుణగ్రహీతల(చెల్లింపుదారులు) నుంచి సొమ్మును రికవర్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడతామని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) ప్రమోటర్ జిగ్నేష్ షా పేర్కొన్నారు. తద్వారా ఇన్వెస్టర్ల ఖాతాలను సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్‌ఎస్‌ఈఎల్ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఈ అంశాలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్‌తో సమావేశమైన షా ప్రమోటర్‌గా తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని వ్యాఖ్యానించారు.
ఇన్వెస్టర్ ఫోరమ్‌తో మాయారామ్ భేటీ...
కాగా, చట్టాల ఉల్లంఘన జరిగితే ఇందుకు కారణమైన వారిని శిక్షించేందుకు వెనకాడబోమని మరోవైపు మాయారామ్ విలేకరులతో వ్యాఖ్యానించడం గమనార్హం. మాయారామ్ ఎన్‌ఎస్‌ఈఎల్ ఇన్వెస్టర్ ఫోరమ్‌తో కూడా సమావేశమయ్యారు. తామెలా మోసపోయామో మాయారామ్‌కు వివరించామని ఇన్వెస్టర్ల ఫోరమ్ కార్యదర్శి అరుణ్ కుమార్ దాల్మియా చెప్పారు. జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఈఎల్‌ను దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో స్పాట్ ట్రేడింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
తద్వారా స్పాట్ ప్రాతిపదికన వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లకు తెరలేపారు. అయితే వివిధ కాంట్రాక్ట్‌లకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక ఎక్స్ఛేంజీ విఫలమై సంక్షోభంలో కూరుకుపోయింది. ఎక్స్ఛేంజీ సంక్షోభంపై పరిశోధన చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్, విదేశీ మారక చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఆర్థిక శాఖకు నివేదికను సమర్పించింది. ఈ అంశాలపై సమీక్ష చేపట్టేందుకు మాయారామ్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ ఈ నెల 18న సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 7% పతనమై రూ. 185 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 168 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.
Advertisement