స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈకి భారీ వాటా ఉన్న కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్- క్యామ్స్(CAMS) పబ్లిక్ ఇష్యూని చేపడుతోంది. సోమవారం (ఈ నెల 21న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించింది. బుధవారం(23న) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది.
యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా క్యామ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 667 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 1230 ధరలో 35 సంస్థలకు షేర్లను విక్రయించింది. క్యామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదభీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతోపాటు 13 దేశీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం క్యామ్స్‌లోల మొత్తం 37.48 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎన్‌ఎస్‌ఈ విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి ఎన్‌ఎస్‌ఈ వైదొలగనుంది. క్యామ్స్‌లో ప్రధాన ప్రమోటర్ కంపెనీ గ్రేట్ టెరైన్‌కు 43.53 శాతం వాటా ఉంది. ఐపీవో తదుపరి ఈ వాటా 30.98 శాతానికి పరిమితంకానుంది. పీఈ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్‌కు చెందిన కంపెనీ ఇది.
ఇతర వివరాలు..
1988లో ఏర్పాటైన క్యామ్స్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)కి 37.48 శాతం వాటా ఉంది. ప్రధాన ప్రమోటర్ గ్రేట్ టెరైన్ 43.53 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. దేశీ ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల సగటు రీత్యా చూస్తే క్యామ్స్ 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 జులైకల్లా దేశంలోని అతిపెద్ద 15 ఫండ్ హౌస్‌లలో 9 సంస్థలను క్లయింట్లుగా కలిగి ఉంది. టాప్-5 ఎంఎఫ్‌లలో నాలుగింటికి సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment