86 శాతం ఓటీటీ వినియోగం
ఐఎంఏ–కాంటార్ నివేదిక వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్‌కాస్ట్‌ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు.
ఇంటర్నెట్ వినియోగం ఇలా..
ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు.
స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment