
30 లక్షల కార్లు రీకాల్ చేస్తున్న నిస్సాన్
టోక్యో: జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారీ స్థాయిలో కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ లో లోపం కారణంగా 30 లక్షల , 80 వేల (3.8 మిలియన్ల)పైగా కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా నార్త్ అమెరికా లో తమ వివిధ మోడళ్ల కార్లను రీకాల్ చేయనుంది. సీటు సెన్సార్ లో లోపం కారణగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తర అమెరికాలో 80 శాతం ఈ కార్లను విక్రయించినట్లు తెలిపింది. సీట్ సెన్సార్ లో లోపం కారణంగా ప్యాసెంజర్ ఉనికిని గుర్తించలేకపోతోందని, అందుకే ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విస్తరించలేక పోతున్నాయని పేర్కొంది. నిస్సాన్ అల్టిమా, లీఫ్,మాక్సిమా, మురానో, పాత్ ఫూండర్, సెంట్రా, రోగ్ తదితర మోడళ్ల కార్లు ఇందులో ఉన్నాయి. ఈ లోపాలను సవరించి, ఈ మే చివరలో డీలర్స్ కు తెలియజేస్తామని తెలిపింది. అయితే గతంలో ఎయిర్ బ్యాగ్ లోపం మూలంగా 11 మరణాలు సంభవించాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో దిగ్గజం టకాటా ఆటో భాగాలా కాదా అనేది స్పష్టత లేదు.