bank branches
-
అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్పీఎస్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్)ను అన్ని బ్యాంక్ శాఖలు, తపాలా కార్యాలయాల్లో (పోస్టాఫీసులు) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. ప్రజలకు సులభంగా ఎన్పీఎస్ను అందుబాటులో ఉంచేందుకు, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఎన్పీఎస్ పథకం పంపిణీ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో పీఎఫ్ఆర్డీఏ జట్టు కడుతోంది. దీంతో పల్లెలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందడానికి వీలుంటుంది’’అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి కార్పొరేట్, వ్యక్తిగత స్థాయిలో 13 లక్షల మందిని ఎన్పీఎస్ చందాదారులుగా చేర్చుకునే లక్ష్యంతో ఉన్నట్టు మహంతి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందిని చేర్చుకున్నట్టు పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెపె్టంబర్ 16 నాటికి ఎన్పీఎస్ చందారులు 1.36 కోట్లుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులు 5 కోట్లుగా ఉన్నారు. ఎన్పీఎస్ కింద స్థిర పింఛను ఎందుకు నిర్ణయించలేదన్న ప్రశ్నకు మహంతి బదులిచ్చారు. ‘‘దీర్ఘకాలానికి పింఛను నిర్ణయించడం సాధ్యపడదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, జీడీపీతో సమానంగా లేదంటే అంతకుమించి పింఛను నిధి ఉన్నా కానీ, ఈ విషయంలో సమస్య నెలకొంది’’అని వివరించారు. అయితే, ఎన్పీఎస్ నుంచి రాబడులు మెరుగ్గా ఉంటాయని చెబుతూ.. దీర్ఘకాలంలో మంచి నిధిని ఆశించొచ్చన్నారు. ఎన్పీఎస్ విక్రయంపై వచ్చే కమీషన్ చాలా తక్కువని, అందుకే ఏజెంట్లు దీని పట్ల ఆసక్తి చూపించడం లేదన్నారు. కానీ, ఎన్పీఎస్ను తక్కువ వ్యయంతో కూడిన ఉత్పత్తిగానే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకం నిర్వహణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు. -
బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ అమలవుతున్నా బ్యాంకింగ్ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులూ తెరిచిఉన్నాయని, ఏటీఎంలు పనిచేస్తున్నాయని సోమవారం ఆమె ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారని, అవసరమైన చోట శానిటైజర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని బ్యాంకులు తమ బ్రాంచ్లు తెరిచిఉంచి, ఏటీఎంలను నగదుతో నింపుతున్నాయని, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు చురుకుగా పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, కోవిడ్-19 బారి నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు బ్యాంకులు తమ బ్రాంచ్లను మూసివేస్తున్నాయనే ప్రచారంతో కస్టమర్లలో నెలకొన్న భయాందోళనను తొలగించేందుకు ఆర్థిక మంత్రి ముందుకొచ్చి ఈ మేరకు ప్రకటించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో బ్యాంకులు తమ శాఖలను మూసివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తమని గురువారం సైతం ఆమె వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా బ్యాంక్ బ్రాంచ్లను మూసివేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా సైతం ఈ ప్రచారాన్నితోసిపుచ్చారు. చదవండి : యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం -
300 బ్రాంచ్లు మూత..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు తన శాఖలను మూసివేయబోతుంది. వచ్చే 12 నెలల్లో నష్టాల్లో నడుస్తున్న 300 శాఖలను మూసివేయాలని లేదా వాటిని వేరే ప్రాంతానికి తరలించేయాలని ప్లాన్ చేస్తోంది. నష్టాల్లో నడుస్తున్న శాఖలను లాభాల్లోకి తీసుకురానున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ మెహతా తెలిపారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారులతో ఓ గ్రూప్ ఏర్పాటుచేశామని బ్యాంకు చెప్పింది. బ్యాంకు నెట్వర్క్ హేతుబద్దీకరణకు ఈ గ్రూప్ పలు వ్యూహాలను రూపొందించనుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుకు 6,937 శాఖలున్నాయి. తన నెట్వర్క్కు మరో 178 శాఖలను కలుపుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కూడా మరో మూడు శాఖలను కలుపుకుని, సెప్టెంబర్ నాటికి మొత్తం 6,940 శాఖలను కలిగి ఉంది. పీఎన్బీకి ప్రస్తుతం 100 మిలియన్ కస్టమర్లుండగా.. 9,753 ఏటీఎంలు, 8,224 బీసీ అవుట్లెట్లు ఉన్నాయి. ఆర్బీఐ మే నెలలో పునఃసమీక్షించిన బ్యాంకింగ్ అవుట్లెట్ విధానంలో బ్యాంకులు తమ శాఖలను ప్రారంభించడానికి, వేరే ప్రాంతానికి తరలించడానికి, మూసివేయడానికి మరింత సుస్థిరతను అందించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ తన 300 బ్రాంచులను మూసివేయాలని లేదా తరలింపు చేయాలని భావిస్తోంది. -
