సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు తన శాఖలను మూసివేయబోతుంది. వచ్చే 12 నెలల్లో నష్టాల్లో నడుస్తున్న 300 శాఖలను మూసివేయాలని లేదా వాటిని వేరే ప్రాంతానికి తరలించేయాలని ప్లాన్ చేస్తోంది. నష్టాల్లో నడుస్తున్న శాఖలను లాభాల్లోకి తీసుకురానున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ మెహతా తెలిపారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారులతో ఓ గ్రూప్ ఏర్పాటుచేశామని బ్యాంకు చెప్పింది. బ్యాంకు నెట్‌వర్క్ హేతుబద్దీకరణకు ఈ గ్రూప్ పలు వ్యూహాలను రూపొందించనుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుకు 6,937 శాఖలున్నాయి. తన నెట్‌వర్క్‌కు మరో 178 శాఖలను కలుపుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కూడా మరో మూడు శాఖలను కలుపుకుని, సెప్టెంబర్ నాటికి మొత్తం 6,940 శాఖలను కలిగి ఉంది. పీఎన్‌బీకి ప్రస్తుతం 100 మిలియన్ కస్టమర్లుండగా.. 9,753 ఏటీఎంలు, 8,224 బీసీ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఆర్‌బీఐ మే నెలలో పునఃసమీక్షించిన బ్యాంకింగ్ అవుట్‌లెట్ విధానంలో బ్యాంకులు తమ శాఖలను ప్రారంభించడానికి, వేరే ప్రాంతానికి తరలించడానికి, మూసివేయడానికి మరింత సుస్థిరతను అందించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ తన 300 బ్రాంచులను మూసివేయాలని లేదా తరలింపు చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment