2023లో రూ. 22,400 కోట్ల నష్టం
ఈవై–ఐఏఎంఏఐ నివేదిక
న్యూఢిల్లీ: దేశీ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో పరిశ్రమ గతేడాది (2023) ఏకంగా రూ.22,400 కోట్ల మేర నష్టపోయింది. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన ’ది రాబ్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మీడియా వినియోగదార్లలో 51 శాతం మంది పైరసీ అయిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం లేదా కాపీరైట్ హక్కులున్న మెటీరియల్‌ను (సంగీతం, సినిమాలు, సాఫ్ట్‌వేర్ మొదలైనవి) వినియోగించుకోవడాన్ని పైరసీగా వ్యవహరిస్తారు.
ఒరిజినల్ క్రియేటర్ల హక్కులను హరించి, వారిని గణనీయంగా నష్టపరుస్తుంది కాబట్టి దీన్ని ఒక విధంగా దొంగతనంగా కూడా పరిగణిస్తారు. ‘భారత మీడియా–వినోద పరిశ్రమలో సెగ్మెంట్లవారీ ఆదాయపరంగా చూస్తే 2023లో పైరసీ ఎకానమీ రూ. 22,400 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం రూ. 13,700 కోట్లుగా, ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి జనరేట్ చేసినది రూ. 8,700 కోట్లుగా ఉంటుంది. పైరసీ కంటెంట్ వల్ల రూ. 4,300 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్‌టీ నష్టాలు వాటిల్లి ఉంటుందని అంచనా‘ అని నివేదిక వివరించింది.
సబ్ర్‌స్కిప్షన్ ఫీజులు భారీగా ఉండటమే కారణం
పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి నిర్దిష్ట కారణాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ ఫీజులు అధికంగా ఉండటం, కోరుకునే కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఒక్కో సబ్ర్‌స్కిప్షన్‌ను నిర్వహించుకోవడమనేది సమస్యగా మారడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. పైరసీ ఎక్కువగా 19–34 ఏళ్ల ఆడియన్స్‌లో ఉంటోందని, మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ సినిమాలను వీక్షిస్తున్నారని నివేదిక తెలిపింది. పైరేటెడ్ కంటెంట్‌ను చూసే వారు, దాన్ని ఉచితంగా అందిస్తే, ప్రకటనలపరంగా అంతరాయాలు వచి్చనా, అధికారిక చానల్స్‌కి మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.
కంటెంట్ ప్రొవైడర్లు ధరల విధానాలను, కంటెంట్‌ను అందుబాటులో ఉంచే వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పైరేటెడ్ కంటెంట్ వినియోగదారుల్లో 70 శాతం మంది తాము ఏ ఓటీటీ సబ్ర్‌స్కిప్షన్‌నూ తీసుకోదల్చుకోలేదని తెలిపారు. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పైరసీ ఎక్కువగా ఉంటోంది.
అధికారికంగా కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, పైరేటెడ్ కంటెంట్ సులువుగా లభిస్తుండటం, పైరసీ వల్ల వచ్చే నష్టాలపై అవగాహన లేకపోవడం, ఆదాయాల్లో వ్యత్యాసాలు, థియేటర్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా పైరసీ విస్తృతికి కారణంగా ఉంటున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని యూజర్లు సాధారణంగా పాత సినిమాలను వీక్షించేందుకు పైరేటెడ్ కంటెంట్‌ను ఆశ్రయిస్తుండగా, ద్వితీయ శ్రేణి నగరాల్లోని వారు టికెట్టు కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈమధ్యే విడుదలైన కొత్త సినిమాలను చట్టవిరుద్ధంగా చూసేందుకు ఉపయోగిస్తున్నారు.
సమిష్టిగా పోరాడాలి..
పైరసీ వల్ల వాటిల్లుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, దాన్ని కట్టడి చేసేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఏఎంఏఐ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్ చెప్పారు. ‘దేశీయంగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతోందనేది కాదనలేని వాస్తవం. 2026 నాటికి ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్ రూ. 14,600 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి పెను ముప్పు పొంచి ఉంది. కాబట్టి, ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు అందరూ కూడా కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment