Internet and Mobile Association of India
-
వినోద రంగానికి పైరసీ దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో పరిశ్రమ గతేడాది (2023) ఏకంగా రూ.22,400 కోట్ల మేర నష్టపోయింది. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన ’ది రాబ్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మీడియా వినియోగదార్లలో 51 శాతం మంది పైరసీ అయిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం లేదా కాపీరైట్ హక్కులున్న మెటీరియల్‌ను (సంగీతం, సినిమాలు, సాఫ్ట్వేర్ మొదలైనవి) వినియోగించుకోవడాన్ని పైరసీగా వ్యవహరిస్తారు. ఒరిజినల్ క్రియేటర్ల హక్కులను హరించి, వారిని గణనీయంగా నష్టపరుస్తుంది కాబట్టి దీన్ని ఒక విధంగా దొంగతనంగా కూడా పరిగణిస్తారు. ‘భారత మీడియా–వినోద పరిశ్రమలో సెగ్మెంట్లవారీ ఆదాయపరంగా చూస్తే 2023లో పైరసీ ఎకానమీ రూ. 22,400 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం రూ. 13,700 కోట్లుగా, ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి జనరేట్ చేసినది రూ. 8,700 కోట్లుగా ఉంటుంది. పైరసీ కంటెంట్ వల్ల రూ. 4,300 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ నష్టాలు వాటిల్లి ఉంటుందని అంచనా‘ అని నివేదిక వివరించింది. సబ్ర్స్కిప్షన్ ఫీజులు భారీగా ఉండటమే కారణం పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి నిర్దిష్ట కారణాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. సబ్స్క్రిప్షన్ ఫీజులు అధికంగా ఉండటం, కోరుకునే కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఒక్కో సబ్ర్స్కిప్షన్ను నిర్వహించుకోవడమనేది సమస్యగా మారడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. పైరసీ ఎక్కువగా 19–34 ఏళ్ల ఆడియన్స్‌లో ఉంటోందని, మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ సినిమాలను వీక్షిస్తున్నారని నివేదిక తెలిపింది. పైరేటెడ్ కంటెంట్‌ను చూసే వారు, దాన్ని ఉచితంగా అందిస్తే, ప్రకటనలపరంగా అంతరాయాలు వచి్చనా, అధికారిక చానల్స్‌కి మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. కంటెంట్ ప్రొవైడర్లు ధరల విధానాలను, కంటెంట్‌ను అందుబాటులో ఉంచే వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పైరేటెడ్ కంటెంట్ వినియోగదారుల్లో 70 శాతం మంది తాము ఏ ఓటీటీ సబ్ర్స్కిప్షన్నూ తీసుకోదల్చుకోలేదని తెలిపారు. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పైరసీ ఎక్కువగా ఉంటోంది. అధికారికంగా కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, పైరేటెడ్ కంటెంట్ సులువుగా లభిస్తుండటం, పైరసీ వల్ల వచ్చే నష్టాలపై అవగాహన లేకపోవడం, ఆదాయాల్లో వ్యత్యాసాలు, థియేటర్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా పైరసీ విస్తృతికి కారణంగా ఉంటున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని యూజర్లు సాధారణంగా పాత సినిమాలను వీక్షించేందుకు పైరేటెడ్ కంటెంట్‌ను ఆశ్రయిస్తుండగా, ద్వితీయ శ్రేణి నగరాల్లోని వారు టికెట్టు కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈమధ్యే విడుదలైన కొత్త సినిమాలను చట్టవిరుద్ధంగా చూసేందుకు ఉపయోగిస్తున్నారు. సమిష్టిగా పోరాడాలి.. పైరసీ వల్ల వాటిల్లుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, దాన్ని కట్టడి చేసేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఏఎంఏఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్ చెప్పారు. ‘దేశీయంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతోందనేది కాదనలేని వాస్తవం. 2026 నాటికి ఫిలిం ఎంటర్టైన్మెంట్ రూ. 14,600 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి పెను ముప్పు పొంచి ఉంది. కాబట్టి, ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు అందరూ కూడా కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
