యాజవూన్యానిదే తప్పు
ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ నివేదిక
ఎఫ్‌టీఐఎల్ బోర్డుకూ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) వ్యవహారంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ తుది నివేదికను సిద్ధం చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్ యాజమాన్యం కొన్ని అంశాలలో కంపెనీల చట్టాన్ని అతిక్రమించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను ఇప్పటికే న్యాయ శాఖ, ఆర్థిక శాఖలతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో జరిగిన కొన్ని రకాల అవకతవకలకు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు(ఎఫ్‌టీఐఎల్) సైతం బాధ్యురాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ఎఫ్‌టీఐఎల్‌కు 99.99% వాటా ఉంది.
పలు అవకతవకలు
2013 నవంబర్‌లో కంపెనీల రిజిస్ట్రార్(ఆర్‌వోసీ) ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్లుగానే ఈ రెండు సంస్థల బోర్డు స్థాయిల్లో అవకతవకలు జరిగినట్లు తాజా నివేదిక సైతం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్‌ను అనుమతించడంపై డెరైక్టర్లు ఎన్నడూ చర్చించలేదని, వీటిని స్వల్పకాలిక కాంట్రాక్ట్‌లతో అనుసంధానించడం వల్ల చెల్లింపుల సంక్షోభం తలెత్తిందని నివేదిక పేర్కొంది. నిజాలను దాచడం, గిడ్డంగుల నిర్వహణలో లోపాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ సక్రమంగా లేకపోవడం, చెల్లింపుల్లో విఫలమైన సభ్యులను ట్రేడింగ్‌కు అనుమతించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు వివరించింది. కార్పొరేట్ పాలన విషయంలో కంపెనీ బోర్డు పూర్తిస్థాయిలో విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈఎల్ ఆడిట్ నివేదికలోనూ పలు లోపాలున్నట్లు వెల్లడించింది.
తప్పించుకోలేరు..
ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ కంపెనీలలో జిగ్నేష్ షాతోపాటు, జోసెఫ్ మాసే, శ్రీకాంత్ జవల్‌గే కర్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్‌వోసీ నివేదిక తెలిపింది. అయితే ఆయా కంపెనీలలో జరిగిన అవకతవకలు తెలియవన్నట్లు తప్పించుకోవడానికి వీలుండదని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఇచ్చిన నివేదికలో ఆర్‌వోసీ స్పష్టం చేసింది కూడా.
ఏం జరిగింది?
ఎల క్ట్రానిక్ పద్ధతిలో వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లను నిర్వహించేందుకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్‌లకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను పూర్తిచేయలేక ఎక్స్ఛేంజీ సంక్షోభంలో చిక్కుకుంది. దీనికితోడు గిడ్డంగుల్లో సైతం తగిన స్థాయిలో సరుకు నిల్వలు లేకపోవడం సంక్షోభాన్ని పెంచింది. దీంతో గతేడాది ఆగస్టులో ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దశలవారీ చెల్లింపులకు కోరిన గడువులలో సైతం ఎక్స్ఛేంజీ నగదు సమకూర్చుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ఇందుకు పలువురు సభ్యులు చెల్లింపుల్లో విఫలంకావడం కారణమైంది.