ముగిసిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలు పెంచాలని, బ్యాంకింగ్ సంస్కరణలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు చేసిన సమ్మె విజయవంతమైనట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. సమ్మె ముగియడంతో బుధవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. కొద్దిగా ఇబ్బం దులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతాదారులు పూర్తి మద్దతు ఇవ్వడం, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ సమ్మె విజయవంతమైనట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.
బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలన్నీ వేతనాలు కింద ఇమ్మనడం లేదని, న్యాయబద్ధంగా పెంచాల్సిన జీతాలను మాత్రమే అడుగుతున్నామని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఈ రెండు రోజుల సమ్మెలో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షలమంది పాల్గొన్నారు. తదుపరి కార్యాచరణ కోసం గురువారం సమావేశం అవుతున్నట్లు రాంబాబు తెలిపారు. రెండు రోజుల సమ్మె వలన ప్రభుత్వ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోగా, కొన్ని చోట్ల నగదు లేక ఏటీఎం లావాదేవీలు ఆగిపోయాయి.