బడ్జెట్ అనంతరం సాంప్రదాయకంగా జరిగే ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ శక్తికాంత్‌దాస్ తదితర సీనియర్ అధికారులు
న్యూఢిల్లీ: విదేశీ సావరిన్ బాండ్ల జారీపై ప్రభుత్వంపై సెంట్రల్ బ్యాంక్ చర్చిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారంనాడు పేర్కొన్నారు. 2019–20 వార్షిక బడ్జెట్ ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018–18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ మొత్తాన్ని బడ్జెట్ రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెంచింది. తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ మార్కెట్ల ద్వారా విదేశీ కరెన్సీలో సమకూర్చుకోవాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) స్థాయితో పోల్చిచూస్తే, ప్రభుత్వ (సావరిన్) విదేశీ రుణ భారం అతితక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్న ఆర్థికమంత్రి, ఈ వ్యత్యాసం ఐదు శాతం కన్నా తక్కువగా ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి ఉంది. విదేశీ మార్కెట్లో మాత్రం బాండ్ల జారీ జరగలేదు. అయితే త్వరలో బాండ్ల జారీ ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదాయ–వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకోడానికి దోహదపడే చర్యల్లో విదేశీ సావరిన్ బాండ్ల జారీ ఒకటి. అయితే ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే...
♦ స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు శాతాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించడం హర్షణీయం. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికీ దోహదపడే చర్య ఇది.
♦ ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరిస్తోంది. 4.5 శాతం నుంచి 3.3 శాతానికి కట్టడి చేస్తున్న విషయం గమనార్హం.
♦ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంలో పూర్తి సమన్వయంతో ఆర్‌బీఐ పనిచేస్తుంది. పరస్పర అవగాహనా చర్చలు జరుపుతుంది.
♦ ప్రభుత్వంలో, అలాగే ఆర్‌బీఐలో సమగ్ర చర్చ తర్వాతే గృహ రుణ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) నియంత్రణ బాధ్యతలను సెంట్రల్ బ్యాంక్‌కు ఇవ్వడం జరిగింది. ఈ అదనపు బాధ్యతలను సమర్థవంతంగా ఆర్‌బీఐ నిర్వహిస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. నియంత్రణ బాధ్యతలను ఆర్‌బీఐ నిర్వహిస్తే, పర్యవేక్షణా బాధ్యతలను నాబార్డ్ (వ్యయసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్) నిర్వహిస్తుంది.
♦ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరితగతిన వినియోగదారుకు మళ్లిస్తారని భావిస్తున్నాం. జూన్ 6 నాటికి ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్లు (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 0.75 శాతం) ఆర్‌బీఐ తగ్గిస్తే, బ్యాంకులు కేవలం 21 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్నే గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలకు అందించాయి.
♦ బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) పనితీరును ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
♦ పెట్రో ధరల పెంపు ప్రభావం వ్యవస్థలో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపడానికి ఇంకా సమయం పడుతుంది.
♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.70,000 కోట్ల తాజా మూలధన సమకూర్పు సానుకూల చర్య. దీనివల్ల లిక్విడిటీ సమస్యలూ తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment