ఎన్‌ఎస్‌ఈఎల్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్) అవకతవకలపై సీబీఐ నిగ్గుతేలుస్తుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఐపీసీ ఇతర చట్టాలను ఎన్‌ఎస్‌ఈఎల్ ఉల్లంఘించినట్లు సీబీఐకి ఫిర్యాదు అందిందని, దీని ఆధారంగా దర్యాప్తు సంస్థ తగిన చర్యలు చేపడుతుందని గురువారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ కమిటీ ఇటీవలి నివేదిక ఆధారంగా సీబీఐతోపాటు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్‌ఎంసీ), కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) కూడా ఈ చెల్లింపుల సంక్షోభంపై దర్యాప్తు జరపనున్నాయని ఆయన వెల్లడించారు. ‘ఎన్‌ఎస్‌ఈఎల్ ఉదంతంలో అవకతవకలు జరిగినట్లు మాయారామ్ కమిటీ నివేదిక తేల్చింది. దీనిపై ఎప్పటికల్లా చర్యలు ఉంటాయన్న నిర్దిష్ట గడువును నేను చెప్పలేను. అయితే, ఈ మూడు సంస్థలూ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి సాధ్యమైనంత త్వరగానే తగు చర్యలు తీసుకుంటాయి’ అని చిదంబరం పేర్కొన్నారు.
జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్) గ్రూప్‌నకు చెందిన ఎన్‌ఎస్‌ఈఎల్... కమోడిటీ ఫ్యూచర్స్ లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.5,600 కోట్ల మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేయడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆతర్వాత జూలై 31న ఎక్స్ఛేంజ్ కూడా నిలిచిపోయింది. ఇన్వెస్టర్లకు వరుసగా ఆరు వారాల్లో కొంత మొత్తాన్ని చెల్లింపులు చేస్తామని చెప్పిన ఎన్‌ఎస్‌ఈఎల్ మొత్తం ఆరు విడతల్లో కూడా సొమ్ము తిరిగివ్వడంలో విఫలమైంది. కాగా, ప్రమోటర్ సంస్థ ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్‌ఎస్‌ఈఎల్ బదిలీ చేసిన నిధుల విషయంలో పన్ను ఉల్లంఘనలను నిగ్గుతేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగనుంది.
ఇన్వెస్టర్లకు అంతా తెలుసు...
ఎన్‌ఎస్‌ఈఎల్ నియంత్రణ సంస్థల కనుసన్నల్లో లేదని ఇన్వెస్టర్లకు తెలుసని చిదంబరం పేర్కొన్నారు. ‘ఇది ఎఫ్‌ఎంసీ నియంత్రణలో రిజిస్టర్ అయిన సంస్థ కాదు. అయినా, వ్యాపారం ప్రారంభానికి ముందే కొన్ని మినహాయింపులు పొంది ఎక్స్ఛేంజ్ మొదలైంది. దీనిపై నియంత్రణ లేదన్న విషయం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు తెలుసు. ఆరంభమైన తొలినాళ్లనుంచే నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తున్న ఎన్‌ఎస్‌ఈఎల్‌ను గుడ్డిగా నమ్మి ఇన్వెస్టర్లు మోసపోయారు’ అని చిదంబరం చెప్పారు.
ఇతర నియంత్రణ సంస్థలూ అప్రమత్తం...
ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం ఇతర మార్కెట్లకూ పాకొచ్చనే భయాలు నెలకొన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సెబీ, ఎఫ్‌ఎంసీలకు సూచించినట్లు చిదంబరం చెప్పారు. అసలు ఎక్స్ఛేంజ్ ప్రాథమిక వ్యాపార నిబంధనలనే ఎన్‌ఎస్‌ఈఎల్ తుంగలోకితొక్కుతూ వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రమోటర్ అయిన ఎఫ్‌టీఐఎల్... మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను కూడా ప్రమోట్ చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రమోటర్లకు చెందిన ఇతర ఎక్స్ఛేంజీల్లో యాజమాన్య మార్పులపై ప్రభుత్వం దృష్టిపెట్టిందా అన్న ప్రశ్నకు.. విచారణ నివేదికలు వచ్చాక ఆలోచించగలమని చిదంబరం పేర్కొన్నారు. ‘సంక్షోభంపై ఎఫ్‌ఎంసీ నివేదిక ఒకట్రెండు రోజుల్లో వస్తుంది. దీన్ని పరిశీలించాక సీబీఐ, ఎంసీఏ కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నిర్ణయిస్తాయి. ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రమోటర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో బ్లాక్‌మనీ వంటి వ్యవహరాలేవైనా ఉన్నాయా అనేదానిపైనా ఐటీ శాఖ దృష్టిసారిస్తోంది’ అని విత్తమంత్రి చెప్పారు.
కోర్టుకు కూడా వెళ్లొచ్చు...: మరోపక్క, ఎన్‌ఎస్‌ఈఎల్ వ్యవహారం ఇన్వెస్టర్లు, కంపెనీకి మధ్య అంశం అయినందున వాళ్లు కచ్చితంగా తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించ వచ్చని చిదంబరం తెలిపారు. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో లావాదేవీలు జరుపుతున్న ఇన్వెస్టర్లు దాదాపు 17,000 మంది దాకా ఉంటారు. వీరిలో 9,000 మంది వరకూ ఇన్వెస్టర్లు ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టెమాటిక్స్ వంటి టాప్-8 బ్రోకరేజి సంస్థల ద్వారా ట్రేడింగ్ జరిపారు.