న్యూఢిల్లీ: డేటా గోప్యత విషయంలో రాజీ పడకూదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటాకు రక్షణ ఉండాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) నిర్వహించింది.
‘‘డిజిటల్ లావాదేవీల విలువ 2021 జనవరి–ఆగస్ట్ కాలంలో రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020లో ఈ మొత్తం రూ.4లక్షల కోట్లు, 2019లో రూ.2 లక్షల కోట్లుగానే ఉంది. డేటా గోప్యత అన్నది ఎంతో ముఖ్యమైనది. ఈ అంశంపై ఎన్నో వివాదాస్పద అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ డేటా గోప్యతను గౌరవించడం కనీస సూత్రం. క్లయింట్ల సమాచారానికి తగినంత రక్షణ కల్పించడం అన్నది విశ్వాస కల్పనకు వెన్నెముక అవుతుంది.
నా సమాచారానికి రక్షణ లేనంత వరకు ఈ అంశాల పట్ల ఆసక్తి చూపించను’’ అని మంత్రి సీతారామన్ తన అభిప్రాయాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలోనే ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. భారత్‌లో ఫిన్‌టెక్ అమలు 87%గా ఉందని.. అదే ప్రపంచవ్యాప్తంగా దీని సగటు అమలు 64 శాతమేనని తెలిపారు. డిజిటల్ కార్యకలాపాలు, లావాదేవీలకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరించినట్టు పేర్కొన్నారు.
డిజిటల్ మోసాలకు చెక్..
డిజిటల్ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ అన్నారు. డిజిటల్ మోసాలను తగ్గించడంపైనే అందరి దృష్టి ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ కార్యకలాపాల విస్తరణ ప్రధానంగా పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లోనే ఉంటోందంటూ.. దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
స్మార్ట్‌ఫోన్లు అందరి వద్ద లేనందున.. జనాభాలో ఎక్కువ మందిని చేరుకునేందుకు గాను టెక్నాలజీ పరిష్కారాలు అవసరమన్నారు. ఆర్‌బీఐ శాండ్‌బాక్స్ కార్యక్రమం ద్వారా మెరుగైన ఆప్షన్లను గుర్తించినట్టు చెప్పారు. ఫిన్‌టెక్ విభాగంలో ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి మద్దతుగా.. నియంత్రణ సంస్థలు, భాగస్వాములు అందరూ తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
వాట్సాప్ ఏపీఐ విస్తృత సేవలు
ప్రభుత్వ సేవలు, రిటైల్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ తదితర డిజిటల్ సేవల్లో వాట్సాప్ ఏపీఐ ముఖ్యభూమిక పోషిస్తున్నట్టు వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడానికి వాట్సాప్ ఏపీఐ సాయపడుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. వందలాది వ్యాపారాలు, సేవలు ప్రతి నెలా ప్రారంభమవుతున్నాయి.
మా యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవడం కూడా వేగవంతం అయ్యింది. ఏ రంగంలో అయినా పెద్ద సంస్థ లేదా చిన్న సంస్థ అయినా వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారం అందించడం ఇప్పుడు సులభతరం అయింది. ప్రభుత్వం ‘కోవిన్’, ‘మైజీవోవీ’కు ఏపీఐని ఇటీవలే ప్రారంభించగా.. వాట్సాప్‌లోనూ ఈ సేవలను విస్తరించాము. దీంతో వాట్సాప్ నుంచే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు, వ్యాక్సిన్ స్లాట్లను తెలుసుకోవడం, టీకాలకు అపాయింట్‌మెంట్లు తీసుకోవడం, టీకా సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కలిగింది’’ అని బోస్ చెప్పారు.
బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు కలసి పనిచేయాలి
స్టాన్‌చార్ట్ బ్యాంకు ఎండీ దరువాలా
బ్యాంకులు, పెద్ద టెక్నాలజీ కంపెనీలు (బిట్ టెక్), ఫిన్‌టెక్ కంపెనీలు సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవచ్చని.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఎండీ జరిన్ దరువాలా అభిప్రాయపడ్డారు. అలాగే, రుణ వితరణలోనూ నిర్ణయాలు తీసుకునేందుకు అనలైటిక్స్‌ను వినియోగించుకోవచ్చన్నారు. కలసికట్టుగా సాగడం వచ్చే కొన్నేళ్లలో సాధ్యపడొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో భాగంగా దరువాలా మాట్లాడారు. తమదగ్గరున్న భారీ డేటాబేస్ (కస్టమర్ల సమాచారం/వివరాలు)ను తగిన విధంగా వినియోగించుకోవడంలో బ్యాంకులు వెనుకబడ్డాయని.. అయినప్పటికీ గత రెండు మూడేళ్లలో వేగంగా పుంజుకున్నట్టు చెప్పారు. ఫిన్‌టెక్‌లతో కలసి పనిచేయడం వల్ల బ్యాంకులు ఖర్చులను తగ్గించుకోగలవన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment