Savarin Gold Bond scheme
-
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
సావరిన్ బాండ్ల జారీపై ప్రభుత్వంతో చర్చిస్తాం!
న్యూఢిల్లీ: విదేశీ సావరిన్ బాండ్ల జారీపై ప్రభుత్వంపై సెంట్రల్ బ్యాంక్ చర్చిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారంనాడు పేర్కొన్నారు. 2019–20 వార్షిక బడ్జెట్ ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018–18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ మొత్తాన్ని బడ్జెట్ రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెంచింది. తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ మార్కెట్ల ద్వారా విదేశీ కరెన్సీలో సమకూర్చుకోవాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) స్థాయితో పోల్చిచూస్తే, ప్రభుత్వ (సావరిన్) విదేశీ రుణ భారం అతితక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్న ఆర్థికమంత్రి, ఈ వ్యత్యాసం ఐదు శాతం కన్నా తక్కువగా ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి ఉంది. విదేశీ మార్కెట్లో మాత్రం బాండ్ల జారీ జరగలేదు. అయితే త్వరలో బాండ్ల జారీ ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదాయ–వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకోడానికి దోహదపడే చర్యల్లో విదేశీ సావరిన్ బాండ్ల జారీ ఒకటి. అయితే ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే... ♦ స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు శాతాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించడం హర్షణీయం. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికీ దోహదపడే చర్య ఇది. ♦ ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరిస్తోంది. 4.5 శాతం నుంచి 3.3 శాతానికి కట్టడి చేస్తున్న విషయం గమనార్హం. ♦ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంలో పూర్తి సమన్వయంతో ఆర్బీఐ పనిచేస్తుంది. పరస్పర అవగాహనా చర్చలు జరుపుతుంది. ♦ ప్రభుత్వంలో, అలాగే ఆర్బీఐలో సమగ్ర చర్చ తర్వాతే గృహ రుణ కంపెనీ (హెచ్ఎఫ్సీ) నియంత్రణ బాధ్యతలను సెంట్రల్ బ్యాంక్‌కు ఇవ్వడం జరిగింది. ఈ అదనపు బాధ్యతలను సమర్థవంతంగా ఆర్బీఐ నిర్వహిస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. నియంత్రణ బాధ్యతలను ఆర్బీఐ నిర్వహిస్తే, పర్యవేక్షణా బాధ్యతలను నాబార్డ్ (వ్యయసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్) నిర్వహిస్తుంది. ♦ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరితగతిన వినియోగదారుకు మళ్లిస్తారని భావిస్తున్నాం. జూన్ 6 నాటికి ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 0.75 శాతం) ఆర్బీఐ తగ్గిస్తే, బ్యాంకులు కేవలం 21 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్నే గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలకు అందించాయి. ♦ బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) పనితీరును ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ♦ పెట్రో ధరల పెంపు ప్రభావం వ్యవస్థలో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపడానికి ఇంకా సమయం పడుతుంది. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.70,000 కోట్ల తాజా మూలధన సమకూర్పు సానుకూల చర్య. దీనివల్ల లిక్విడిటీ సమస్యలూ తగ్గుతాయి. -
పోస్టల్లో గోల్డ్ బాండు సేవలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : పోస్టల్ శాఖ ఇకపై గోల్డ్ బాండు సేవలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండు పథకంలో భాగంగా 6వ సారి పోస్టల్ శాఖలో ఈగోల్డ్ బాండు సేవలను ప్రవేశపెట్టింది. గోల్డ్ బాండు అమ్మకాలల్లో ప్రస్తుతం సాధారణ సగటు ధర రూ.2957 గా నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. కొనుగోలు దారులు 1 గ్రాము నుంచి 500 గ్రాముల వరకు గోల్డ్ బాండులను కొనవచ్చు. ఈ బాండుకు సంబంధించి వడ్డీ రేటు 2.50 వర్తిస్తుందన్నారు. బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైన నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 6నెలలకు ఒకసారి కొనుగొలు దారుని బ్యాంక్ ఖాతాలో పిక్స్డ్ వడ్డీ జమ చేయడం జరుగుతుంది. కాలపరిమితి 8 సంవత్సరాల తర్వాత ఆసమయంలో మార్కెట్లో గల బంగారం ధర విలువలను నగదు రూపంలో పెట్టుబడిదారులకు అందిస్తారు. ఈ గోల్డ్ బాండు ద్వారా బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందే వెసులు బాటు కల్పించింది. ఎవరైనా రూ. 20వేలు గోల్డ్ బాండుకు మించితే చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుంది 5 వేల బాండ్ల అమ్మకాలు లక్ష్యం: పోస్టల్ శాఖ ఈ ఏడాది 5వేల గోల్డ్ బాండ్ల అమ్మకాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 166 గోల్డ్ బాండులను అమ్మకాలు సాగించారు. జిల్లాలో కడప, రాజంపేట డివిజన్లు కాగా 395 బ్రాంచ్ పోస్టాపీసులు, 53 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి ఈ పరిధిలో కూడా గోల్డ్ బాండు సేవలను ఉపయోగించుకోవచ్చు.