అమెరికాను మించిపోయిన్ భారత్.. ఆన్లైన్ @ 34.6 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్‌లో ఇంటర్నెట్’ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్‌లో 90 కోట్లను తాకుతుంది. యూపీఐ వినియోగం భేష్: ప్రధాని న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. -
డేటా గోప్యత విషయంలో రాజీ పడకూడదు
న్యూఢిల్లీ: డేటా గోప్యత విషయంలో రాజీ పడకూదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటాకు రక్షణ ఉండాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) నిర్వహించింది. ‘‘డిజిటల్ లావాదేవీల విలువ 2021 జనవరి–ఆగస్ట్ కాలంలో రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020లో ఈ మొత్తం రూ.4లక్షల కోట్లు, 2019లో రూ.2 లక్షల కోట్లుగానే ఉంది. డేటా గోప్యత అన్నది ఎంతో ముఖ్యమైనది. ఈ అంశంపై ఎన్నో వివాదాస్పద అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ డేటా గోప్యతను గౌరవించడం కనీస సూత్రం. క్లయింట్ల సమాచారానికి తగినంత రక్షణ కల్పించడం అన్నది విశ్వాస కల్పనకు వెన్నెముక అవుతుంది. నా సమాచారానికి రక్షణ లేనంత వరకు ఈ అంశాల పట్ల ఆసక్తి చూపించను’’ అని మంత్రి సీతారామన్ తన అభిప్రాయాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలోనే ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. భారత్‌లో ఫిన్‌టెక్ అమలు 87%గా ఉందని.. అదే ప్రపంచవ్యాప్తంగా దీని సగటు అమలు 64 శాతమేనని తెలిపారు. డిజిటల్ కార్యకలాపాలు, లావాదేవీలకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరించినట్టు పేర్కొన్నారు. డిజిటల్ మోసాలకు చెక్.. డిజిటల్ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ అన్నారు. డిజిటల్ మోసాలను తగ్గించడంపైనే అందరి దృష్టి ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ కార్యకలాపాల విస్తరణ ప్రధానంగా పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లోనే ఉంటోందంటూ.. దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్మార్ట్ఫోన్లు అందరి వద్ద లేనందున.. జనాభాలో ఎక్కువ మందిని చేరుకునేందుకు గాను టెక్నాలజీ పరిష్కారాలు అవసరమన్నారు. ఆర్బీఐ శాండ్బాక్స్ కార్యక్రమం ద్వారా మెరుగైన ఆప్షన్లను గుర్తించినట్టు చెప్పారు. ఫిన్‌టెక్ విభాగంలో ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి మద్దతుగా.. నియంత్రణ సంస్థలు, భాగస్వాములు అందరూ తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. వాట్సాప్ ఏపీఐ విస్తృత సేవలు ప్రభుత్వ సేవలు, రిటైల్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ తదితర డిజిటల్ సేవల్లో వాట్సాప్ ఏపీఐ ముఖ్యభూమిక పోషిస్తున్నట్టు వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడానికి వాట్సాప్ ఏపీఐ సాయపడుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. వందలాది వ్యాపారాలు, సేవలు ప్రతి నెలా ప్రారంభమవుతున్నాయి. మా యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవడం కూడా వేగవంతం అయ్యింది. ఏ రంగంలో అయినా పెద్ద సంస్థ లేదా చిన్న సంస్థ అయినా వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారం అందించడం ఇప్పుడు సులభతరం అయింది. ప్రభుత్వం ‘కోవిన్’, ‘మైజీవోవీ’కు ఏపీఐని ఇటీవలే ప్రారంభించగా.. వాట్సాప్‌లోనూ ఈ సేవలను విస్తరించాము. దీంతో వాట్సాప్ నుంచే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు, వ్యాక్సిన్ స్లాట్లను తెలుసుకోవడం, టీకాలకు అపాయింట్మెంట్లు తీసుకోవడం, టీకా సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కలిగింది’’ అని బోస్ చెప్పారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు కలసి పనిచేయాలి స్టాన్‌చార్ట్ బ్యాంకు ఎండీ దరువాలా బ్యాంకులు, పెద్ద టెక్నాలజీ కంపెనీలు (బిట్ టెక్), ఫిన్‌టెక్ కంపెనీలు సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవచ్చని.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఎండీ జరిన్ దరువాలా అభిప్రాయపడ్డారు. అలాగే, రుణ వితరణలోనూ నిర్ణయాలు తీసుకునేందుకు అనలైటిక్స్‌ను వినియోగించుకోవచ్చన్నారు. కలసికట్టుగా సాగడం వచ్చే కొన్నేళ్లలో సాధ్యపడొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో భాగంగా దరువాలా మాట్లాడారు. తమదగ్గరున్న భారీ డేటాబేస్ (కస్టమర్ల సమాచారం/వివరాలు)ను తగిన విధంగా వినియోగించుకోవడంలో బ్యాంకులు వెనుకబడ్డాయని.. అయినప్పటికీ గత రెండు మూడేళ్లలో వేగంగా పుంజుకున్నట్టు చెప్పారు. ఫిన్‌టెక్‌లతో కలసి పనిచేయడం వల్ల బ్యాంకులు ఖర్చులను తగ్గించుకోగలవన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