మెట్రోల్లో ఇక ఏటీఎం చార్జీల మోత
* ఉచిత లావాదేవీలపై పరిమితులు నేటి నుంచే అమల్లోకి * సొంత బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 లావాదేవీలే * అంతకు మించితే రూ. 20 * హైదరాబాద్ సహా ఆరు మెట్రోల్లో అమలు న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యపై పరిమితులు నేటి నుంచే (నవంబర్ 1) అమల్లోకి రానున్నాయి. దీంతో ఆరు మెట్రో నగరాలకు సంబంధించి సొంత బ్యాంకుల ఏటీఎంలలో సైతం సరే నెలకు అయిదు లావాదేవీలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. నగదు విత్డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ మొదలైనవన్నీ కూడా ఈ పరిమితికి లోబడే ఉంటాయి. అయిదుకు మించితే ప్రతీ దానికి రూ.20 చార్జీలు వర్తిస్తాయి. మరోవైపు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి కూడా మెట్రోల్లో ఇప్పుడున్న అయిదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గుతుంది. అయితే, వీటి విషయంలో ఆర్బీఐ కొంత వెసులుబాటునిచ్చింది. మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల ఏటీఎంలలో రెండు నిర్వహించుకునే వీలు కల్పించింది. తాజా మార్పులు సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంట్లు అన్నింటికీ వర్తిస్తాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో ఈ పరిమితులు అమలవుతాయి. ఆర్బీఐ అనుమతి ఫలితం...: ఏటీఎంలు, బ్యాంకుల శాఖలు పెరగడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఉచిత లావాదేవీల పరిమితిని కుదించవచ్చని ఈ ఏడాది ఆగస్టులో ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని ఉచిత లావాదేవీలు అనుమతించాలన్నది ఆయా బ్యాంకులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ భారంగా మారుతోందని, పెపైచ్చు ఉచిత లావాదేవీల వల్ల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని బ్యాంకుల సమాఖ్య ఐబీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్బీఐ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఆరు మెట్రో నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉచిత లావాదేవీలు యథాప్రకారంగానే ఉంటాయి. నో ఫ్రిల్స్ అకౌంట్ల ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పట్లాగానే అయిదు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. -
ముగిసిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలు పెంచాలని, బ్యాంకింగ్ సంస్కరణలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు చేసిన సమ్మె విజయవంతమైనట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. సమ్మె ముగియడంతో బుధవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. కొద్దిగా ఇబ్బం దులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతాదారులు పూర్తి మద్దతు ఇవ్వడం, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ సమ్మె విజయవంతమైనట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలన్నీ వేతనాలు కింద ఇమ్మనడం లేదని, న్యాయబద్ధంగా పెంచాల్సిన జీతాలను మాత్రమే అడుగుతున్నామని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఈ రెండు రోజుల సమ్మెలో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షలమంది పాల్గొన్నారు. తదుపరి కార్యాచరణ కోసం గురువారం సమావేశం అవుతున్నట్లు రాంబాబు తెలిపారు. రెండు రోజుల సమ్మె వలన ప్రభుత్వ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోగా, కొన్ని చోట్ల నగదు లేక ఏటీఎం లావాదేవీలు ఆగిపోయాయి. -
నేడు, రేపు కూడా ముందస్తు పన్ను చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు పన్ను చెల్లింపులకు వీలుగా ఆదివారం కూడా కొన్ని బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి. ముందస్తు పన్నులు స్వీకరించే శాఖలను సెప్టెంబర్ 14, 15న పనిచేసే విధంగా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ ఈ రెండు రోజుల్లో చెల్లింపులు జరపడంలో విఫలమైతే సోమవారం(సెప్టెంబర్ 16) చెల్లింపులు జరపవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి ముందస్తు పన్ను చెల్లింపుల్లో (అడ్వాన్స్ ట్యాక్స్) భాగంగా సెప్టెంబర్ 15 లోగా వీటిని చెల్లించాలి.