టెల్కోలకు అనుకూలంగా పనిచేస్తోంది
ట్రాయ్‌పై ఐఏఎంఏఐ ఆరోపణలు
నెట్ న్యూట్రాలిటీకి పెరుగుతున్న మద్దతు
న్యూఢిల్లీ: నెట్ వినియోగంలో కొన్ని సైట్లకు ప్రాధాన్యమిచ్చేలా టెలికం సంస్థలు వ్యవహరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ .. టెల్కోలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) ఆరోపించింది.
ఇంటర్నెట్ సేవలందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన(నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను డేటా చార్జీల ప్రసక్తి లేకుండా ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ ప్రవేశపెట్టిన చర్చాపత్రంలోని పలు అంశాలన్నీ టెల్కోల సిఫార్సులేనని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ శుభో రాయ్ చెప్పారు. చర్చాపత్రాన్ని చూస్తే ఇంటర్నెట్ ఏ నియమ, నిబంధనల పరిధిలోకి రాదన్న భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అన్ని ఇంటర్నెట్ కంపెనీలు ఐటీ చట్టానికి లోబడే కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుందన్నారు. నెట్ న్యూట్రాలిటీ, వాట్స్‌యాప్.. స్కైప్ తదితర కాలింగ్ సర్వీసుల మీద మార్చి 27న ట్రాయ్ ఆవిష్కరించిన చర్చాపత్రంపై తమ అభిప్రాయాలను వారం రోజుల్లోగా తెలియజేయనున్నట్లు రాయ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే 7-8 లక్షల పైచిలుకు మంది తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు పంపినట్లు సమాచారం. నెటిజన్లు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 24లోగా పంపాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్, మెసేజింగ్ తదితర సర్వీసుల యాప్స్.. వ్యక్తులతో పాటు దేశభద్రతకు కూడా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చాపత్రంలో ట్రాయ్ పేర్కొంది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు మేక్‌మైట్రిప్ తదితర దేశీ సంస్థలు ఐఏఎంఏఐలో సభ్యులుగా ఉన్నాయి.
ఇంటర్నెట్‌ఆర్గ్‌నుంచి తప్పుకున్న క్లియర్‌ట్రిప్
నెట్ న్యూట్రాలిటీపై వివాదం నేపథ్యంలో ఆన్‌లైన్ ట్రావెల్ సేవల సంస్థ క్లియర్‌ట్రిప్, మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూప్ సంస్థలు ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగాయి. న్యూట్రాలిటీకి మద్దతు ప్రకటిస్తూ, ఈ తరహా ప్లాట్‌ఫాంల నుంచి మిగతా పబ్లిషర్లు కూడా వైదొలగాలంటూ టైమ్స్ గ్రూప్ కోరింది. న్యూట్రాలిటీపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నందున తాము పునరాలోచించుకుని ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగినట్లు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబ్రమణ్య శర్మ తెలిపారు.
అందరికీ ఇంటర్నెట్ చేరువ చేసే నినాదంతో సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఈ తరహా ప్యాకేజీని ప్రకటించిన ఎయిర్‌టెల్‌కు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.సమర్ధించుకున్న ఫేస్‌బుక్..: ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ అనేది నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జకర్‌బర్గ్ స్పష్టం చేశారు. నెట్ కనెక్టివిటీ అసలు లేకపోవడం కన్నా ఎంతో కొంత అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీతో పాటు ఇలాంటివి కూడా అవసరమేనని జకర్‌బర్గ్ పేర్కొన్నారు.