టెల్కోలకు అనుకూలంగా పనిచేస్తోంది
ట్రాయ్‌పై ఐఏఎంఏఐ ఆరోపణలు నెట్ న్యూట్రాలిటీకి పెరుగుతున్న మద్దతు న్యూఢిల్లీ: నెట్ వినియోగంలో కొన్ని సైట్లకు ప్రాధాన్యమిచ్చేలా టెలికం సంస్థలు వ్యవహరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ .. టెల్కోలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) ఆరోపించింది. ఇంటర్నెట్ సేవలందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన(నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను డేటా చార్జీల ప్రసక్తి లేకుండా ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ ప్రవేశపెట్టిన చర్చాపత్రంలోని పలు అంశాలన్నీ టెల్కోల సిఫార్సులేనని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ శుభో రాయ్ చెప్పారు. చర్చాపత్రాన్ని చూస్తే ఇంటర్నెట్ ఏ నియమ, నిబంధనల పరిధిలోకి రాదన్న భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ఇంటర్నెట్ కంపెనీలు ఐటీ చట్టానికి లోబడే కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుందన్నారు. నెట్ న్యూట్రాలిటీ, వాట్స్‌యాప్.. స్కైప్ తదితర కాలింగ్ సర్వీసుల మీద మార్చి 27న ట్రాయ్ ఆవిష్కరించిన చర్చాపత్రంపై తమ అభిప్రాయాలను వారం రోజుల్లోగా తెలియజేయనున్నట్లు రాయ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే 7-8 లక్షల పైచిలుకు మంది తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు పంపినట్లు సమాచారం. నెటిజన్లు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 24లోగా పంపాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్, మెసేజింగ్ తదితర సర్వీసుల యాప్స్.. వ్యక్తులతో పాటు దేశభద్రతకు కూడా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చాపత్రంలో ట్రాయ్ పేర్కొంది. గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు మేక్మైట్రిప్ తదితర దేశీ సంస్థలు ఐఏఎంఏఐలో సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్నెట్ఆర్గ్నుంచి తప్పుకున్న క్లియర్‌ట్రిప్ నెట్ న్యూట్రాలిటీపై వివాదం నేపథ్యంలో ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ క్లియర్‌ట్రిప్, మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూప్ సంస్థలు ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగాయి. న్యూట్రాలిటీకి మద్దతు ప్రకటిస్తూ, ఈ తరహా ప్లాట్‌ఫాంల నుంచి మిగతా పబ్లిషర్లు కూడా వైదొలగాలంటూ టైమ్స్ గ్రూప్ కోరింది. న్యూట్రాలిటీపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నందున తాము పునరాలోచించుకుని ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగినట్లు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబ్రమణ్య శర్మ తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ చేరువ చేసే నినాదంతో సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ఫేస్బుక్ ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఈ తరహా ప్యాకేజీని ప్రకటించిన ఎయిర్‌టెల్‌కు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.సమర్ధించుకున్న ఫేస్బుక్..: ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ అనేది నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని ఫేస్బుక్ చీఫ్ మార్క్ జకర్బర్గ్ స్పష్టం చేశారు. నెట్ కనెక్టివిటీ అసలు లేకపోవడం కన్నా ఎంతో కొంత అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీతో పాటు ఇలాంటివి కూడా అవసరమేనని జకర్బర్గ్ పేర్కొన్నారు.