పసిడి... లాభాల స్వీకరణ!
వారంలో 16 డాలర్లు డౌన్
1,240 డాలర్ల వద్ద కీలక మద్దతు
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో శుక్రవారం 30వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) ధర 16 డాలర్లు తగ్గి 1,242 డాలర్ల వద్దకు చేరింది. అంతక్రితం వారం (23వ తేదీతో ముగిసిన) 1,240 డాలర్ల వద్ద రెండు సార్లు కీలక మద్దతు తీసుకుని పైకి ఎగసిన పసిడి, తాజాగా ముగిసిన సమీక్షా వారంలో కూడా ఈ స్థాయిని మూడు సార్లు తాకింది. దీంతో ఈ ధర వద్ద పసిడి కన్సాలిడేషన్ జరుగుతోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక్కడ నుంచి పసిడి మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని కూడా వారు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయి నుంచి కిందకు జారి, ఒక ట్రేడింగ్ సెషన్‌లో ఆలోపు ముగిస్తే, తిరిగి ఇక పసిడి తక్షణ మద్దతు స్థాయి 1,211 అని కూడా వారి విశ్లేషణలు చెబు తున్నాయి. పసిడి తిరిగి ముందుకు దూకుతుందనడానికి గత వారంలో డాలర్ ఇండెక్స్ 1.50 డాలర్లు పడిపోయి 95.39 డాలర్లకు చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డాలర్ బలహీనత పసిడికి బలంగా మారుతుందని ఇప్పటివరకూ గణాంకాలు సూచిస్తున్నాయి.
దేశీయంగానూ కిందికే...
మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ధోరణిని కొనసాగించింది. ధర రూ. 305 పడిపోయి, రూ.28,734 నుంచి 28,439కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.140 తగ్గి, రూ.28,770కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.28,620కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర మాత్రం వారం వారీగా స్వల్పంగా పెరిగి రూ.39,080కి చేరింది.