
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలవుతున్నా బ్యాంకింగ్ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులూ తెరిచిఉన్నాయని, ఏటీఎంలు పనిచేస్తున్నాయని సోమవారం ఆమె ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారని, అవసరమైన చోట శానిటైజర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని బ్యాంకులు తమ బ్రాంచ్‌లు తెరిచిఉంచి, ఏటీఎంలను నగదుతో నింపుతున్నాయని, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు చురుకుగా పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
కాగా, కోవిడ్-19 బారి నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు బ్యాంకులు తమ బ్రాంచ్‌లను మూసివేస్తున్నాయనే ప్రచారంతో కస్టమర్లలో నెలకొన్న భయాందోళనను తొలగించేందుకు ఆర్థిక మంత్రి ముందుకొచ్చి ఈ మేరకు ప్రకటించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో బ్యాంకులు తమ శాఖలను మూసివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తమని గురువారం సైతం ఆమె వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా బ్యాంక్ బ్రాంచ్‌లను మూసివేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని ఎస్‌బీఐ ఎండీ పీకే గుప్తా సైతం ఈ ప్రచారాన్నితోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment